– ఏఐఎస్‌జీఈఎఫ్ అధ్యక్షులు సుభాష్ లంబాజీ
నవతెలంగాణ-సిటీబ్యూరో
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి వెంటనే సీపీఎస్ రద్దు చేసి.. ఓపీఎస్‌ను ప్రవేశపెట్టాలని ఎఐఎస్‌జీఈఎఫ్ అధ్యక్షులు సుభాష్ లంబాజీ, ప్రధాన కార్యదర్శి ఏ.కుమ్రాన్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(ఎఐఎస్‌జీఈఎఫ్) నేషనల్ ఎగ్జిక్యూటివ్ కాన్ఫరెన్స్ మంగళవారం కేంద్ర సంఘం కార్యాలయంలో కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.ఎం. హుస్సేని(ముజీబ్), ముఖ్య నాయకుల సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా పలు కీలకంశాలతో పాటు ఉద్యోగుల భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. అనంతరం వారు మాట్లాడుతూ బకాయిపడిన నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలనీ, పీఆర్సీ వెంటనే ప్రకటించాలని కోరారు. ఉద్యోగులకు హెల్త్ కార్డు వెంటనే మంజూరు చేయాలనీ, బకాయి బిల్లు వెంటనే విడుదల చేయాలన్నారు. అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ, లైబ్రరీ, వైద్య విధాన పరిషత్ ఉద్యోగులకు 010 ద్వారా జీతభత్యాలు అమలు చేయాలనీ, భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఉద్యోగులకు వెంటనే ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.