అమరవీరుల స్మారక స్తూపం పెండింగ్‌ పనులను త్వరిగతిన పూర్తిచేయాలి

– మంత్రి ప్రశాంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అమరవీరుల స్మారక స్తూపం పెండింగ్‌ పనులను త్వరితగిన పూర్తిచేయాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 22న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్న అమరవీరుల స్మారక స్థూపం వద్ద జరుగుతున్న పనులను ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌, ఇతర ఉన్నతాధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లతో పాటు తాత్కాలిక రూట్‌ మ్యాప్‌పై మంత్రి ఉన్నతాధికారులతో చర్చించారు. సచివాలయ ప్రాంగణంలో మాత్రమే అన్ని వాహనాలకు పార్కింగ్‌ ఉండేలా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఐదు వేల మందికి పైగా జానపద కళాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీటింగ్‌ ఏర్పాట్లు, బందోబస్తు ప్రణాళిక తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జీఏడీ కార్యదర్శి శేషాద్రి, ఆర్‌అండ్‌బీ కార్యదర్శి శ్రీనివాసరాజు, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అమోరుకుమార్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌ కుమార్‌, సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్‌ కమిషనర్‌ అశోక్‌ రెడ్డి, సాంస్కతిక శాఖ సంచాలకులు హరికష్ణ, ఈఎన్‌సీ (ఆర్‌అండ్‌బీ) గణపతిరెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొ న్నారు.
ఏర్పాట్లను సమీక్షించిన సీఎస్‌ శాంతికుమారి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు రోజున నిర్వహించే అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సచివాలయంలో గురువారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవం, అనంతరం సభా కార్యక్రమం ఉంటుందని తెలిపారు. దీనికి ముందు అంబేద్కర్‌ విగ్రహం ఆవరణం నుండి అమరవీరుల స్మారక కేంద్రం వరకు దాదాపు ఐదు వేల మంది కళాకారులచే ర్యాలీ జరుగుతుందని తెలిపారు. దాదాపు గంటన్నర సేపు ఈ ర్యాలీ కొనసాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, కార్పొరేషన్‌ చైర్మెన్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉద్యోగు లు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నందున వారికి సరిపడే పార్కింగ్‌, సీటింగ్‌ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డయాస్‌, నిరంతర విధ్యుత్‌, ఫ్లోరల్‌ డెకొరేషన్‌, తాగునీటి సౌకర్యాలతోపాటు వేదిక మొత్తం పండగ వాతావరణం వచ్చేలా అలంకరించా లని తెలిపారు.
కళాకారుల ర్యాలీ జరిగే ఐ మాక్స్‌ సర్కిల్‌ నుండి అమరుల స్మారక కేంద్రం వరకు రహదారిని అందం గా అలంకరించాలని తెలిపారు. ఇప్పటి వరకు నిర్వ హించిన కార్యక్రమాల మాదిరిగానే, దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం కూడా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కషి చేయాలని అధికారులను సీఎస్‌ కోరారు.
ఈ సమావేశంలో డీజీపీ అంజనీకుమార్‌, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్‌ సిన్హా, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్‌ శర్మ, పంచాయితీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, కుటుంబ సంక్షేమ, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఏఎం రిజ్వీ, డీజి ఫైర్‌ సర్వీసెస్‌ నాగిరెడ్డి, అడిషనల్‌ డీజీ స్వాతి లక్రా, వాటర్‌ బోర్డు ఎండీ దానకిషోర్‌, హార్టికల్చర్‌ డైరెక్టర్‌ హనుమంతరావు, ప్రోటోకాల్‌ డైరెక్టర్‌ అరవిందర్‌సింగ్‌ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నాయకులతో సీఎస్‌ శాంతికుమారి సమావేశమయ్యారు. 22న జరిగే అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్యోగులు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు నరేందర్‌ రావు, తెలంగాణ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు మమతా, తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మామిళ్ళ రాజేందర్‌, ఇతర నాయకులు పాల్గొన్నారు.