– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
– ఆర్. వెంకట్ రాములు
నవతెలంగాణ-షాద్‌నగర్
ఉపాధి హామీ కూలీల జీవితాలతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందనీ, కార్మికులను పొమ్మనలేక పొగపెట్టినట్టు ప్రభుత్వ తీరు ఉందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. వెంకట్ రాములు అన్నారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలలతో పనులు చేయించుకుని వారికి రావాల్సిన వారం వారం డబ్బులు ఇవ్వకుండా మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం సిగ్గుచేటన్నారు.పెండింగ్‌లో ఉన్న ఉపాధి కూలీల బిల్లులు వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జూన్, జూలై నెలల నుంచి ఇప్పటివరకు ఉపాధి హామీ చట్టంలో పని చేసిన కూలీలకు 10 వారాల నుంచి కూలిడబ్బులు విడుదల చేయడంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుందన్నారు. ఉపాధి హామీ చట్ట ప్రకారం ప్రతీ వారం బిల్లులు చెల్లించకుండా చట్టాన్ని తుంగలో తొక్కి నెలలు గడిచిన బిల్లులు విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు.ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయడంలో భాగంగానే డబ్బులు విడుదల చేయడం లేదన్నారు. దీంతో కూలీలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూలీల బతుకులతో చెలాటం ఆడుతుందని, ఇప్పటికీ ఉపాధి హామీ చట్టంలో అనేక మార్పులు చేర్పులు చేసి, వేలాది మందిని ఉపాధికి దూరం చేసిందన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం వెంటనే ఉపాధి హామీ చట్టంలో పని చేస్తున్న కూలీలు డబ్బులు విడుదల చేయాలన్నారు. ఇప్పటికే కేంద్ర బడ్జెట్లో ఉపాధి నిధులు తగ్గించి తీవ్ర మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉపాధి హామీ చట్టంలో మార్పులు చేసి, కనీస పని దినాలు 200 రోజులకు పెంచి, రోజువారి కూలీ రూ.600 లకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ కన్వీనర్ శ్రీను నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కన్వీనర్ బి.పద్మ, జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్, పద్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.