అనుక్షణం ఉత్కంఠం… క్షణక్షణానికి పెరిగిపోతున్న టెన్షన్… రోజులు గడిచే కొద్దీ ఏం జరుగుతుందో తెలియని ఆందోళన… తిరిగి భూమికి ఎప్పుడు చేరుతుందని ఆశగా చూస్తున్న ప్రపంచం. ఆమే సునీతా విలియమ్స్… పరిచయమే అవసరం లేని పేరు. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమ గామి. గతంలో రెండు సార్లు అంతరిక్ష్యంలో పర్యటించి విజయవంతంగా తిరిగొ చ్చారు. ఇప్పటి వరకు 322 రోజులకు పైగా అంతరిక్షంలో ఉండి ప్రపంచ రికార్డు సృష్టించారు. ముచ్చటగా మూడో సారి అంతరిక్ష యాత్రకు వెళ్ళిన ఆమె ప్రస్తుతం అక్కడే చిక్కుకుపోయారు. జూన్ 6న తొమ్మిది రోజుల యాత్ర కోసం వెళ్ళిన ఆమె రెండు నెలలు గడిచినా భూమికి తిరిగి రాలేకపోతున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఆమె తిరుగు ప్రయాణానికి వచ్చిన అడ్డంకులు ఏమిటో తెలుసుకుందాం…
ప్రపంచంలో అతి పెద్ద ఏరో స్పేస్ కంపెనీల్లో ఒకటైన బోయింగ్ ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి మానవ సహిత రోదసి యాత్రలో సునీత భాగస్వామి అయ్యారు. సహచరుడు బారీ బుచ్ విల్మోర్‌తో కలిసి బోయింగ్ ‘స్టార్‌లైనర్’ వ్యోమ నౌకలో జూన్ 5న అంతరిక్ష కేంద్రానికి పయనమయ్యారు. 6వ తేదీ అక్కడకు చేరుకుని అక్కడే ఉన్న ఏడుగురు వ్యోమగాములతో కలిసి సంబరాలు చేసుకున్నారు. వాస్తవానికి తొమ్మిది రోజుల తర్వాత తిరిగి వారు భూమికి చేరుకోవల్సి వుంది. కానీ కొన్ని సాంకేతిక అడ్డంకుల వల్ల వాళ్లు తిరిగి భూమికి చేరుకోలేకపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా అందరిలో ఆందోళన మొదలయ్యింది. వాళ్లు కచ్చితంగా భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారనే దానిపై నాసా శాస్త్రవేత్తలు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇది మరింత ఆందోళన కలిగించే విషయం.
భారత సంతతికి చెందిన సునీత
సునీతా విలియమ్స్ తండ్రి డాక్టర్ దీపక్ ఎన్.పాండ్యా. ఆయన గుజరాత్ రాష్ట్రంలోని మెహసానా అనే ప్రాంతానికి చెందినవారు. తల్లి బోనీ జలోకర్ పాండ్యా… స్లోవేనియాకు చెందినవారు. సునీతకు ఏడాది వయసున్నపుడు ఆమె తండ్రి అహ్మదాబాద్ నుండి యూఎస్‌ఏలోని బోస్టన్‌కు వలస వెళ్లారు. సునీతకు అన్నయ్య జై థామస్ పాండ్యా, అక్క డయానా ఆన్ పాండ్యా ఉన్నారు. సునీత మసాచుట్స్‌లోని నీధమ్ హైస్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. తర్వాత యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడమీ నుండి బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ సైన్స్, మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ డిగ్రీని అందుకున్నారు. మైఖేల్‌జెని ఆమె వివాహం చేసుకున్నారు. అతను సునీతా క్లాస్‌మెట్.
అంతరిక్షంతో అనుబంధం
1987లో సునీతా యూఎస్ నేవీలో చేరారు. ఆరు నెలల తా్కాలిక నియామకం తర్వాత ఆమె ప్రాథమిక డైవింగ్ అధికారిగా నియమితులయ్యారు. 1998లో అంతరిక్ష యాత్రలో శిక్షణ మొదలుపెట్టారు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా(1998) మిషన్ ఎస్‌టీఎస్ 116, ఎక్స్ పెడిషన్ 14, ఎక్స్ పెడిషన్ 15, ఎస్‌టీఎస్ 117, సోయుజ్ టీఎంఏతో సహా 30 వేర్వేరు అంతరిక్ష నౌకల్లో మొత్తం 2770 విమానాలను నడిపారు. 2006లో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు. 2012లో మరో సారి అంతరిక్షంలోకి వెళ్లి వచ్చారు. ఇప్పటి వరకు ఆమె 50 గంటల 40 నిమిషాల స్పేస్ వాక్ చేశారు. 322 రోజులు పాటు అంతరిక్షంలోనే గడిపారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ద్వారా అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన రెండో మహిళ సునీతా విలియమ్స్. 2008లో భారత ప్రభుత్వం ఆమెకు సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో పద్మభూషణ్ అవార్డును ప్రదానం చేసింది. ఇదే కాకుండా ఆమె మానవతా సేవా పతకం, నేవీ అండ్ మెరైన్ కార్ప్ ఆచీవ్‌మెంట్ మెడల్, నేవీ కమెండేషన్ మెడల్‌లను కూడా అందుకున్నారు.
సాంకేతిక సమస్యలే కారణం
నిజానికి ఇది మానవసహిత యాత్రల సన్నద్దతను పరీక్షించేందుకు బోయింగ్ చేసిన క్రూ ఫ్లైట్ టెస్ట్. షెడ్యూల్ ప్రకారం సునీత, విల్మోర్ వారం పాటు ఐఎస్‌ఎస్‌లో ఉండి జూన్ 13న బయల్దేరి 14న భూమికి చేరుకోవాలి. కానీ ఐఎస్‌ఎస్‌తో అనుసం ధానమయ్యే క్రమంలో హీలియం లీకేజీకి తోడు వ్యోమ నౌకలో మరిన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు గుర్తించారు. వీటన్నింటినీ సరిచేసే పనిలో నాసా పడింది.
ముందు నుండే సమస్యలు
వాస్తవానికి సునీత మూడో సారి రోదసి యాత్ర ప్రకటించినప్పటి నుండే అడుగడుగునా ఆటంకాలు కొనసాగుతున్నాయి. బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వారిద్దరీనీ రోదసిలోకి తీసుకెళ్లింది. నిజానికి ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో కొంత కాలం వాయిదాపడింది. ఆ తర్వాత లోపాల్ని సవరించిన స్టార్ లైనర్ వారిని జూన్ 5న స్పేస్‌కి పంపించింది. జూన్ 14న రావాల్సిన వారు సాంకేతిక సమస్యల వల్ల జూన్ 26న తిరుగు ప్రయాణం అవుతారని నాసా చెప్పింది. కానీ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం వాయిదా పడినట్టు నాసా ప్రకటించింది. ఆ తర్వాత జూలై 6 అన్నారు. అది కూడా దాటి పోయింది. అయితే ఇప్పటి వరకు దీనికి పరిష్కారం దొరకలేదు. సునీత విలియమ్స్ భూమికి తిరిగి వస్తారన్న విషయంపై నాసా స్పష్టత ఇవ్వడంలేదు. అయితే వీరు 2025 ఫిబ్రవరి వచ్చే వరకు తిరిగి భూమికి వచ్చే అవకాశమే లేదనే వార్తలు కూడా వస్తున్నాయి.
ప్రత్యామ్నాయాలు ఉన్నాయి
సునీత, బుచ్ విల్మోర్‌లను వెనుక్కు తీసుకొచ్చేందుకు ప్రత్యామ్నాయాలున్నాయని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. స్పేస్ ఎక్స్‌కు చెందిన క్రూ డ్రాగన్ ద్వారా, లేదంటే రష్యా సహకారంతో ఆ దేశానికి చెందిన సూయజ్ వ్యోమనౌక ద్వారా వారిని వెనక్కు తీసుకురావచ్చు. నాసా ఆ దిశగా ఆలోచించగలిగితే వ్యోమగామి సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమికి చేరుకునే అవకాశం ఉంది.