సాగర్‌ డ్యామ్‌పై ఏపీ దౌర్జన్యం

– క్రస్ట్‌ గేట్ల దగ్గరికి వెళ్లే గేటు తాళం ధ్వంసం
– కొత్త తాళం వేసిన వైనం
– కేఆర్‌ఎంబీకి డ్యామ్‌ అధికారుల ఫిర్యాదు
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఏపీ, తెలంగణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న నాగార్జునసాగర్‌పై గతేడాది డిసెంబర్‌ ఒకటో తేదిన జరిగిన సంఘటన మరోసారి పునరావృతమైంది. ప్రాజెక్టు ప్రధాన గేటు నుంచి డ్యామ్‌ పైకి చొచ్చుకొనివచ్చి 13గేట్ల వరకు బారికేడ్లు, ఇనుప కంచె ఏర్పాటు చేసుకున్న ఏపీ పోలీసులు ప్రాజెక్టు అధికారులకు కనీసం సమాచారం ఇవ్వకుండా 5వ గేటు నుంచి 2వేల క్యూసెక్కుల నీటిని కుడి కాలువకు తరలించిన ఘటన మరవకముందే ఈ నెల 11న(ఆదివారం) రాత్రి అలాంటి సంఘటనే మరొకటి డ్యామ్‌పై చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సారి డ్యామ్‌పై దౌర్జన్యంగా వ్యవహరించిన ఏపీ ఇరిగేషన్‌ అధికారులు డ్యామ్‌ పైనుంచి క్రస్ట్‌ గేట్ల సమీపానికి వెళ్లడానికి ఏర్పాటు చేసిన గేటు తాళాన్ని ఏకంగా పగులొట్టిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రస్ట్‌ గేట్ల సమీపానికి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన వాక్‌ వే బ్రిడ్జికి ఆంధ్రా, తెలంగాణ రెండు వైపులా గేట్లు ఏర్పాటు చేయగ తెలంగాణ అధికారులే దాని నిర్వహణ పూర్తిగా చేపడుతున్నారు. అయితే ఈ నెల 11న రాత్రి సమయంలో ఏపీ సీఎం పేషీ నుంచి సుమారు 20 మంది డ్యామ్‌పై చేరుకున్నట్టు తెలిసింది. వాక్‌ వే బ్రిడ్జి గేటు తాళం వేసి ఉండటంతో తెలంగాణకు చెందిన డ్యామ్‌ అధికారులను తాళం చెవి అడిగారు. తాళం చెవి ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పడంతో ఆంధ్రా అధికారులు దౌర్జన్యంతో గేట్‌ తాళం పగులగొట్టి వాక్‌ వే బ్రిడ్జి మీదికి వె్లిపోయారు. అనంతరం గేటుకు కొత్త తాళం వేసి తాళం చేవి తమ వెంట తీసుకుపోయారు. అయితే ఈ వివాదానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తెలంగాణ అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు.ఈ ఘటనపై డ్యామ్‌ ఈఈ మల్లికార్జునరావు స్పందిస్తూ ఆంధ్రా అధికారులు తాళం పగులగొట్టిన విషయం తన దష్టికి వచ్చిందన్నారు. విషయాన్ని ఉన్నతాధికారులకు, కష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (కేఆర్‌ఎంబీ)కు నివేదించామన్నారు. అకకడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.డ్యామ్‌ పహారా కాస్తున్న సీఆర్పీఎఫ్‌ సిబ్బంది ఆంధ్రా నుంచి ఎవరు వచ్చినా అనుమతిస్తున్నారనీ, అయినా దౌర్జన్యంగా వ్యవహరించడం విచారకమన్నారు. కాగా 13వ గేట్‌ వరకు తమ ఆధీనంలో ఉన్నదంటూ తరుచూ ఏపీ అధికారులు తమ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలంగాణ ఉద్యోగులు వాపోతున్నారు. డ్యామ్‌ కంట్రోల్‌ రూమ్‌ 26వ గేట్‌ అవతల ఉన్నదని అక్కడికి వెళ్లి డ్యూటీ చేసే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై కేఆర్‌ఎంబీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది, రానున్న రోజుల్లో ఈ వివాదం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో తెలియడానికి వేచిచూడాల్సిందే.