కవిత్వం రాయడం ఏ ఒక్కరి సొంతం కాదు. కానీ ఆ కవిత్వం శిర్ణకంపం కలిగించే పంక్తులు రాసినప్పుడు వాటిలో కవిత అరుణోదయంలా పొడుచుకుని వచ్చి హృదయాంతరాలలోకి వెళ్లి, ఆ కవితా పంక్తుల గుండా మనసుని తీసుకెళుతుంది. ప్రాంతీయ భాష నుడికారమే తన అక్షరాలల్లో నిక్షిప్తం చేస్తూ అర్థవంతంగా, సమాజ శ్రేయస్సు కోరుతూ రచనలు చేస్తున్న కవయిత్రి, తెలంగాణా దళిత ముద్దుబిడ్డ ‘జూపాక సుభద్ర’. పరిచయం అక్కరలేని కవయిత్రిగా, కథకురాలుగా, కాలమిస్టుగా, గేయ రచయితగా, అధ్యాపకురాలిగా, సామాజిక కార్యకర్తగా, వ్యాసకర్తగా, అనువాదకురాలిగా, పరిశోధకురాలుగా, ప్రభుత్వ ఉన్నతాధికురాలిగా ఇలా బహుముఖ ప్రజ్ఞాపాటవాలతో నిత్యం ఏదొక దినపత్రికల్లోనో, సామాజిక మాద్యమాలలోనో తన భావజాలాన్ని పంచుకుంటుంటారు. సుభద్ర కలంలో తెలంగాణా భాషలోని నుడి, వడి, పలుకుబడులు ఎక్కువగా అగుపిస్తాయి.
తెలంగాణంటేనే బతుకమ్మ పండుగ. తీరొక్క పువ్వుతో బతుకమ్మను పేర్చి ‘ఆడి’ బిడ్డలందరు కలిసి ‘ఈడి’ బిడ్డలుగా ఆడుకొని నీళ్లలో కలిపే పండుగ. ‘బతుకుబిడ్డ’ అని దీవించే దీవెనార్తుల పండుగ. ప్రస్తుతం కాగితం పువ్వులతో డీజే పాటలతో అడుగులు కదలకుండా, గొంతులు మెదపకుండా సాగుతుందని ‘బత్కమ్మంటే’.. అనే కవితలో (పేజీ 49) చక్కగా నేటి పండుగ స్థితిగతులను వివరించారు. కొన్ని కవితలు తెలంగాణా రాష్ట్రం ఏర్పడక మునుపు రాసినవి, ఉద్యమాలు జేస్తూ తనువులు చాలించే వారి కన్న తల్లిదండ్రులు ఎవరికోసం బతకాలి అంటూ, ఎవరు కూడా ప్రాణాలు తీసుకోవద్దని బతికి తెలంగాణా రాష్ట్రాన్ని కళ్లారా జుడాలని ఒకపక్క ఉద్యమస్ఫూర్తిని నింపుతూనే మరోపక్క ప్రాణాల విలువను తెలియజేస్తూ రాసిన ‘కోతకు బోవద్దు’, ‘నా రోజెన్నడో’ కవితలు చదివినప్పుడు కళ్ళల్లో నీళ్లుతిరుగుతాయి. కరువొచ్చి భూములన్నీ బీడువారినప్పుడు వ్యవసాయ కూలీలు బతుకుదెరువు కోసం పట్నం వస్తే ఇక్కడ, సఫాయి పనిజేత్తు, నానా కష్టాలుపడే వారి దీనస్థితిని ‘చీపురు కట్టయి, సఫాయి తట్టయి’ అనే కవితలో వివరించే విధానంలో కవయిత్రి సృజనశక్తి, తనదైన ముద్ర కనిపిస్తుంది.
‘యెలుతురు తొవ్వల్ని యెతుకుతూ’… కవితలో (పేజీ 93) ఓట్ల కోసం ఉచితాలు అనేక రకాల పథకాలంటూ గొప్పలు జెప్పడమే అంటూ ‘బల్లితోక బతుకే గానీ బంగారి తునుకేడయితి’? అని వ్యంగంగా చెప్పుతూ పొడ్సుక తింటే/ రాలిపోయే పొద్దును గాదు/ నేనెప్పటికీ, ఎన్నటికీ/ పోరు పొద్దునే/ నా యెతుకులాట యెలుతురు తొవ్వలకే. ఇలా ప్రతి కవితలో తాను పోరు వైపే ఉంటానని, తన ఆవేదనను, ఆత్మ గౌరవాన్ని ఎలుగెత్తి చాటుతూ పీడిత తాడిత వర్గాల వైపు పయనం సాగిస్తాను అనే మాటలు ఎంతోమంది హృదయాలు చేరడంతో పాటు వారిలో పోరాట పటిమను నూరిపోస్తుంది కవయిత్రి. రైతు మట్టిలో సేద్యం చేసి లోకానికి అన్నంపెడుతాడు. ఈ కవయిత్రి అక్షర సేద్యం చేసి మట్టి మనుషులకు ధైర్యాన్ని నింపుతుంది. అందుకు తన కలం బెదరదు, అలిసిపోదు. నిప్పుకణికలవలె వెలుగుతూ అందరిని వెలుగుబాటలో నడిపించాలనే ముందుకు సాగుతున్నందుకు అభినందించాల్సిందే.
ఇప్పుడు కూల్చాల్సింది ప్రభుత్వ పాత భవనాలను కాదు, మను ధర్మాల పీఠాల కోటలను, న్యాయాల్ని నడిబజార్లో నమిలే అనకొండల్ని, కాసులకు కక్కుర్తి పడి పైరవీలు చేసేవారిని అంటూ నిలదీసే కవిత ‘కూలగొట్టుండ్రి కుల వైకుంఠపురాన్ని’. వాస్తు బాగోలేదని సచివాలయాన్ని కూల్చి వందలకోట్ల రూపాయలను ప్రజలసొమ్మును వృధాచేసిన వైనాన్ని కళ్లారా చూసాం. నిజంగా పాలనకు కావాల్సింది వాస్తు కాదు ప్రజల శ్రేయస్సు. ప్రజల బాగోగులే పరమావధిగా పనిచెయ్యాలి. కులాలు, మతాలంటూ ప్రజల్లో భేదాభిప్రాయాలు పెంచొద్దు అంటూ కవయిత్రి ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి అయి ఉండి ప్రభుత్వంపై ధిక్కారస్వరాన్ని వినిపించడం గొప్ప సాహసమే అని చెప్పొచ్చు.
సుభద్ర తన సిరా చుక్కలతో మనల్ని లాక్కెళ్లి అన్యాయం జరిగిన చోటులో నిలబెట్టుతుంది. చూసి చలించిపోయిన మన మనసు తనగొంతుతో స్వరం కలిపి మనకు తెలియకుండానే చేతివేళ్ళు పిడికిలవుతాయి. అంతటి భావజాలాన్ని కుప్పవోసి పేర్చిన కవితలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ‘కవిత్వమొక తీరని దాహం’ అన్నాడు మహాకవి. నిత్యం ఏదొక సమస్యల మీదా తన కలం ద్వారా కవిత్వీకరిస్తూ తన తీరని దాహాన్ని మనముందు ఉంచుతుంది. మరో సామాజిక అంశం మీద రాసిన కవిత చదువుదాం… సాకిరోళ్ల పెద్ద కూర గూర్చి చాలా వివరణతో, పెద్దకూర అంటే పెద్దలకూర అని, దేశీయ కూర అంటూ ఎక్కువ మాట్లాడితే గిది అంతర్జాతీయ ఆవుకూర అంటానంటూ దీని చరిత్రను తెలుసుకోవాలని, ‘ఎద్దు సాకిరోల్ల పెద్దకూర’ (పేజీ 135) అనే కవితలో మీ తాతల మూతులు ముర్క సూడుండ్రి/ గీకూర ముస్లిమ్ లు దెచ్చిన ముడుసు గాదు/ బ్రిటిషోల్లతో వొచ్చిన బీఫ్ గాదు/ మీ వేదాల పునాదులల్ల యింద్రాదుల్ని యివర మడుగుండ్రి. చరిత్రను తవ్వి రాసిన కవిత ఇది. ఇప్పుడు పెద్ద కూర అంటే ఒక ముస్లింలే తినే కూర అంటూ వారిని అవహేళనజేస్తున్న వారికి ముందు యాగాల్లో ఏమి వధించి తిన్నారో తెలుసుకోవాలని చెప్పిన తీరు ఎంతో బాగుంది.
దళితులపై అత్యాచారాల గురించి ‘కడజాతోళ్ల’పై ఎప్పుడు చిన్నచూపే చూస్తుంది సమాజం అంటూ, ఒకవేళ ఈ జాతిలో పుడితే అది పూలందేవులై పుట్టాలంట, మనోధైర్యాన్ని కలిగుండాలని ‘పూలందేవులై పుట్టుండ్రి బిడ్డా’ (పేజీ 133) అనే కవిత ఎంతో ఆలోచింపజేసేదిగా ఉంటుంది. నేటి సమాజంలో అగ్రవర్ణాల కులాల్లో అత్యాచారాలు జరిగితే అది చిలికి చిలికి గాలివానైనట్టు చివరికి అసెంబ్లీలో, లోక్సభ, రాజ్యసభలో నిరసనలు చర్చలు జరగడం చూస్తున్నాం.
ఈ పుస్తకం మొత్తం తెలంగాణా గురించి, సామజిక అసమానతల గురించి ఎక్కువ కవితలు ఉన్నాయి. ‘నా తెలంగాణా కోటి రత్నాలవీణ’ కావాలని కోరుకునే వారి వరసలో కవయిత్రి సుభద్ర గారు కూడా ఉన్నందుకు అభినందించాల్సిందే. బంగారు తెలంగాణా బతుకునిచ్చే తెలంగాణా కావాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని అభిలషిస్తు, మరెన్నో సాహితీ సంకలనాలు వెలువరించాలని కవయిత్రి సుభద్ర గారికి శుభాకాంక్షలు.
– గాజోజి శ్రీనివాస్, 9948483560