అత్త కాలం కొన్ని రోజులు..కోడలు కాలం కొన్ని రోజులు..

Aunt's period is few days..daughter-in-law's period is few days..లోకం మీద ఎక్కువమంది అత్తా కోడళ్ళకు ఎక్కడా పొసగది. ఒకరికొకరు నచ్చుకోరు, మెచ్చుకోరు. ఈ కాలంలో అత్తాకోడలు ఒక ఇంట్లో ఉంటలేరు గాని ఉమ్మడి కుటుంబంలో ఈ సమస్యలు ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు అన్ని స్వతంత్ర సంసారాలు. ఇదివరకు అత్త కేంద్రీకత వ్యవహారాలు. అత్తాకోడలు పంచాయతీకి కొడుకులు తల పట్టుకుని కూర్చుంటరు. అందుకే ‘అత్త కాలం కొన్ని రోజులు.. కోడలు కాలం కొన్ని రోజులు..’ అనే సామెత పుట్టింది. ఈ కోడలు అత్తయ్యే దాకానే భరించేది. తర్వాత ఆమెకు కోడలు వచ్చిన తర్వాత ఆధిపత్యం చెలాయించడం నడుస్తుదని ఈ సామెత వాడతారు. అందుకే ‘అత్త మెచ్చిన కోడలు లేదు – కోడలు మెచ్చిన అత్తలేదు’ అనే సామెత సాధారణీకరణం చెందింది. కానీ ఇవన్నీ అందరికీ వర్తించవు. ఒకప్పుడు కొందరికి మాత్రమే ఈ అనుభవాలు ఉండేవి. చదువుకున్న తరం వచ్చిన తర్వాత దూర దూరం నివసించిన తర్వాత ఇద్దరి మధ్య సమన్వయం, ప్రేమ పెరుగుతున్న కాలమే ఇది.
ఆ రోజుల్లో అత్త ఏమన్నా గునిపిచ్చి పెడితే కోడలు ఏదైనా వస్తువులు కోపంగా కింద వేయడం జరుగుతది. అప్పుడు ‘అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు’ అంటారు. దుత్త అంటే చిన్న మట్టి కుండ. ఇండ్లల్లో జరిగే లోలోలోపటి లొల్లులు వాడకట్టు అంతా తెలుస్తాయి. అప్పుడు అందరూ అత్త లావటిది అంటారు.
ఈ సందర్భంలో ‘అత్త చేసే ఆరల్లు కనిపిస్తాయి గానీ- కోడలు చేసే కొంటెతనం కనపడదు’ అనే సామెత కూడా ఉంది. ఆధిపత్యం ఎదిరించే స్థితి లేక అనుభవించి మళ్లీ చెలాయిస్తుంటారు కొందరు. అప్పుడు వీళ్లను సమాధానపరిచేందుకు ‘అత్తా ఓ ఇంటి కోడలే -మామ ఓ ఇంటి అల్లుడే’ అనే సామెతతో సంభాషణలు ముగిస్తారు. ఏది ఏమైనా తెచ్చుకున్న అహంకారాలే ఇలాంటి వికారాలను సష్టిస్తాయి.

– అన్నవరం దేవేందర్‌, 9440763479