నిండు ప్రాణం కాపాడిన రక్షక భటులు

The saviors who saved many lives– టెక్నాలజీ సహకారంతో గంట వ్యవధిలో
– కేసు చేధించిన జగద్గిరిగుట్ట పోలీసులు
నవతెలంగాణ-జగద్గిరిగుట్ట
ఆర్థిక మానసిక ఇబ్బందుల కారణంగా ఓ వ్యక్తి మనస్థాపంతో ఆత్మహత్యాయత్యానికి యత్నించిన ఉదంతం జగద్గిరిగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. ఫిర్యాదు అందిన ఒక గంట వ్యవధిలోనే టెక్నాలజీ సహకారంతో అతన్ని గుర్తించి నిండు ప్రాణాన్ని జగద్గిరిగుట్ట పోలీసులు కాపాడారు. జగద్గిరిగుట్ట సీఐ కే.క్రాంతి కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జగద్గిరిగుట్ట బీరప్ప నగర్‌ కు చెందిన మాలంపాక బాబీ(28)అనే వ్యక్తి మధ్యాహ్నం ఇంట్లో నుంచి డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. అనంతరం తన బావమరిదికి ఫోన్‌ చేసి తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. వెంటనే అతని భార్య తెలిసిన వారిని సంప్రదించినా ఆచూకి లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సిఐ… బాబీ(సెల్‌ ఫోన్‌ సిగల్స్‌ ను ట్రేస్‌ చేసి సికింద్రాబాద్‌లో మహంకాళి ఆలయ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే సిబ్బందిని పంపించి ఫిర్యాదుదారునితో పాటు వెతకగా ఓ లాడ్జ్‌ లో ఉన్నట్టు తెలిసింది. జగద్గిరిగుట్ట పోలీసు సిబ్బంది హుటాహుటినా అతని వద్దకు చేరుకున్నారు. అప్పటికే దోమల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా గుర్తించి గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించి టెక్నాలజీ సహకారంతో నిండు ప్రాణం కాపాడటంలో చాకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులతో పాటు సీఐ.క్రాంతి కుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు.