తుంగభద్రకు తాత్కాలిక గేటు!

– ఐదు ప్లేట్లుగా నిర్మాణం
– మూడు సంస్థల్లో సాగుతున్న పనులు
కర్నూలు : కర్ణాటక రాష్ట్రం హోస్పేట్‌ వద్ద తుంగభద్ర జలాశయాన్ని 1954లో నిర్మించారు. ఈ డ్యామ్‌ 19వ గేట్‌ ఈ నెల 10న రాత్రి 11 గంటల సమయంలో చైన్‌లింక్‌ తెగిపోవడంతో ఊడిపోయి వరద నీటిలో కొట్టుకుపోయింది. ఆ గేటు ద్వారా లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. 12వ తేదీ ఉదయం నుంచే నిపుణులు రంగంలోకి దిగారు. కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్‌ నిపుణులు, అధికారులు నిర్ణయించారు. అందుకు సిడబ్ల్యుసి నుంచి ఆమోదం లభించింది. డ్యాము గేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో పనులను ప్రారంభించారు. ప్రస్తుతం గేటు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గేటు పొడవు 60 అడుగులు, వెడల్పు 20 అడుగులు. మొత్తం గేటును ఒకేసారి తయారు చేయడం సాధ్యం కాదని భావించిన అధికారులు ఐదు ప్లేట్లుగా గేటు ఫ్యాబ్రికేషన్‌ పనులు చేస్తున్నారు. ఆ పనులు మూడు సంస్థల్లో సాగుతున్నాయి. మూడు ప్లేట్లను బళ్లారిలోని జిందాల్‌ స్టీల్స్‌, ఒక ప్లేటును హిందుస్థాన్‌ కంపెనీ, మరో గేటును హోస్పేటలోని నారాయణ ఇంజనీరింగ్‌ కంపెనీ చేస్తున్నాయి. 12 అడుగుల నీటి ప్రవాహం ఉండగానే గేట్లను అమర్చాలని అధికారులు నిర్ణయించారు. అలా అమర్చగలిగితే జలాశయంలో 60 టిఎంసిల నీటిని నిల్వ చేయవచ్చని యోచిస్తున్నారు. నీటి ప్రవాహం ఉన్న సమయంలో గేటును అమర్చడం కష్టమని, అయినా సాహసం చేస్తున్నామని చెబుతున్నారు. కొట్టుకుపోయిన గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఐదు ప్లేట్లను ఉంచి వెల్డింగ్‌ చేసేలా ప్రణాళికలు రూపొందించారు. సిబ్బంది, కార్మికులు నీటిలోకి దిగేందుకు వీలుగా ప్రత్యేక ప్లాట్‌ఫారంను ఏర్పాటు చేయనున్నారు. తాత్కాలిక గేటును అమర్చడానికి రెండు క్రేన్లను వినియోగించనున్నారు. వాటిని ఇప్పటికే డ్యాము వద్ద సిద్ధంగా ఉంచారు.