కాకతీయుల కళా సంపద పిల్లలమర్రి దేవాలయాలు

The art treasures of the Kakatiyas are Balsamari Temples– చెక్కు చెదరని అందమైన రాతి శిల్పకళ
-12వ శాతబ్ధం నుంచి పూజలందుకుంటున్న దేవదేవుడు
– దేవాలయాలకు నానాటికీ పెరుగుతున్న భక్తుల రద్దీ
నవతెలంగాణ – సూర్యాపేట రూరల్
కాకతీయుల కళా సంపదకు సజీవ సాక్ష్యంగా పిల్లలమర్రి దేవాలయాలు నిలిచాయి. అప్పటి రాజుల అభిరుచికి తగ్గట్టుగా నల్లని ఏకరాతి శిల్పాలతో ఎంతో శ్రమించి దేవాలయాలను నిర్మించారు. నాటి నుంచి నేటి వరకు భక్తుల కోరికలను తీరుస్తూ దేవాలయాలు దినదినాభివృద్ధి చెందుతున్నాయి. దేవాలయ నిర్మాణాల పురాణ గాధ. పురాతనమైన పిల్లలమర్రి గ్రామంలో దేవాలయాల నిర్మాణానికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. 12వ శతాబ్ధంలో కాకతీయుల రాజుల ఏలుబడిలో ఆమనగల్‌ ప్రాంతాన్ని బేతిరెడ్డి అనే సామంత రాజు పరిపాలన సాగిస్తుండేవారు. ఒక రోజు ఆ రాజు వేటకు వెళ్లి అడవిలో ఉన్న పెద్ద మర్రి వఠ వృక్షం కింద సేద తీరి ఉండగా చెట్టు మీద రెండు ”రామచిలుకలు కొద్ది సేపటిలో పెద్ద గాలి వాన వచ్చి మర్రి చెట్టు కూకటి వేళ్లతో కూలిపోవునని, చెట్టు కింద ఏడు కొప్పెర్ల నిధి దొరుకునని సంభాషించుకున్నాయి”. ఆ సంభాషన విని అర్థమైన ఎరుకలి వాడు పక్కున నవ్వాడు. ఇదంతా గమణిస్తున్న రాజు ఎరుకల వాడిని ఎందుకు నవ్వావని ప్రశ్నించగా చెప్పబోతున్న సందర్భంలో ఈ విషయం ఎవరికీ చెప్పవద్దని చెప్పినట్లైతే తల పగిలి చస్తావని శపించి రామచిలుకలు ఎగిరి పోయాయి. రాజు ఎరుకల వాడిని గద్దించి చెప్పక పోతే తల తీస్తానని బెదిరించాడు. అప్పుడు ఆ ఎరుకలి వాడు చెప్పినా.. చెప్పక పోయినా.. చావు తప్పదని గ్రహించి రాజును తన పేరుమీద గ్రామాన్ని నిర్మించాలని కోరి ఆ పక్షుల సంభాషణను రాజుకు చెప్పాడు. వెంటనే ఎరుకలి వాడు పక్షులు శపించిన విధంగా తల పగిలి చనిపోయాడు. వెంటనే పరిస్థితిని అంచనా వేసి రాజు అక్కడ నుంచి విశ్రమించాడు. గాలి వానకు మర్రి చెట్టు కూలిపోయి ఏడు కొప్పెర్ల ధనం లభించడంతో దేవాలయాలు నిర్మించారనే కథ ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. ఎరుకలి వాని పేరు మీద నిర్మించి ఎరుక వరం(యర్కారం) పిల్లలమర్రి గ్రామానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది.
దేవాలయాల నిర్మాణం
రెండవ ప్రోల రాజు కాకతీయ రాజ్యమును క్రీస్తుశకం 0001 నుంచి క్రీస్తు శకం 1158 వరకు పాలించాడు. ఆయన దగ్గర కామిరెడ్డి సైన్యాధిపతిగా పనిచేసేవాడు. ఆయనకు కాట్‌రెడ్డి, బేతిరెడ్డి మరియు నామిరెడ్డి ముగ్గురు సంతానం. బేతిరెడ్డి కాకతీయ రుద్ర రాజుకు సమకాలికుడై అనేక యుద్ధాలలో విజయం చేకూర్చారని ప్రసిద్ధి. క్రీస్తు శకం 1195లో త్రికుటాలయం, క్రీస్తుశకం 1202లో శ్రీ పార్వతీమహేవ నామేశ్వర స్వామి ఆలయాలను నామిరెడ్డి తల్లి,తండ్రి, తన పేరున మరియు క్రీస్తు శకం 1208లో బేతిరెడ్డి ఆయన భార్య ఎరకసానమ్మ పేరుమీద ఎరకేశ్వర ఆలయంను నిర్మించినట్లు శాసనాల ఆధారంగా తెలుస్తుంది.
కళా సంపదకు సజీవ సాక్ష్యం
కాకతీయుల నాటి కళా సంపదకు పిల్లలమర్రి దేవాలయాలు సాక్ష్యంగా నిలిచాయి. దేవాలయాలు ఎత్తౖన గోపురాలు, నునుపటి నల్ల రాతితో కూడిన ముఖమండప స్థంబాల తో నిర్మించారు. దేవాలయాల నిర్మాణానికి 72 నియోఘాల వారితో నిర్మించినట్లు పురానకారులు చెప్తున్నారు. దేవాలయాల ద్వారములపై అందమైన నగీసి పనులు, లతలు, పుష్పములు, వివిధ భంగిమలలో నృత్యం చేయు కళాకారులు, గాయకులు, వాద్యకాండ్రు సూక్ష్మాతి సూక్ష్మ వివరాలతో చెక్కబడి ఉన్నాయి. దేవాలయం లోపల అందమైన బండలపై అద్దంలో నీ డ కనిపించే విధంగా చెక్కినట్లు చరిత్ర కారులు చెప్తున్నారు. ఆ తదనంతరం ఢిల్లి సుల్తానుల పరిపాలనలో అప్పటి రాజు ఔరంగ జేబు హిందూ దేవాలయాలపై చేసిన దాడులలో దేవాలయ శిల్ప సౌందర్యం పాక్షికంగా దెబ్బతింది.
శివాలయాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి, శివాలయ కమిటీ చైర్మన్ కోట్ల సైదులు
శివాలయాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలనీ శివాలయ కమిటీ చైర్మన్ కోట్ల సైదులు అన్నారు. కాకతీయుల నాటి కళా సంపదకు పిల్లలమర్రి దేవాలయాలు సాక్ష్యంగా నిలిచాయన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కాకతీయుల నాటి దేవాలయాలైన పిల్లలమర్రి శివాలయాలకు చరిత్ర కలిగి ఉందన్నారు.భక్తుల రద్దీ నానాటికి పెరుగుతుందన్నారు. ప్రతి ఏటా మహాశివరాత్రిని పురస్కరించుకొని దేవాలయ కమిటీనీ ఏర్పాటు చేసుకుని, కమిటీ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో విద్యుత్‌ దీప కాంతులతో దేవాలయాన్ని అందంగా ముస్తాబు చేయడం జరుగుతుందన్నారు. ప్రత్యేక జరగబోయే ఉత్సవాలలో,భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్‌, పోలీస్‌ అధికారులు దేవాలయాల పరిసరాలను పరిశీలించి ఏర్పాట్లు సిద్ధం చేస్తామన్నారు.కాకతీయుల కాలం నాటి చరిత్ర కలిగిన శివాలయ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కోరారు.