భారతదేశ గ్రంథాలయ పితామహుడు యస్.ఆర్.రంగనాధన్ జన్మదినాన్ని జాతీయ గ్రంథాలయ దినోత్సవంగా జరుపుకుంటారు. 1892, ఆగష్టు 12వ తేదీన చెన్నై, తంజావూరు జిల్లాలో జన్మించిన రంగనాధన్ మద్రాసు ప్రిస్టియన్ కాలేజిలో బి.ఏ, 1916లో యమ్.ఏ చదివి, 1924లో మద్రాసు యూనివర్సిటీలో క్వాలిఫైడ్ లైబ్రెరియన్‌గా ఉద్యోగంలో చేరి అక్కడే ఇరవై సంవత్సరాలు పనిచేసి, తర్వాత 1945 బెనారస్ విశ్వవిద్యాలయంలో 1947-54 మధ్య కాలంలో ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేశారు. ఈ యూనివర్సిటీలో గ్రంథాలయ శాస్త్రంలో మాస్టర్ డిగ్రీ ప్రారంభించారు. 1930లో నమూనా గ్రంథాలయ చట్టం తయారు చేశారు. 1924లో క్లాసిఫికేషన్, ముఖ్యంగా 1933లో ‘కోలన్ క్లాసిఫికేషన్’ అనే కొత్త కోడ్ తయారు చేశారు. నేటికీ అదే కోడ్ గ్రంథాలయ సిబ్బందికి మార్గదర్శిగా నిలిచింది. ఈ కోడ్‌లో పుస్తక వ్యక్తిత్వం, విషయం, శక్తి, నిడివి, సమయం అనే అంశాలు ఉంటాయి. ఈయన 60 గ్రంథాలు, 200 పైగా కథలు రాశారు. అందుకే 1935లో ‘రావు సాహెబ్’ బిరుదు పొందాడు. స్వాతంత్య్ర అనంతరం జాతీయ గ్రంథాలయ అధ్యక్షుడుగా, యు.జి.సి లైబ్రరీ కమిటీ అధ్యక్షుడుగా పనిచేశారు. దేశంలో గ్రంథాలయ శాఖకు, శాస్త్రానికి రూపురేఖలు దిద్దిన మహోన్నతుడు. ఈయన కషి ఫలితమే ఢిల్లీలో ఇన్స్ డాక్, బెంగళూరులో డి.ఆర్.టి.సి ఏర్పాటు చేశారు. భారతదేశంలో అకడమిక్ లైబ్రరీలతో పాటు, పబ్లిక్ లైబ్రరీలు ఏర్పాటు చేసి పలువురు మన్నలను పొందారు. వీరి సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’అవార్డు అందించింది.
రాసిన రాతలు ఒక నిర్దేశిత ప్రాంతంలో అందరికీ అందుబాటులో ఉంచాలనే ప్రాధమిక భావనతో ఏర్పాటు చేయబడినవే గ్రంథాలయాలు. అందరికీ విజ్ఞానం అందించే భాండాగారాలు. క్రీ.పూ. 2600 క్రితమే గ్రంథాలయాలు వున్నాయని, ఇరాక్ ప్రాంతంలో లభించిన ‘సుమేరు’ వలన తెలుస్తుందని పురాతన పరిశోధకులు చెబుతున్నారు. కాగితం, లిపి కనుగొన్న తరువాత వివిధ దేశాల పరిపాలకులు, అనువాదకులు ద్వారా ఇతర దేశాల సాహిత్యం, కళలు, నిర్మాణాలు మత సంబంధమైన అంశాలు ఆకళింపు చేసుకుని ప్రభావితమయ్యారు.
5వ శతాబ్దంలో ‘కానిస్టెంట్ నోపుల్’ లోని ‘ఇంపీరియల్ లైబ్రరీ’ 1,20,000 పుస్తకాలతో ఐరోపాలోనే అతిపెద్ద గ్రంథాలయంగా ప్రసిద్ధి చెందింది. తదుపరి చైనాలో మింగ్ వంశస్థుడు అయిన ‘ఫాన్ క్విట్’ చే 1561లో స్థాపించిన ‘తియాన్ యి జే’ లైబ్రరీ అతి పురాతనమైనదిగా గుర్తింపు పొంది, నేటికీ జాతీయ వారసత్వ సంపదగా కొనసాగుతుంది.
ఇక ప్రస్తుతం ప్రపంచంలో 2 అతి పెద్ద గ్రంథాలయాలలో ఒకటి అమెరికా వాషింగ్టన్ డి.సి లోని 15 కోట్ల ఐటమ్స్‌తో వివిధ రకాల డి.వి.డిలు కలిగి ఉన్న ‘లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్’ అయితే, రెండవది లండన్‌లోని ‘బ్రిటీష్ లైబ్రరీ’ ఖ్యాతి పొందాయి. ఇక మన భారత్‌లో అతిపెద్ద గ్రంథాలయంగా కోల్‌కత్తాలోని ‘నేషనల్ లైబ్రరీ’ భారతదేశ ముద్రణా వారసత్వ సంపద కాపాడటమే లక్ష్యంగా పనిచేస్తూ 30 ఎకరాల్లో విస్తరించి, 22 లక్షల పుస్తకాలు కలిగి ఉంది.
తెలంగాణలో ‘కొమర్రాజు లక్ష్మణరావు’ నిజాం పాలనలోనే గ్రంథాలయం ఉద్యమానికి నడుం బిగించారు. 1919లో మథిరలో గ్రంథాలయ ఉద్యమానికి శ్రీకారం జరిగింది. 1891లోనే హైదరాబాద్‌లో ‘ది స్టేట్ సెంట్రల్ లైబ్రరీ’ ఏర్పాటు చేశారు. జూన్ 12, 2024 నాటికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 491 గ్రంథాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1914లో విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ స్థాపించి, గ్రంథాలయాల అభివద్ధికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా ‘అయ్యంకి వెంకటరమణయ్య’ గారి కషి మరువలేనిది. అనేక గ్రామాల్లో, పట్టణాల్లో గ్రంథాలయాలు నెలకొల్పారు. అనేకమంది మేధావులు, ఉద్యోగస్తులు, విజ్ఞానవంతులు తయారై ఆనాడు స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. దేశ స్వాతంత్య్ర సాధనలో, జాతీయ, అంతర్జాతీయ అంశాలు అందించటంలో గ్రంథాలయాల పాత్ర మరువలేనిది. ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు ఉన్నత శిఖరాలను అధిరోహించటానికి బంగారు బాటలు వేస్తాయి. అయితే ‘నేషనల్ బుక్ ట్రస్ట్’ సర్వే ప్రకారం నూటికి ఇరవై ఐదు (25%) శాతమే యువకులు గ్రంథాలయ పఠనం చేస్తున్నారనే విషయం బాధాకరం.
‘చిరిగిన చొక్కా అయినా తొడుక్కొ.. ఒక మంచి పుస్తకం కొనుక్కొ’ అని వీరేశలింగం చెప్పిన మాటలు సదా అనుసరణీయం. విద్యార్థులు, యువత అనవసర అంశాలతో, మొబైల్ ఫోన్లతో సమయం వధా చేసుకుంటూ, భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు బానిసలై కనీస అవగాహన, విద్యా సామార్థ్యాలు లేకుండా ‘అన్ స్కిల్డ్’ వారిగా తయారవుతున్నారు.
”పుస్తకాన్ని పట్టి విజ్ఞానం పెంచి, ఉద్యోగం పట్టు” అనే భావనతో కదలాలి. భవిష్యత్ తీర్చిదిద్దుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో 140 కోట్లతో 4530 వై.యస్.ఆర్ డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. తెలంగాణాలో ఫ్రీ పబ్లిక్ వైఫై నెట్‌వర్క్ సేవలు అందిస్తూ డిజిటల్ విజ్ఞానం అందించే పని చేపట్టారు. దేశ స్థాయిలో ‘డిజిటల్ లైబ్రరీ’ అందుబాటులోకి తెచ్చారు. కోవిడ్ సమయంలో ఇంటినుండే విజ్ఞాన సముపార్జన చేసే విధంగా అవకాశాలు కల్పించారు. విద్యార్థులు, యువత చక్కని భవిష్యత్తు అందిపుచ్చుకోవాలి. గ్రంథాలయాలకు కొరతగా వున్న భవనాలు, విద్యుత్, బీరువాలు వంటి వసతులు ప్రభత్వమే కల్పించాలి. లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయాలి. నిధులు మంజూరు చేయాలి. స్టేట్ లైబ్రరీ, గౌతమీ గ్రంథాలయం, కారా మాస్టారు కథానిలయం వంటి లైబ్రరీలను పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు గత తరాల విజ్ఞాన సౌరభాలు అందించాలి.
ఈరోజుల్లో చాలామంది కోచింగ్ సెంటర్లు, స్టడీ సర్కిల్, స్టడీ సెంటర్లు, ట్యుటోరియల్స్, ట్రైనింగ్ సెంటర్ ఎక్కడికెక్కడికో వెళుతున్నారు తప్ప, వారికి సమీపంలో ఉన్న గ్రంథాలయానికి వెళ్ళలేక పోవటం ఒకసారి ఆలోచించాలి. ”విజ్ఞాన వీచికలు గ్రంథాలయాలు” అని గ్రహించాలి. నేటి ఆధునిక కాలంలో టీవీలు, కంప్యూటర్లు, సామాజిక మాధ్యమాలు ఎన్ని వచ్చినా గ్రంథాలయాలకు సరికావని గ్రహించాలి. చిత్రలేఖనం, సంగీతం, నత్యం, ఆటల పోటీలు, క్విజ్ వంటి ఎన్నో కార్యక్రమాలు గ్రంథాలయాల్లో నిర్వహిస్తారు. మానవుడిని సంస్కార వంతుడిగా, విజ్ఞానవంతుడిగా తీర్చిదిద్దే స్థలాలే గ్రంథాలయాలు. పూర్వం ఋషులు అరణ్యాలకు వెళ్లి జ్ఞానం సంపాదిస్తే, నేడు సమూహంలోనే ఉంటూ ఏకాంతంగా ఏకాగ్రతతో విజ్ఞానాన్ని సంపాదించేందుకు తోడ్పడేవే గ్రంథాలయాలు… మనకు విజ్ఞాన సుందర ప్రాంతాలు.
(ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవం సందర్భంగా)
– ఐ.ప్రసాదరావు,
6305682733