ఓ మహా సౌధం కూలిన చోట తులసి కోటైనా కట్టాలి
పోగులు పోగులుగా పేనుకున్న అనుబంధాల తాళ్ళు తెగుతున్న చోట
ప్రేమాన్విత ముడులు ఓ అఖండ సంకల్పంగా వేయాలి
మనిషి భౌతికంగానో.. అంతర్గతంగానో ఖండ ఖండాలుగా హననమవుతున్న చోట
వ్యవధి లేని ధారాపాత దుఃఖాన్ని తప్పక తుడవాలి
చరణాలు రాణాలను పూరించినా తరులు వింజామరలై వీస్తుంటాయి
ఆవత పునరావత అశ్రు బిందువుల ఆవలి తీరపు
పాలపుంతల్ని చూడ టానికి వెన్నెల కిటికీ తెరువూ
హదయ కుహారంలో తచ్చాడే సీతాకోకలు
సామూహిక పువ్వుల సంచరిత నవ్వులు చూసావా
జర్రంత దెగ్గరగా జరగవోయి కమ్మటి రుచుల కవిత్వమోకటి వినిపిస్తా
అసంకల్పితంగా కొట్టుకు పోతున్న అనుబంధ ఆత్మీయ సౌరభాల్ని
ఒడిసి పట్టుకో. ఓ సుదీర్ఘ వాక్యంతో నైనా.. ఓ దీర్ఘ శ్వాసతో నైనా…
జడిలో అలజదిలో తలక్రిందులవుతున్న జీవిత జిగీషనీ..నగిషీనీ
పుటం పెట్టీ. పుడమీపై వక్షరాజంలా నిటారుగా నిలబెట్టాలి..
మనిషి మనిషి మధ్యన అడ్డుగోడల్ని ఢ కొట్టి నేలమట్టం చేసే
విశ్వంభర వ్యూహాన్ని నిర్మొహమాటంగా నిర్మించాలి
మతాలన్నీ మాసిపోయి మానవత్వ వెలుగుల్ని దర్శించే
ప్రాతినిధ్య మనసు క్షేత్రాన్ని వెతకాలి..వెలికి తీయాలి
నువ్వూ నేనూ ఒక్కటే ననే సుందర భావాల గ్రంథాన్ని తెరవాలి
కుతి తీరే వరకూ కుమిలి కుమిలి ఏడవటం నీ స్వీయ ప్రారబ్దం
యింకిన దుఃఖం బరువైన భావాల సమాహారమని తెలుసుకో…
ఓర్పును తక్కువగా చూడకు అది విజయ సంకేత మహా నిశబ్దం
ఈ భూమ్మీద నిరాఘాటంగా సాగే ధ్వంస దగ్ధ కాలుష్య క్రీడల మధ్య
తుపాకులే కాదు ఆకుల అంకురాలు మొలుస్తున్నాయి చూడు
ఎందుకా నిట్టూర్పు..వెచ్చని ఊహల్ని నిండుగా ప్రోది చేసుకో
నాలుగు పచ్చని ఆకులతో ఒక ”బొమ్మరిల్లు” కట్టుకుందాం పదా..
డా|| కటుకోఝ్వల రమేష్, 9948083327