– ఇండిగోకు మెజారిటీ మార్కెట్ వాటా
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణికుల్లో భారీ వృద్థి చోటు చేసు కుంది. ప్రస్తుత ఏడాది జనవరి నుంచి మే కాలంలో 36 శాతం పెరుగుదల నమోదయ్యింది. గడిచిన ఐదు నెలల్లో దేశీయ విమానాల్లో 6.36కోట్ల మంది ప్రయాణించారు. గతేడాది ఇదే సమయంలో 4.67కోట్ల మంది ప్రయాణికులు నమోదయ్యారు. ప్రస్తుత ఏడాది మేలోనూ 36 శాతం పెరుగుదలతో 1.32 కోట్ల మంది ప్రయాణిం చారని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) వెల్లడించింది. కరోనాకు ముందు 2019 మేలో 1.22 కోట్ల ప్రయాణికులు నమోదయ్యారు. మే నెలలో ఇండిగో అత్యధికంగా 61.3 శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకుంది. గత నెలలో ఇండిగోలో 81.10 లక్షల ప్యాసింజర్లు ప్రయాణిం చారు. ఎయిరిండియాలో 12.44 లక్షల మంది ప్రయాణించడంతో ఆ సంస్థ మార్కెట్ వాటా 9.4 శాతంగా చోటు చేసుకుంది. విస్తారా 11.95 లక్షల మంది గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా 9 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. టాటా గ్రూపులో భాగమైన ఏయిర్ ఆసియా 7.9 శాతం మార్కెట్ వాటా, స్పైస్జెట్న 5.4 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. గత నెలలో 566 ఫిర్యాదులు నమోదయ్యాయి. గో ఫస్ట్ విమాన సేవలు రద్దు కావడంతో అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయని డిజిసిఎ వర్గాలు పేర్కొన్నాయి.