సింగరేణి పరిరక్షణ-మన బాధ్యత

Singareni Conservation - Our Responsibilityసింగరేణి కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి చూపిన దారిదీపం.కోట్లాది మందికి విద్యుత్‌ను పంచుతున్న కాంతిరేఖ. పేరుకు నల్ల బంగారంగా పిలిచినా.. అది మన కొంగు బంగారం. సింగరేణిది దాదాపు 127 సంవత్సరాల చరిత్ర. ఎంతోమందికి అన్నం పెట్టిన తల్లి లాంటి సంస్థను కేంద్రంలోని మోడీ సర్కార్‌ నేడు వేలం వేస్తున్నది. కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే దేశాన్ని పాలిస్తున్నదని బీజేపీ మరోసారి నిరూపించుకుంది. మూడోసారి ఎన్నికల్లో ఓడిగెలిచినా ప్రయివేటీకరణను మాత్రం శరవేగంగా అమలు చేస్తున్నది. తెలంగాణలోనూ బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు నిర్ణయించింది. మోడీ అనుసరిస్తున్న విధానాల్ని నిరసిస్తూ తెలంగాణలో బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని, గనుల వేలాన్ని ఆపాలని డిమాండ్‌ చేస్తూ కోల్‌బెల్ట్‌ ఏరియాలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ‘సింగరేణి పరిరక్షణ యాత్ర’ చేపట్టింది. గతనెల జులై 29నుంచి ఈనెల 5వరకు ఎనిమిది రోజుల పాటు సాగింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మొదలైన ఈ యాత్ర మంద మర్రి, రామకృష్ణాపూర్‌ బి జోన్‌, శ్రీరాంపూర్‌ మీదుగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోకి ప్రవేశించింది. అక్కడి ఓపెన్‌కాస్ట్‌ మైన్స్‌, అండర్‌ గ్రౌండ్‌ బావుల్లో క్యాంపెయిన్‌ ముగించుకుని జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, ఇల్లందు, సత్తుపల్లి, కోయగూడెం మీదుగా ప్రయాణిస్తూ 5న కొత్తగూడెంలో ముగింపుసభ నిర్వహించింది. ఈయాత్ర సాగిన ప్రాంతాల్లో బృందం సభ్యులు ఎస్‌.వీరయ్య, ఆశయ్య, భూపాల్‌ కార్మికులను, వారి కుటుంబాలను ప్రత్యక్షంగా కలుసుకున్నారు. వారి ఇండ్లలోనే బసచేశారు. వారి కష్ట సుఖాలను పంచుకున్నారు.
ఈ యాత్ర ప్రధాన ఉద్దేశం సింగరేణిని పరిరక్షణ. కొత్త బ్లాకులను సంస్థకే కేటాయించాలనే డిమాండ్లను కార్మికులతో పాటు ప్రజల్లోకి తీసుకెళ్లింది. కేంద్రంలో మూడోసారి గద్దెనెక్కిన మోడీ సర్కార్‌ వచ్చి రాగానే కోల్‌ ఇండియాతో సంబంధం లేకుండానే 61 కొత్త బ్లాకులను ప్రయివేటు సంస్థలు, కార్పొరేట్‌ శక్తులకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. అందులో తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బ్లాకును వేలంపాటలో ఉంచింది. సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ. బ్రిటిష్‌ ప్రభుత్వ కాలం నుంచి దాదాపు 150 ఏండ్లుగా నిజాం సర్కారుతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, ఆ తరువాత నేటి ప్రత్యేక తెలంగాణ వరకు స్వతంత్ర సంస్థగా కొనసాగుతున్నది. సింగరేణి సంస్థ ద్వారానే బొగ్గు నిక్షేపాలను గుర్తించి ఆ సంస్థ ద్వారానే వెలికితీస్తూ ఉద్యోగ, ఉపాధి కల్పిస్తూ, ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల అభివృద్ధికి సింగరేణి చేదోడుగా ఉంటున్నది. సింగరేణి ఆధారంగానే ఈ ఆరు జిల్లాలలో నగరాలు, పట్టణాలు పెరగడంతో పాటు లక్షలాది మందికి ప్రత్యక్షంగా, అనేక లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ జీవనాధారమైంది.
అలాంటి సింగరేణి సంస్థ మనుగడను కాలరాయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సింగరేణి ప్రాంతంలోని పాతబావులలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతూ ఏడేండ్లలో పూర్తిగా అయిపోతాయి. ఆ తరువాత కొత్త బ్లాకులు రాక పూర్తిగా కార్మికులకు పనిలేకుండా పోతుంది. ఇప్పటికే కొత్త ఉద్యోగ నియమాకాలు నిలుపుదల చేశారు. కేవలం వారసత్వ ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారు. చిట్టచివరికి సింగరేణి మూసివేసే కుట్రకు కేంద్రం పూనుకున్నది. దీనికితోడు గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి పక్షాన నిలబడకుండా కేంద్రానికి వంత పాడుతున్నాయి. వేలం పాటను వ్యతిరేకించాల్సిన మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఏర్పాటు చేసిన సమా వేశంలో ఉప ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని పరోక్షంగా మద్దతు తెలుపడం అనేక అనుమానాలను తావిస్తోంది.గనుక రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి పరిరక్షణ కోసం నిలబడాలని, కార్మికుల హక్కుల కోసం పాటుపడాల్సిన అవసరాన్ని ఈ యాత్ర నొక్కిచెప్పింది.
ప్రస్తుతం సుమారు 75 వేల మంది శాశ్వత, 20వేలకు పైగా కాంట్రాక్టు కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ.10,500లోపే వేతనాలిస్తున్నారు. ‘చాలీచాలని జీతంతో పూటగడవడం చాలా కష్టంగా ఉందని’ మేం బసచేసిన ఇండ్లలో కార్మికులు చెబుతుంటే మా కండ్లు చెమ్మగిల్లాయి. గోదావరిఖనిలో నివాసముండే రాకేశ్‌ కాంట్రాక్టు కార్మికుడు. ఆయనకు భార్యా, ఇద్దరు పిల్లలు. బ్లాస్టింగ్‌ విభాగంలో పనిచేస్తున్నాడు. బ్లాస్టింగ్‌ వర్క్‌లేని రోజుల్లో వేతనమివ్వరు. పిల్లల చదువులకు, తినడానికి సరిపోని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. భూపాలపల్లిలో సుధాకర్‌ అనే కార్మికుని ఇంట్లో బస చేశాము. అతనికి ఇద్దరు పిల్లలు. కూతురు డిగ్రీ పూర్తిచేసింది. కుమారుడు ఇంటర్‌ చదువుతున్నాడు. ఇతను మున్సిపల్‌ విభాగంలో పని చేస్తున్నాడు. ఇతనికొచ్చే జీతం ఇంటి అద్దె, కుటుంబ పోషణకు, భార్య వైద్యానికి సరిపోక దీనస్థితిలో జీవనం కొనసాగిస్తున్నాడు. కొత్తగూడెం సెంట్రల్‌ వర్క్‌ షాప్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న బాలకృష్ణ ఇంటికి వెళ్లాము. అద్దె ఇంట్లో ఉంటూ నైట్‌ డ్యూటీలు చేస్తూ అనారోగ్యానికి గురైనా కూడా సెలవు లేకుండా డ్యూటీ చేయమంటున్నారని గోడు వెళ్లబోసుకున్నాడు. పండగలు, పబ్బాలకు కూడా కాంట్రాక్టు కార్మికులకు సెలవులుండవు. అనేకమంది వివిధ అధికారుల దగ్గర, గార్డెన్‌లో, రోడ్లపైన గడ్డి పిచ్చిమొక్కలు తీసే పనిలో అనేకమంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. వారికి ఎలాంటి రక్షణ లేదు. పని గ్యారంటీ లేదు. పని లేని రోజుల్లో జీతమివ్వరు. సెలవులు కూడా ఉండవు. ఎంత కష్టపడినా నెల తిరిగేసరికి రూ.7వేలు లేదా 8వేలకంటే ఎక్కువ ఇవ్వడం లేదు. వీరందరికీ గతంలో ఐపవర్‌ కమిటీ నిర్ణయించిన వేతనాలిస్తామని హామీనిచ్చారు పాలకులు. కానీ ఇంతవరకు అమలు కాలేదు. దీంతో కార్మికులు శ్రమదోపిడీకి గురవడం కలిచివేసే అంశం.
మన రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు. తెలంగాణకు ఏం ఒరగబెట్టారు? తెలంగాణ సహజవనరుల దోపిడీ జరుగుతుంటే అడ్డుకోనివారు ప్రజాప్రతినిధులు ఎలా అవుతారు? పదవిలో ఎలా కొనసాగుతారు? అందుకే సింగరేణి పరిరక్షణకు బీజేపీ ఎంపీలపై ప్రజలు ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నది. సింగరేణి ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయమే కాదు, తక్కువ ధరకే విద్యుత్‌ సప్లరు జరుగుతోంది. రేేపు కొత్త బ్లాకులు ప్రయివేటు సంస్థలకు ఇచ్చిన తర్వాత విద్యుత్‌రంగం తీవ్ర ప్రమాదంలో పడనున్నది. దాంతో రాష్ట్రం ప్రభుత్వం విద్యుత్‌ ఛార్జీలు పెంచడంతో ప్రజల పైన తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. దీంతో అన్ని రకాలుగా రాష్ట్రం నష్టపోతుంది. అదేవిధంగా సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ కావడం వలన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ సాగుతున్నది. రేపు ఇది ప్రయివేట్‌ సెక్టార్‌ అయితే ఆ వర్గాలకు రిజర్వేషన్‌ లేకుండా పోతుంది. సింగరేణి సంస్థ ఇప్పటి వరకు వందేండ్ల కాలంలో కేవలం 25 శాతం బొగ్గు మాత్రమే వెలికితీసింది. ఇంకా 75శాతం బొగ్గు మన తెలంగాణ భూగర్భంలో దాగుంది. ఆ బొగ్గు అయిపోవాలంటే ఇంకా 200 సంవత్సరాలు పడుతుంది. ఇంత పెద్ద ఎత్తున మన భూమ్మీదున్న సహజ సంపదని కార్పొరేట్‌ గద్దలు తన్నుకుపోతుంటే అధికార పార్టీ చూస్తు ఊరుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదు.
నీళ్లు నిధులు, నియామకాలంటూ పోరాడిన టీ(బీ)ఆర్‌ఎస్‌ గడిచిన పదేండ్లకాలంలో అధికారంలో ఉండి కూడా కొత్తబ్లాకులను ప్రయివేటు సంస్థలకు ఇస్తూ ఒప్పందం చేసింది. ఓపెన్‌కాస్టు పేరుతో బొగ్గుగనుల్ని బొందల గడ్డగా మార్చింది. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ మన సింగరేణిని బొగ్గును ప్రయివేటు పెట్టుబడిదారులకు వేలం ద్వారా ప్రయోజనం చేకూర్చే కుట్రల్ని తెలంగాణలోని ప్రతి ఒక్కబిడ్డ తిప్పికొట్టాలి. సకల కార్మికులు, సబ్బండ వర్గాలు ఏకమై మరో సకల జనుల సమ్మె చేసైనా సరే సింగరేణిని కాపాడుకోవాలి. ఇది ఏ ఒక్కరిదో కాదు, మనందరి బాధ్యతగా గుర్తెరగాలి.

– పైళ్ల ఆశయ్య, 9490098052