విజేత..!

Winner..!అధ:పాతాళానికి తొక్కేసిన రాజ్యం
ఇనుప పద ఘట్టనలను చీల్చుకుంటూ
పైకెగసిన అగ్నిధారవు నీవు…
అధికార మదాంధకారపు చీకట్లను
చీల్చుకువచ్చిన కాంతిపుంజం నీవు…
అదిరింపులు, బెదిరింపులు,
అవమానాలు, లాఠీదెబ్బలు
రోజుల తరబడి రోడ్లపై
నీవు సాగించిన పోరాటాలు…
మాతృభూమిపై నీ అపజయాలు…
పరాయి గడ్డపై గంటల్లోనే ముగ్గురు
జగజెట్టీలను మట్టి కురిపించిన నీకు
వంద గ్రాముల చిరు బరువు
పెనుభారమయ్యిందా?
గెలుపుకోసం రక్తం ధారపోసినట్లు వినటమే
కానీ చూసింది మాత్రం నిన్నే….
ఎక్కడో, ఉహూ కాదు బహుశా
ఇక్కడే ఏదో ఇనుపపాదం
నీ విజయానికి మోకాలు అడ్డుపెట్టిందేమో…
బహుశా నిన్ను భేష్‌ అనాల్సి వస్తుందని
రాజ్యం గొంతు భయపడిందేమో!
పసిడి పతకాన్ని దూరం చేసింది అందుకేనేమో!
మొన్నరోడ్లపై నిన్ను ఈడ్చేస్తుంటే
మౌనరాగాలు తీసిన గొంతులు
నేడు నీకోసం గొంతెత్తుతున్నాయి….
ఇది కదా..నీ అసలైన విజయం…
ఆరు గ్రాముల పతకం లేకపోతేనేం
భారతమ్మ కన్న నిలువెత్తు పుత్తడిబొమ్మవు నీవు
ఇంటా, బయటా బరిలో
నిలిచి, గెలిచిన విశ్వవిజేతవు నీవు..
మా కంటికొసల్లో నీరై నిలిచిన భేటీవి నీవు
– వీరాంజనేయులు