గత రెండు ఎన్నికల తర్వాత తొలిసారి బీజేపీ ఆధిక్యత కోల్పోయిన ప్రభావమేంటో పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా కనిపించింది. ఆగష్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రధాని మోడీ చేసిన ప్రసంగం కూడా దానికే అద్దం పట్టింది. కాంగ్రెస్ అధికారిక ప్రతిపక్షంగా ఆవిర్భవించడం, రాహుల్‌గాంధీ ప్రతిపక్ష నేత హోదా పొందడం, లౌకిక పార్టీలు ‘ఇండియా’ కూటమిగా ఒక్కతాటిపైకి రావడం బీజేపీ జీర్ణించుకోలేకపోతున్నది. లోక్‌సభలో తొలిసారి హిందూత్వ రాజకీయాలపై సూటిగా చర్చ జరడం కన్నా ఇందుకు మరో నిదర్శనం అక్కర్లేదు. అయితే ప్రతిపక్షాల పెరుగుదలపై ఉక్రోశంతో బీజేపీ సభ్యులు మంత్రులు చేసిన దాడి అనేక సందర్భాల్లో వికృతంగా తయారైంది. పంద్రాగస్టు సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని మోడీ చేసిన ప్రసంగం ఈ కుల మత రాజకీయాల వ్యూహంలో భాగమే. ఉమ్మడి సివిల్ కోడ్ అనే బీజేపీ, ఎన్నికల నినాదం కోసం ఇప్పుడు దేశంలో వున్నది మతతత్వ పౌరస్మృతి అన్నట్టుగా వ్యాఖ్యానించారు.ఈ మాటలు ముస్లిం, మైనార్టీలను ఉద్దేశించినవన్నది స్పష్టమే. ఎందుకంటే హిందూ పౌరస్మృతిని ఆయన ఏమీ అనే ప్రసక్తి వుండదూ.. .వాంఛనీయమూ కాదు.రాజ్యాంగం ప్రకారం ఇప్పుడు అమలు జరుగుతున్న వాటిని మతతత్వంగా మోడీ ఎలా ఆరోపిస్తారు? విభిన్న మతాలు, విశ్వాసాలతో కూడిన ఈ దేశంలో అందరినీ ఒప్పించి ప్రజాస్వామికంగా ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావాలే గానీ ఒకరి విశ్వాసాలు మరొకరిపై రుద్దడం సాధ్యం కాదు.
నిజానికి బీజేపీ పూర్వపు అవతారమైన జనసంఘం ఆదినుంచి అదేపనిగా వివాదం రేపుతున్న అంశాల్లో ఉమ్మడి పౌరస్మృతి ఒకటి.1951 అక్టోబర్‌లో జనసంఘం ఆవిర్భవించినప్పటి ఎజెండాలోనే ఈ అంశం వుంది. అయినా బీజేపీ ఏర్పడిన తర్వాత 1989 ఎన్నికల వరకూ ఈ వూసే ఎత్తుకోలేదు. అయోధ్య చిచ్చు రగిలిన తర్వాతనే బీజేపీ కీలక ఎజెండా కింద చేపట్టిన మూడు అంశాలలో దీన్ని చేర్చింది. అయోధ్య రామమందిర నిర్మాణం, కాశ్మీర్ 370 అధికరణం రద్దు అన్నవి తక్కిన రెండు అంశాలుగా ప్రకటించింది. రాజ్యాంగ ఆదేశిక సూత్రాలలో 44వ అధికరణం ఉమ్మడి పౌరస్మృతి వుండాలని చెబుతున్నమాట నిజమే. కానీ తన మత రాజకీయాలకు భూమిక లభించిందని రూఢ అయిన తర్వాతనే 1998లో దీన్ని ఆ పార్టీ ముందుకుతెచ్చింది.అప్పటి నుంచి దీనిపై ఏదో రూపంలో చర్చ చేస్తూనే వుంది. ఇక్కడ ఇంకో విశేషం కూడా గమనించాలి.
రెండు పూర్తయినట్టేనా?
అయోధ్యలో రామమందిరం,370 రద్దు అనే లక్ష్యాలు ఇప్పటికే సాధంచినట్టు ఆ పార్టీ అతిశయంతో వుంది. మిగిలింది ఉమ్మడి పౌరస్మృతి(కామన్ సివిల్ కోడ్-యుసిసి) మాత్రమేనని అహంభావం కూడా సంఘ పరివారం దీనిపై ఒత్తిడి కూడా చేస్తున్నది. ఉత్తరాఖండ్ శాసనసభతో సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనిపై శాసనసభలో తీర్మానాలు చేశాయి కూడా. ఈ ఏడాది అనేక కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగవలసి వుంది. మూడోసారి ఎలాగో అధికారంలోకి వచ్చాము గనక ఎలాగోలా దీన్ని పూర్తి చేసుకోవాలనే ఆరాటమూ వుంది.ఇన్ని కారణాలతోనే మోడీ సూటిగా ఎర్రకోట ప్రసంగంలో దాన్ని లేవనెత్తారు.తద్వారా ఒకటి రెండు విషయాలు స్పష్టం చేయదలిచారు. మొదటిది మెజార్టీ రాకపోయినా తమ ఎజెండాలో ఆలోచనల్లో మార్పులేదనేది దేశానికి మాత్రమే గాక ఎన్డీయే మిత్రులకూ స్పష్టం చేయడం. రెండోది హర్యానా,కాశ్మీర్ తర్వాత మహారాష్ట్ర ఆపైన ఢిల్లీ వంటి శాసనసభల ఎన్నికలకు ముందే మతతత్వ ఎజెండాను మళ్లీ సిద్ధం చేయడం. తద్వారా హిందువుల ఓట్లను ఆకర్షించాలనే తాపత్రయం.
మిత్రుల ఇరకాటం
బీజేపీ అనుకున్నట్టే ఎన్డీయే భాగస్వామ్య పార్టీలేవీ మోడీ ప్రసంగంపై ప్రతికూలంగా స్పందించలేదు. టీడీపీ మైనార్టీనాయకులొకరు దీనిపై స్పందిస్తూ యుసిసిలో ఏ అంశాలపై ప్రభావం ఎలా వుంటుందో తెలుసుకోగోరుతున్నామని చెప్పారు.అంతకుముందు వక్ఫ్‌చట్టంపైనా ఇలాగే కొన్ని అభ్యంతరాలు చెబుతూనే మార్పులను స్వాగతిస్తామని వ్యాఖ్యానించారు.తమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల వల్లనే కేంద్రం వక్ఫ్ చట్ట సవరణల బిల్లును సంయుక్త పార్లమెంటరీ సంఘానికి నివేదించిందని కూడా ఆయన చెప్పారు. ఇక్కడ టీడీపీ ఇరకాటం స్పష్టమే. ఇక జేడీయూ విషయానికొస్తే సీనియర్ నాయకుడు కెసిత్యాగి మాట్లాడుతూ ఉమ్మడి కోడ్‌పై తమ వైఖరిని ముఖ్యమంత్రి నితిష్‌కుమార్ ఎప్పుడో ప్రకటించారని దాటేశారు. క్లిష్టమైన ఇలాంటి విషయాల్లో రాష్ట్రాలను సంప్రదించి ముందుకుపోవాలని నితిష్ లేఖ రాశారని గుర్తు చేశారు.అంతేగాని ఏకపక్ష వైఖరిని వ్యతిరేకిస్తున్నట్టు గట్టిగా చెప్పలేకపోయారు.దీనిపై విదేశీ పత్రికలు కూడా స్పందిస్తుంటే భాగస్వామ్య పార్టీలు, బడా మీడియా మౌనం దాల్చడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రధాని మోడీ ప్రసంగంలో సమ్మిళిత అనే పదం వాడారు గానీ, అది మతం విషయాలలో కాదని ఒక పత్రిక విశ్లేషించింది. భౌగొళిక ప్రాంతాల తేడాలు, లింగభేదం వంటి విషయాల్లోనే ఆయన అందరినీ కలుపుకోవాలనే పదాలు వాడారు. అదే మతం విషయానికి వస్తే మెజార్టీ మత భాషనే ఉపయోగించారు. మతం, దేవుడు వంటి ప్రస్తావనలకు వచ్చేసరికి కనిపించింది అదే.మనదేశంలో ప్రతిరాతిలో శివుణ్ని చూస్తామనీ, ప్రతినదినీ భూతల్లిగా భావించడం గర్వకారణమంటూ కీర్తించారు.మహిళలను శక్తి స్వరూపిణిగా పరిగణిస్తారనడంలోనూ మతభావనే వినిపించారు.ఎందుకంటే ఇతర మతాల వారికి ఇది వర్తించదనీ, వారి విశ్వాసాలు, ఆచారాలు వేరుగా వుంటాయని మోడీకి తెలుసు. ఇంకా చెప్పాలంటే బంగ్లాదేశ్ పరిణామాలను కూడా హిందువులపై దాడులు అన్న కోణంలోనే ఆయన ప్రస్తావించడం యాదృచ్చికం కాదు.
కాశ్మీర్ పాఠాలేంటి?
మోడీ మొన్నటి ఎన్నికల ఫలితాల ప్రభావాలనూ, పాఠాలనూ నేర్చుకోదలచలేదని ఈ ప్రసంగం స్పష్టం చేసింది. ఎందుకంటే బీజేపీ కీలక ఎజెండాలోని ముఖ్యాంశాలు మూడింటిలో రెండు నెరవేరినట్టు చెప్పడమే అతిశయోక్తి.అయోధ్య సమస్యపై రాజకీయం చేయడం ద్వారా ఆ పార్టీ లాభపడిన మాట నిజం.ఏకంగా మూడోసారి కేంద్రంలో అధికారం రావడానికి మతరాజ కీయం బాగా దోహదం చేసింది. అయితే ఆ అయోధ్యలోనే బీజేపీ అభ్యర్థి మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు.ఆ మందిరం కట్టిన యూపీలోనూ బీజేపీ వెనకబడింది. చడీ చప్పుడు లేకుండా కాశ్మీర్ 370వ అధికరణాన్ని రద్దు చేయడం కూడా నిజమే. కాని అక్కడ ఇంతవరకూ సాధారణ పరిస్థితి నెలకొల్పలేకపోయింది. ఆ రద్దుకు ముందు తర్వాత పదేళ్లపాటు ఎన్నికలు కూడా వాయిదా వేయవలసి వచ్చింది. జరిగిన మేరకు ఏకధాటిగా విజయాలు సాధించిందీ లేదు. ఎన్నికలు జరపకపోవడానికి అదీ ఒక కారణం.ప్రధాని ప్రసంగించిన ఆగష్టు 15 తర్వాత రోజున ఎన్నికల సంఘం తేదీలు ప్రకటించింది. సెప్టెంబరు 30లోగా అక్కడ ఎన్నికలు జరిపి శాసనసభను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు అదేశించి వుండకపోతే ఇవైనా జరిగేవా అన్నది సందేహమే. ఇప్పుడు కూడా అక్టోబర్1 వరకూ జరపాల్సి వస్తుందన్నారు. కారణం భద్రతా దళాల కొరత! 370 రద్దు తర్వాత పరిస్థితి ఎంత లక్షణంగా వుందో దీన్ని బట్టే తెలుస్తుంది. ఈ ఎన్నికలకు ముందే జమ్మలో తీవ్రవాదం విజృంభించిందనే ప్రచారాలూ అణచివేతలూ చూస్తున్నాం. ఇవన్నీ ఎన్నికల సమయంలో ఎలాటి ప్రభావం చూపేది తెలియదు. సాధ్యమైనంత త్వరలో కాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరిస్తామనే పూచీలు ఏమైందీ తెలియదు. బీజేపీ కేంద్రం ప్రత్యేకించి మోడీ మాటలకూ వాస్తవాలకూ ఎంత తేడానో ఇక్కడే తెలిసిపోతుంది.
ఏకకాల ఎన్నికల మోజు
బీజేపీ ప్రచారంలో కీలకమైన మరో అంశాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఈ సందర్భం సరిపోతుంది.మోడీకి చాలా ఇష్టమైన మంత్రజపం ఒకే దేశం-ఒకే ఎన్నిక. ఈ ప్రసంగంలోనూ వినిపించారు. అసలు ఒకేదేశం ఒకేపన్ను, ఒకే కార్డు ఒకే పార్టీ, ఒకేమతం ఒకే మోడీ అన్నది ఆయనకు ఇష్టమైన ప్రచారం. ఒకేదేశం ఒకే ఎన్నిక సాధించడానికి కృషిచేయాలని మొన్నటి ప్రసంగంలోనూ నొక్కి వక్కాణించారు.అయితే ఆమరుసటి రోజునే వచ్చిన ఎన్నికల తేదీల ప్రకటన సంకేతాలేంటి? మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి వుండగా వాటిలో ఒకటైన మహారాష్ట్రలో జరపలేకపోతున్నట్టు సిఇసి రాజీవ్‌కుమార్ తేల్చిచెప్పారు. ఇందుకు అనేక కారణాలు చూపించినా ప్రధానమైంది మాత్రం భద్రతా దళాలు కాశ్మీర్‌లో వుండాల్సి రావడంతో ఏర్పడిన కొరత. కేవలం మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరపడమే ఇంత కష్టమైతే 28చోట్ల ఒకేసారి జరపాలనడం ఎంత హాస్యాస్పదం? పైగా రాజ్యాంగ నిబంధనల ప్రకారం కూడా శాసనసభల ఏర్పాటు, పార్లమెంట్‌లో లోక్‌సభ ఏర్పాటు వేర్వేరు విషయాలు. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య అని చెబుతున్న రెండవ అధికరణం ఏ శాసనసభకు దానిగా కాలపరిమితిని బట్టి ఎన్నికలు జరపాలంటుంది. ఒకే ఎన్నిక కోణమే లేదు. పైగా మిశ్రమ ప్రభుత్వాల యుగంలో ఏ కారణంతో ఏ సర్కారు కూలిపోయి సభ రద్దయినా మిగిలిన చోట అకారణంగా సభల పదవీ కాలం వున్నా ఎన్నికలు జరపడమనే ఆలోచనే అర్థరహితం. విడివిడిగా రాష్ట్రాలలో గానీ లేక ఏకంగా కేంద్రంలో గానీ సర్కార్లు పడిపోయి ఎన్నికలు జరపాల్సి రావచ్చు. మిగిలిన పదవీకాలానికి వాటిని కృత్రిమంగా కొన సాగించడం అకారణ సమస్యలను అనైతిక పెత్తనాన్ని ఆహ్వనించడమే అవుతుంది. అలాంటి అవకాశమే కల్పించితే నీతిమాలిన నేతలు కావాలని అనేక మాయోపాయాలను పాల్పడతారు కూడా. నిజానికి ఏకీకృత పెత్తనం కోరుకునే బీజేపీ-ఆరెస్సెస్ రాజకీయాల కోసం తప్ప ఈ విధానానికి హేతుబద్దతే లేదు. దేశాన్ని వంద రాష్ట్రాలుగా విభజించి కేంద్రానికే కీలకాధిపత్యం అప్పగించాలనేది వారి మనోగతం. ఒకేసారి ఎన్నిక జరిగిే ఘనత వహించిన మోడీ వంటి నేతను చూస,ి ప్రజలు రాష్ట్రాల నేతలను గాక ఆయన్ను చూసి అన్నిచోట్లా గెలిపిస్తారని అత్యాశ.ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో టికానా లేని బీజేపీ నిరంతరం ఒకే ఎన్నిక పాట పాడుతూనే వుంటుంది. ఒకేసారి ఎన్నికల కోసం ఎన్నుకున్న పదవీకాలం పూర్తికాకుండా ఏ సభను రద్దుచేసినా సుప్రీం కోర్టులో సవాలు చేయొచ్చు కూడా.
– తెలకపల్లి రవి