క్రీడాభిమానులను ఉర్రూతలూగించిన పారిస్ ఒలింపిక్స్ ఆదివారం ముగిశాయి. కనీసం పది మెడల్స్ సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత సేన ఆరు పతకాలతోనే ఇంటిబాట పట్టాల్సి వచ్చింది. టోక్యోలో తుపాకీ మొరాయించి వేదనతో వెనుదిగిన మనుభాకర్ మొక్కవోని సంకల్పంతో పారిస్‌లో చిరస్మరణీయ ప్రదర్శనతో రెండు కాంస్య పతకాలను సాధించింది. రైతు బిడ్డ సరబ్జ్యోత్సింగ్తో కలిసి మిక్స్డ్ విభాగంలో మరోసారి ‘కంచు’ మోగించింది. ఒలింపిక్ మెడల్ నెగ్గిన మొదటి భారతీయ మహిళా షూటర్‌గా, స్వాతంత్య్రానంతరం ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు రాబట్టిన తొలి ఇండియన్ అథ్లెట్‌గా అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకుంది మనుభాకర్. విశ్వక్రీడల్లో బరిలో నిలిచిన తొలిసారే 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో స్వప్నిల్ కంచుమోత మోగించాడు. టోక్యోలో జావెలిన్‌లో స్వర్ణం కొల్లగొట్టాడు నీరజ్ చోప్రా…పారిస్‌లో కాస్త తడబడి రజతంతో సరిపెట్టుకొన్నాడు. దేశీయంగా హాకీ కథ ముగిసిందని భావిస్తున్న తరుణంలో వరుసగా రెండోసారి మన పురు షుల జట్టు కాంస్యంతో కొత్త ఆశలు రేపింది. ఈ హాకీ జట్టుకు ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పాన్సర్… మరి ప్రభుత్వం ఏం చేసినట్టు?
కచ్చితంగా గెలుపు మనదేననుకున్న క్రీడాంశాల్లో సైతం అంచనాలు తలకిందు లయ్యాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆర్చర్లు పారిస్‌లో పూర్తిగా తేలిపోయారు. బాక్సింగ్‌లో మనవారి పంచ్‌లు పేలలేదు. రెజ్లింగ్ సైతం చేదు అనుభవాలనే మిగిల్చింది. షూటర్లు, హాకీ క్రీడాకారులే కాస్త పరువు నిలబెట్టారు. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే ఒక్క స్వర్ణం కూడా లేకపోగా పతకాలు సైతం తగ్గడంతో పతకాల పట్టికలో మన స్థానం అత్యంత దిగువకు దిగజారిపోయింది. మనలో నాలుగోవంతు జనాభా లేని దేశాలూ ఒలింపిక్స్‌లో భారీగా పతకాలు గెలుచుకొంటున్నాయి. వాటికి దీటుగా మనం రాణించాలంటే… దేశవ్యాప్తంగా క్రీడాసౌకర్యాలను మెరుగుపరచి మట్టిలో మాణిక్యాలను వెలికితీసి సానబట్టాలి. అందుకు తగ్గ కృషి ఎంత మేరకు జరుగుతోంది? మరీ ముఖ్యంగా రాజకీయ నేతల కబంధ హస్తాల నుంచి క్రీడా సంఘాలను విముక్తయ్యేలా చూడాలి. ఇవన్నీ సాకారమైతేనే ఒలింపిక్స్ పతకాల పట్టికలో ఇండియా పైమెట్టుకు చేరగలుగుతుంది!
అద్భుతమైన ఆటతీరుతో ఫైనల్‌కు చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వంద గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంతో అనర్హతకు గురికావడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతపరచింది. మరో రెజ్లర్ అమన్ సెహ్రావత్ 10గంటల్లో 4.6కేజీల బరువు తగ్గి ఇండియాకు కాంస్యం సాధించి పెట్టాడు. మరోవైపు, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ బరువు తగ్గేక్రమంలో విజయానికి దూరమైంది. గత రెండు ఒలింపిక్స్‌లో పతకాలు గెలిచిన పీవీ సింధు క్వార్టర్స్ కూడా చేరకుండానే ఇంటి ముఖం పట్టడం బాధాకరం. మన క్రీడాకారులు అంతర్జాతీయ టోర్నీల్లో బాగా రాణిస్తున్నారు కానీ, ఒలింపిక్స్‌లో మాత్రం తడబడుతున్నారు. ఒత్తిడికి తలొగ్గి చేతిదాకా వచ్చిన విజయాన్ని చేజార్చుకున్న షట్లర్ లక్ష్యసేన్ ఉదంతమే దీనికి ఉదాహరణ. బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే ఉద్ఘాటించినట్టు.. ‘మన ఆటగాళ్లు దృఢ చిత్తంతో ఈ బలహీనతను అధిగమించాలి. అందుకోసం వారికి ప్రత్యేక శిక్షణ అందించాలి.’ ‘క్రికెట్ ఇచ్చే ప్రాధాన్యతలో పదిశాతం మిగతా క్రీడలకు ఇచ్చినా మన దేశానికి ఎన్నో పతకాలు వస్తాయి’ అన్న సైనా నెహ్వల్ మాటల్లో వాస్తవం లేకపోలేదు.
ఇలాంటి ఆలోచనలు చేయాల్సిన కేంద్ర పెద్దలు.. పారిస్ ఒలింపిక్స్ శిక్షణ కోసం వినేశ్ ఫోగట్ మీద డెబ్బరు లక్షలకుపైగా ఖర్చు చేశామని కేంద్ర క్రీడామంత్రి పార్లమెంటులో ప్రకటించడం అత్యంత హాస్యాస్పదం. గతంలో మోడీకి వ్యతిరేకంగా నిలబడి నినదించినా, ఆమెను ఒలింపిక్స్‌కు పంపి తమ పెద్దలు ఎంతో ఉన్నతంగా వ్యవహరించారన్నట్టుగా మరో నాయకురాలు వ్యాఖ్యానించారు. కానీ, సమస్త వ్యవస్థలు తనకు వ్యతిరేకంగా ఉన్నా తోటి మహిళా క్రీడాకారుల కోసం వినేశ్ ఫోగట్ పాలకులతో పోరాడారు, ఇప్పుడు బరిలో కడవరకూ నిలిచి పోరాడి దేశ కీర్తిని నిలిపారు.
పారిస్ వెళ్లిన భారత జట్టులో హర్యానా, పంజాబ్‌లకు చెందినవారే అత్యధికులు. దేశ జనాభాలో కేవలం నాలుగు శాతమే ఉన్న ఆ రెండు చిన్న రాష్ట్రాలూ 40శాతం ఒలింపియన్లను తయారు చేస్తే.. తమిళనాడు, కేరళ, యూపీ, మహారాష్ట్ర, మణిపూర్ సైతం తమవంతు భూమిక పోషించాయి.140కోట్ల సువిశాల భారతావనిలో రాష్ట్రాలవారీగా, జాతీయస్థాయిలో క్రీడావికాస ప్రణాళికలు చురుగ్గా అమలు జరిగి ఉంటే ఏండ్లతరబడి పతకాల దుర్భిక్షం ఉండేది కాదు. ప్రతి పాఠశాలలో ఆటస్థలం, క్రీడాసామగ్రి విధిగా ఉండాల్సిందేనన్న విద్యాహక్కు చట్టం అమలుకానంత వరకూ ఇదే కొనసాగుతుంటది. వ్యాయామ విద్య, శారీరక శ్రమ అనేవి పిల్లల ఏకాగ్రతను, బుద్ధిని వికసింపజేస్తాయి. వారిలో కలివిడితత్వాన్ని పెంపొందించి, ఓటమి జీవితంలో భాగమేనన్న సత్యాన్ని బోధపరుస్తాయి. రేపటి పౌరుల భవిష్యత్తుకు దోహదపడేలా పటిష్ట క్రీడా సంస్కృతికి కేంద్రం, రాష్ట్రాలు కౄషిచేయాలి. ఆ క్రమంలో సహజసిద్ధ ప్రతిభా సంపన్నులు వెలికివస్తే అంతర్జాతీయ వేదికలపై భారత్ తలెత్తుకుని నిలబడగల్గుతుంది!