మనిషీ – మృగమూ

Man is a beastపశువులా నాలుగు కాళ్ల మీద నడవడం మానేసి రెండు కాళ్లమీద నడవడం మొదలు పెట్టిన మనిషికి తోకా, కొమ్మూ, కోరలూ మాయమైనప్పటికీ పశువు లక్షణాలు లోలోపల ఎక్కడో దాక్కునే వున్నాయి. అలా దాక్కున్న వాటిని రెచ్చిపోకుండా, అణచిపెట్టే సభ్యతా, సంస్కారమూ అందరిలోనూ వుండవు కదా!
పైకి మనుషుల్లా కనిపించినా, లోపల వున్న పశువు పగ్గాలు వదిలేసి లోకం మీద పడేవారిలో ఒకడు జులాయి రంగడు. జులాయి వాడి ఇంటిపేరు కాదు గానీ, వాడు అనేక అడ్డదిడ్డపు పన్లు చేసి నలుగురి చేతా ‘ఛీ’ అనిపించుకుని ఆ పదాన్ని బిరుదుగా సంపాదించుకున్నాడు.
చదివించాలని తండ్రి వాణ్ణి బళ్లోచేర్చాడు. కానీ విద్యాసరస్వతి వాడని చూసి ఆమడదూరం పారిపోయింది. పంతుళ్లను సతాయించడం, సాటివాళ్లను వేధించడంతో వాడి చదువు అటకెక్కింది. చిన్నతనం కదా, పెద్దయితే వాడే చక్కబడతాడు అనుకున్న తల్లిదండ్రుల ఆశ నిరాశే అయింది. తినడం, తిరగడం, నోరు పారేసుకోవడం, చేయి ఎత్తడం వంటి సుగుణాలు దినదినాభివృద్ధి చెందాయి.
పనీపాటా లేక బలాదూర్‌గా ఊరిమీద పడి తిరిగే రంగడికి చిల్లర దొంగతనాలు అలవాటయ్యాయి. వీధిరౌడీ నుంచి పేటరౌడీగా ఎదగడానికి అట్టే సమయం పట్టలేదు. తప్పతాగి దొర్లడం, పేకాటలో వోడితే తలలు పగలగొట్టడం, ఆడది కనపడితే అదే పోతపోవడం, వాడి రోజువారీ కార్యక్రమంగా మారింది.
ఊళ్లో వాళ్లు వీడి ఆగడాలు భరించలేక ఊరి పెద్ద దగ్గర మొరపెట్టుకున్నారు. ఊరి పెద్ద రంగడి తండ్రిని పిలిచి చీవాట్లు పెట్టాడు. తన కొడుకు ఇలాగే జులాయిగా వుంటే రాజుగారికి ఫిర్యాదు చేసి, తల కోట గుమ్మం మీద వేలాడదీయమని చెప్తానని బెదిరించాడు.
తండ్రి రంగడికీ సంగతి చెప్పి పట్నంలో రాజుగారి కొలువులో పని చేస్తున్న తన తమ్ముడి కొడుకు ఇంటికి పోయి ఏదైనా పని చూసుకుంటావా? లేక మా ఇద్దరినీ గన్నేరుపప్పు వండుకు తిని చావమంటావా? అన్నాడు. ఊరి పెద్ద మీద చచ్చేంత కాదు, చంపేంత కోపం వచ్చిన రంగడు ఆయన ఇంటి దగ్గర వస్తాదులు కాపలా వుంటారని, గుట్టు చప్పుడు కాకుండా వెళ్లి ఆయన గడ్డివాముకు నిప్పంటించి ఊరు దాటిపోయాడు.
పట్నంలో చిన్నాన్న కొడుకు ఇంటికి చేరిన రంగడికి, అనేక రకాలుగా హితబోధ చేశాడు వరుసకు తమ్ముడు. బళ్లో పాఠాలు వినే సమయంలోనే పంతుళ్లు చెప్పేది ఓ చెవితో విని మరో చెవితో బయటకు పంపెయ్యడం అలవాటయిన రంగడు ఆ అలవాటు మానుకోలేదు. చేతివాటం ఎలాగూ తెల్సు కనుక జనంలో జొరబడి కొట్టుకొచ్చిన సొమ్ముతో దేవతలు తాగే ద్రవం కడుపులో పోసేవాడు. ఇలాగ రికామీగా తిరిగితే చెడిపోతాడని తమ్ముడు ఓ అధికారి కాళ్లూ గడ్డమూ పట్టుకుని చిన్న నౌకరీ వేయించాడు రంగడికి.
రంగడు పెద్ద ఆసుపత్రిలో అనేకమంది కాపలా దార్లల్లో ఒకడయ్యాడు. కొత్తలో బాగానే వున్నాడు. తినేదేదో తిని, తాగేదేమో తాగి కొంపకు వచ్చి గుర్రు కొడ్తూ నిద్రపోయేవాడు. ఊరినుంచి వచ్చినప్పట్నించీ మందూ విందూ బాగానే సాగాయి కానీ మూడవది పొందే అవకాశం చిక్కనే లేదు. ఒళ్లు తీపరంగానూ, తిమ్మరంగానూ వుండసాగింది.
రాత్రుళ్లు రంగడూ, తమ్ముడూ ఇంటి డాబా మీద పడుకుని వున్నప్పుడు రంగడికి చుక్కల్లోకి చూస్తే తను కాపలా పని చేసే ఆసుపత్రి వైద్యురాళ్లు గుర్తుకువచ్చేవాళ్లు. వాళ్ల అందచందాల గురించి వర్ణించేవాడు. అనవసరపు ఆలోచనలు, తింగరి తిక్క ఆలోచన్లు మాని పడుకో అనేవాడు తమ్ముడు. ఒకసారి ఒక వైద్యురాలి గురించి తిక్కతిక్కగా మాట్లాడాడు రంగడు.
‘ఒద్దు! తప్పుడు మాటలు మానుకో. ఆమె వైద్యురాలు. రోగులకు సేవ చేసే దేవత. నువ్వు ఓ పనికిమాలిన చదువులేని మొద్దువి. కాపలాదారుల్లో ఒకడివి’ అన్నాడు చిరాగ్గా తమ్ముడు.
‘అంటే నేను మగాడ్ని కానా? ఆమె ఆడది కాదా?’ అని ప్రశ్న వేశాడు రంగడు.
‘అయితే విద్యా, వివేకం, స్థాయీ, సభ్యతా అనేవి వుండవా?’ అన్నాడు తమ్ముడు.
‘అవన్నీ ఈ లోకంలో చాతకాని చవటలు తయారు చేసిన పనికి రాని నీతులు. అసలు సత్యం ఒక్కటే. ఒక ఆడ ఒక మగ. ఇవి తప్ప ఏవీ అవసరం లేదు. ఆలోచించరాదు’ అన్నాడు రంగడు.
‘నువ్వన్నది పశువులకు మాత్రమే వర్తిస్తుంది. ముఖ్యంగా కుక్కలకు, పందులకు’ అంటూ అటు తిరిగి నిద్రలోకి జారుకున్నాడు తమ్ముడు.
రాజుగారు దోషులకు దండన విధించి, తీర్పులు చెప్పే దర్బార్‌లో వున్న తమ్ముడు, బేడీలు వేసి రక్షక భటులు తీసుకు వచ్చిన రంగడ్ని చూసి నిర్ఘాంత పోయాడు. కొత్వాలు అభియోగం చదివాడు. ఆసుపత్రి కాపలా దారుల్లో ఒకడైన రంగడు ఓ రాత్రి డ్యూటీలో వుండి ఒక వైద్యురాలి మీద అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు.
‘కాపలా పనివాడుగా వుంటూ, పవిత్రమైన వృత్తిలో వున్న స్త్రీని హత్య చేయడం తప్పుకాదా?’ అన్నాడు రాజు కోపంగా.
చేసే వృత్తికీ, ఆడామగా సంబంధానికి లింకేమిటి అని ఎదురు ప్రశ్న వేశాడు ులాయి రంగడు. రాజుగారు ఉలిక్కిపడ్డారు. వీడు మనిషి రూపంలో వున్న పశువే అనుకున్నాడు. వీడ్ని తక్షణం వురి తీయండి అన్నారు. ఊరి పెద్ద ఇదివరకు అన్నమాట నిజమైంది. రంగడి తల కోట గుమ్మానికి వేలాడింది.
యుగాలు మారినా మనిషిలో పశుత్వం కొనసాగుతూనే వుంది. రంగడి కాలంలో రాజు విధించిన శిక్ష తక్షణం అమలయింది. ఇప్పుడు అనేక వ్యవస్థలు పనిచేసి, అనేక సాక్ష్యాలు సేకరించితే తప్ప, అనేక ఏండ్లు, అనేక వాయిదాలు గడిస్తే తప్ప మనిషిలోని మృగానికి శిక్ష పడదు. తక్షణం శిక్ష పడదని తెలిసిన మృగాలు, బెయిళ్లూ, క్షమాభిక్షలూ వుంటాయని తెల్సిన మృగాలు మనిషి రూపంలో సంచరిస్తూనే వుంటాయి. స్త్రీ జాతిని వేటాడుతూనే వుంటాయి.

– చింతపట్ల సుదర్శన్‌, 9299809212.