వినేశ్‌ ఫోగట్‌ విజయిని

Vinesh Phogat Vijayini

‘భంగ పరచిన చరిత్ర కుటీరాల నుండి
నేను ఉద్భవిస్తాను…వేళ్లూనుకుపోయిన
బాధామయ గతంనుండి, నేను పైకి లేస్తాను’
– మాయా ఏంజిలో

అవును… అణచివేత నుండి, నిర్భంధాల నుండి, అవమానాల నుండీ ఆమె మరల లేస్తూనే ఉంది. తనశక్తి, ధైర్యాన్ని ఎలుగెత్తుతూనే ఉంది. అయినా ఆమెకు అడ్డంకులెన్నో ఎదురవుతూనే ఉన్నాయి. ఈసారి పైకి కనిపిస్తున్న విషయంగా వందగ్రాముల బరువు తన దారికి అడ్డుగా నిలిచింది. విజయ శిఖరాన్ని చేరకుండా బరువునొడ్డింది. అయినా ఫోగట్‌ 140కోట్ల భారత ప్రజల గుండెల్లో విజయినిగానే నిలిచింది. ప్రపంచ క్రీడాభిమానుల్లోనూ మారుమోగుతున్న పేరు వినేశ్‌ ఫోగట్‌. పతకం ఒక ప్రకటన మాత్రమే. కానీ పోరాటం నిండిన నిరంతర స్ఫూర్తి వినేశ్‌. ఆమె పోరాటం కేవలం పారిస్‌ ఒలంపిక్‌ వేదికపైనే కాదు, భారత రెజ్లింగ్‌ సమాఖ్య పైనా, ప్రభుత్వ విధానంపైనా పోరాడింది. సమాఖ్య ఛైర్మన్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఏడాదిపాటు వీధుల్లోకి వచ్చి పోరాటంచేసినా న్యాయం జరగలేదు. అయినా విశ్రమించ లేదు. తనను ఒలంపిక్‌ ఆటకు దూరం చేసే కుట్రలూ చేశారు. 53 కేజీల రెజ్లింగ్‌ పోటీకి సిద్ధపడుతున్న వేళ, ఆ అవకాశాన్ని ఫోగట్‌కు ఇవ్వలేదు. ఆఖరికి 50 కేజీల విభాగానికి సైతం ప్రయత్నించి ఎట్టకేలకు అర్హత సాధించుకున్నది. ఆమె వయసు రిత్యా 53 కేజీల విభాగంలో అవకాశం ఇచ్చి ఉన్నట్లయితే, పతకం సునాయసంగా వశమయ్యేదే. ఇవన్నీ ఆమె చేస్తున్న పోరాటాల్లో భాగమే. అయిననూ నాలుగేండ్లుగా ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న జపాన్‌ రెజ్లర్‌ను చిత్తు చేసి రజత పతకాన్ని ఖాయం చేసుకున్న ఫోగట్‌ బంగారు కలను బరువు వమ్ము చేసింది.
ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారుల వెయిట్‌కు సంబంధించిన మానిటరింగ్‌ చేసేవాళ్లు, డైటీషియన్స్‌ ఏం చేస్తున్నట్టు! అనర్హురాలుగా ఒలంపిక్‌ సంఘం ప్రకటించగానే భారతీ యుల గుండెలు పగిలిపోయాయి. వెంటనే ఫోగట్‌ ఒలంపిక్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఫైనల్‌లో ఆడించాలన్న డిమాండ్‌ను వెంటనే తోసిపుచ్చారు. ఇక రెండో డిమాండ్‌,ఫైనల్‌ అర్హత వరకు పోటీలో ఉన్నపుడు బరువు సక్రమంగానే ఉన్నందున కనీసం రజత పతకం ఇవ్వాలని కోరింది. ఇందుకు న్యాయ మూర్తులతో బెంచ్‌ ఏర్పాటు చేసుకోవటానికి అనుమతి ఇచ్చింది. ఏం కాబోతుందో వేచి చూడాల్సిందే.
‘అమ్మా నన్ను క్షమించు, నాకిక పోరాడే శక్తిలేదు. రెజ్లింగ్‌ గెలిచింది ‘నేను ఓడిపోయాను’ అని ఫోగట్‌ దు:ఖపు గొంతుతో తల్లిని క్షమించమని కోరింది. అంతేకాదు, ఇక అంతర్జాతీయ కేరీర్‌కు సెలవు ప్రకటిస్తున్నానని సోషల్‌ మీడియాలో వెల్లడించింది. ఆబాధ తీవ్రత ఆమెకే తెలుసు. జరిగిన పరిణామాల్లో లోపం ఎక్కడుందో కూడా ఫోగట్‌కు తెలిసే ఉంటుంది. ఆ అనర్హత వెనుక కుట్ర కోణమూ ఉందని కొందరు అనుమానిస్తున్నారు కూడా. బాక్సర్‌ విజేందర్‌ మాట్లాడుతూ వినేశ్‌ ఫైనల్‌కు వెళ్లటం ఎవరికో నచ్చలేదని వ్యాఖ్యానించాడు. ఆరుసార్లు ఛాంపియన్‌ అమెరికన్‌ రెజ్లర్‌ జోర్డాన్‌ బుర్రోస్‌, ఫోగట్‌కు రజత పతకం ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. గుండె పగిలిందని, ఫోగట్‌ ధైర్యంగా ఉండాలని క్రికెటర్‌ రవిశాస్త్రి కోరాడు. సినీనటుడు ధర్మేంద్ర, అలియాభట్‌, కరీనాకపూర్‌ కూడా ఫోగట్‌కు మద్దతుగా నిలిచారు. ఇక సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌ అయితే దేశంలోని రాజకీయాలతోనే ఓడిందని కార్టూన్‌ పోస్టు చేశాడు. పార్లమెంట్‌లోని ‘ఇండియా’ బ్లాక్‌ ఎంపీలు ఫోగట్‌ అనర్హతపైన ఆందోళన వ్యక్తం చేస్తూ న్యాయం జరగాలని, ప్రభుత్వం స్పందించాలనీ డిమాండ్‌ చేశారు. ఆఖరికి ప్రధాని కూడా ఫోగట్‌కు మద్దతుగా నిలిచారు. కానీ బీజేపీ పార్లమెంటు సభ్యులు, సినీనటులు, హేమమాలిని, కంగనా మాత్రం ఆడవాళ్ల బరువు పెరగటంపై వ్యాఖ్యానించి, వారి వెలితి బుద్ధిని ప్రకటించుకున్నారు.
ఏదిఏమైనా వినేశ్‌ ఫోగట్‌, ఒలంపిక్స్‌ పోటీలో మొట్టమొదటిసారి ఫైనల్‌కు చేరిన మహిళా రెజ్లర్‌గా ఖ్యాతి గడించారు. ఇది మనందరికీ గర్వకారణ విషయం. ఆమె పోరాటస్ఫూర్తి నేటితరం అమ్మాయిలకు మరింత చైతన్యాన్ని నింపుతుంది. బంధువులు, స్నేహితులు కోరినట్లు, ఆమె విరమణ ప్రకటన వెనక్కి తీసుకుని, తిరిగి పోటీలో పాల్గొనాలి. అంతిమ విజయం పోరాటానిదే, ఫోగట్‌ ఇన్ని గుండెల నిండా విజయినే!