నవతెలంగాణ – కంఠేశ్వర్
ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ మాధవ్ నగర్ లోని ఇందుర్ క్యాన్సర్ ఆసుపత్రి నందు బ్రిడ్జ్ గ్యాప్ హాస్పటల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ఆయన చిన్నబాబు సుంకాల తో కలిసి ప్రారంభించారు. పురుషుల్లో ప్రోస్ట్రేట్ క్యాన్సర్, మహిళల్లో రొమ్ము ,నానేంద్రియాల క్యాన్సర్ ఎక్కువగా సోకుతుందని ,వ్యాధి ముదిరే వరకు తెలుసుకోకపోవడం వల్ల ప్రాణాలకు ముప్పు వస్తుందన్నారు. అందుకే ఇలాంటి శిబిరాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించటంతో పాటుగా ప్రత్యేక పరీక్షలు నిర్వహించి తే వ్యాధి నిర్ధారణ కొరకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ మాట్లాడుతూ.. 50 సంవత్సరాలు దాటిన స్త్రీ పురుషులు క్యాన్సర్ కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని దీని మూలంగా ప్రాథమిక సమయంలోనే గుర్తించి వైద్యం చేయటానికి అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సహకారంతో క్రమం తప్పకుండా తాము ఇలాంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్టుగా ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ యూరాలజిస్ట్ డాక్టర్ శ్రీని అత్తిలి మాట్లాడుతూ.. ఇందూరు క్యాన్సర్ ఆస్పత్రి నందు క్యాన్సర్ కు సంబంధించి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయని వైద్య పరీక్షలు నిర్ధారణ చికిత్స ఇతర ప్రాంతాలకు వెళ్లకుండానే ఇక్కడ మెరుగైన ట్రీట్మెంట్ లభిస్తోందని ఆయన అన్నారు. డాక్టర్ బుద్ధా శ్రీనివాస్ డాక్టర్ కిరణ్ డాక్టర్ సూరి తదితరుల నేతృత్వంలో క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఈవిల్ నారాయణ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ నిజామాబాద్ అధ్యక్షులు శిర్ప హనుమాన్లు కార్యదర్శి ప్రసాద్ రావు నాయకులు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యేను తెలంగాణ ఆల్ పెన్షనర్స్ సన్మానించింది. దాదాపుగా వందమందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు.