కూల్చివేసిన ఇండ్ల బాధితుల ఆందోళన 

Concern of victims of demolished houses– తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నగర శివారులోని బొందం గడ్డ శిఖం భూమి కబ్జా వెనుక కీలక విషయాలు వెలుగులోకి రాగా పలువురు స్థానిక నేతలు నకిలీ పట్టాలు సృష్టించి పేదలకు వాటిని విక్రయించినట్లు తెలుస్తుంది. వంద గజాల ప్లాటుకు రూ.2 లక్షల వరకు సదరు వ్యక్తులకు ముట్టజెప్పినట్లు బాధితులు పేర్కొంటున్నారు. శనివారం ఉదయం బొందం గడ్డ చెరువు శిఖం భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేసిన విషయం తెలిసింే. కాగా బాధితులు తమ కుటుంబాలతో కలిసి ఆదివారం నగరంలోని ఐదో టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. అనంతరం ఎంఐఎం కార్పొరేటర్లు, నాయకులతో కలిసి తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. 9, 10, 11 డివిజన్లకు చెందిన శేఖర్, నరేశ్, మహమ్మద్, హైమద్లతో పాటు పలువురు స్థానికంగా ఖాళీగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి వాటికి పట్టాలు సృష్టించారు. అనంతరం పేదలకు వాటిని రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షల చొప్పున విక్రయించారు. పట్టాల ద్వారా నగరపాలక సంస్థ నుంచి ఇంటినంబర్లు పొందిన పలువురు ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టారు. అనంతరం విద్యుత్ శాఖ నుంచి మీటర్ పర్మిషన్లు కూడా తీసుకున్నారు. కాగా బొందం గడ్డ చెరువును సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో శిఖం భూమి కబ్జా అవుతోందని రెవెన్యూ అధికారులు ఇటీవల గుర్తించారు. సర్వే నిర్వహించి పెద్దమొత్తంలో ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లు తేల్చారు. ఈ క్రమంలోనే శనివారం సంబంధిత అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేశారు. కాగా బాధితులు అసలు విషయాలు బయటకు వెల్లడించడం నగరంలో చర్చకు దారితీసింది. పలువురు స్థానిక ప్రజాప్రతినిధుల భర్తలు ప్రభుత్వ స్థలాలపై కన్నేసి వాటిని అడ్డదారిలో విక్రయించి తమను మోసగించినట్లు బాధితులు పేర్కొంటున్నారు. వీరిలో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు కాగా మరో ఇద్దరు కాంగ్రెస్కు చెందిన నేతలున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. మరోవైపు బాధితులు మాట్లాడుతూ.. భూమిని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా తమ ఇళ్లను కూల్చడం సరికాదని వాపోయారు. ఈ విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని ఎంఐఎం కార్పొరేటర్లు తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలియజేశారు.