అతి పెద్ద విషాదం

అతి పెద్ద విషాదంఎవరు శత్రువో ఎవరు మిత్రుడో
చూచాయగా కూడా కనిపెట్టలేనంత
ఎద క్యాన్వాస్‌ నిండా రంగులన్నీ కలగాపులగం!
జ్ఞాపకాలింకా చెదరిపోనే లేదు
అందరూ గాయపరచిన వారే
ఎన్నికల తర్వాత ఏమార్చిన వారే
కుర్చీ కిందకు నీళ్ళొస్తే జట్లన్నీ తారుమారైతవి
గెలుపొక్కటే నేరస్థులని పవిత్రులని చేస్తున్నది!
విజయం మెట్లెక్కిన తర్వాత
మణిపూర్‌ మాటెవ్వరికీ పట్టదు
బాబా పాద ధూళి కోసం
ప్రణాలు గాలిలో కలిసిపోయినా ‘హథ్రాస్‌’ హతవిధీ!
పార్లమెంట్‌ నిరవధిక వాయిదా కోరుకుంటది!
ఎన్నికలు లేని వేళ ఇక్కడ
ఎవరి గాయం వారే మాన్పుకోవాలి
బలం తగ్గినప్పుడల్లా అధినేతలకు
రాజ్యాంగం భగవద్గీతవుతుంది!
కండువాలు నిర్లజ్జగా భుజాలు మారుతుంటే
మనమూ ఎలక్షన్‌ కమీషన్‌
నిశ్చేష్టులమై ముక్కున వేలేసుకోవలసిందే!
ప్రజాస్వామ్యం ఈ దేశంలో
బ్రాండ్‌ పేరు మీద బ్రతకడమే పెను విషాదం!!
– కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261