సోద‌ర ప్రేమ‌కు ప్ర‌తీక రాఖీపూర్ణిమ‌..

Rakhipurnima is a symbol of brotherly love.రాఖీ, రక్షా బంధన్‌, రాఖీ పూర్ణిమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి అని కూడా పిలుస్తారు. తోబుట్టువులచే రక్షాబంధనాన్ని పొందడం సంప్రదాయంగా వస్తున్నది. భారతీయ కుటుంబ బాంధవ్యాలలోని మాధుర్యానికి ఇది చిహ్నం. అందులోనూ అక్కాచెల్లెళ్ళకు అన్నదమ్ముల అనురాగం జీవితాంతం ఉండవలసిన బంధం అని గుర్తు చేసే పర్వదినం. ఇంటి ఆడపడుచును అప్యాయంగా చూసుకోవాలని దీని భావన. సోదరిచేత కట్టించుకున్న రక్షాబంధనం వారిద్దరి మధ్య ఇమిడి ఉన్న ప్రేమా, అనురాగాకు ప్రతీక. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ సంబంధాలకు ఈ పండుగను ఓ గుర్తుగా చెప్పుకోవచ్చు. అందుకే ఈ రక్షా బంధన్‌కు అంతటి ప్రాధాన్యం.
సోదర సోదరీమణుల మధ్య ఆత్మీయతా అనుబంధం పెంచేది ఈ రాఖీ పండుగే. సోదరీమణులు తమ సోదరులను ఇంటికి ఆహ్వానించి, నొసట కుంకుమ దిద్ది, హారతినిచ్చి, వారి కుడి చేతికి రక్ష కడతారు. సోదరులు అక్షింతలు వేసి తమ సోదరిని ఆశీర్వదించి ఆమెకు కానుకలు అందిస్తారు. సోదరి తన సోదరునకు పిండివంటలు పెట్టి తృప్తిగా వడ్డిస్తుంది. అలాగే ఎలాంటి ఆపద వచ్చినా ఒకరికి ఒకరు అండగా వుంటామని, రక్షణగా నిలుస్తామని ప్రతిన పూనే సమైక్య భావ నిలయమే ఈ పండుగ.
ఇల్లంతా సందడిగా…
రాఖీ పండుగని మొదట్లో ఉత్తర భారత దేశంలో ఎక్కువగా జరుపుకునేవారు. కాల క్రమేణా దేశవ్యాప్తంగా జరుపుకోవడం ప్రారంభించారు. సొంత సోదరులు లేకపోయినా బంధువులలో సోదర వరుస అయ్యే వారికి, సోదర భావంతో చూసేవారికి రాఖీ కట్ట వచ్చు. రాఖీ పండుగను ఉత్తర భారత దేశంలో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగకు ధనిక, పేద అనే బేధ భావం లేదు. అందరూ సమానమే. ప్రేమ, ఆప్యాయత ఉంటే చాలు. అక్క చెల్లెల్లు సుఖ సంతోషాలతో ఉండాలని సోదరులు, తమ సోదరుల ప్రేమ ఆప్యాయతలు చిరకాలం ఇలాగే ఉండాలని, వారు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని సోదరీమణులు మనసారా కోరుకుంటారు. సోదరులు ఇచ్చిన కానుకలను ఎంతో సంతోషంగా స్వీకరించి వారి మంచిని కోరుకుంటారు. ఇది సోదరి పట్ల సోదరులకుండే ప్రేమకు చిహ్నం. ప్రతి రోజూ పని ఒత్తిడిలో బిజీగా గడిపే అన్న చెల్లెళ్లు, అక్క తమ్ముళ్లు ఈ రోజు ఒక దగ్గరకు చేరుకుంటారు. ఇల్లంతా సందడితో నింపి సంబరంగా రాఖీ పౌర్ణమిని జరుపుకుంటారు.
– పాలపర్తి సంధ్యా రాణి

తమ్ముడితో ఎన్నో జ్ఞాపకాలు
మానాన్న కీ.శే.రంగారావు. ఆయన కలెక్టర్‌గా చేసి పదవీ విరమణ పొందారు. అమ్మ పద్మావతి. మా స్వగ్రామం విజయవాడ. నాకు ఒక అక్క, ఒక తమ్ముడు ఉన్నారు. తమ్ముడు నాకంటే నాలుగేండ్లు చిన్న. పేరు శ్రీనివాసరావు. నాకు తమ్ముడితో అనుబంధం ఎక్కువ. చిన్నప్పుడు ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం, చదువుకునే వాళ్ళం. వాడు చిన్నవాడు కావడం వల్ల నేను వీపు మీద వాడిని ఉప్పెక్కించుకొని తిప్పుతూ ఉండేదాన్ని. ఒకసారి చిన్నప్పుడు వాడిని పలకతో తల మీద కొట్టాను. ఎందుకు కొట్టాను అంటే వాడు గేటు పట్టుకొని ఊగుతున్నాడు. ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. దాంతో నా దగ్గర చేతిలో ఉన్న పలకతోటి తల మీద ఒక్కటి కొట్టాను. దాంతో తలపై గాయం అయ్యి హాస్పిటల్‌కి తీసుకెళ్లి కట్టు కట్టించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు మా అమ్మ నన్ను బాగా కోపడ్డారు. మొదట కోపంతో కొట్టినా తర్వాత చాలా బాధపడ్డాను.
నేను డాన్సర్‌ కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక ప్రోగ్రామ్‌కి వెళుతుండేదాన్ని. నాకు తోడుగా ఎప్పుడూ నాతో పాటు తమ్ముడు వచ్చేవాడు. ఇంట్లో వాళ్ళు ఒంటరిగా ఎక్కడికి పంపేవారు కాదు. నేను దేశ విదేశాల్లో ఎక్కడ నృత్య ప్రదర్శన ఇచ్చినా తమ్ముడు కచ్చితంగా నాతో ఉండేవాడు. నాతో పాటు తను మాస్కో వచ్చి దాదాపు నెల రోజులపాటు అక్కడే ఉన్నాడు. అక్కడ ఉన్నన్ని రోజులు తను నా విషయంలో చాలా చాలా శ్రద్ధ తీసుకున్నాడు. ఒకసారి ప్రోగ్రాం నిమిత్తం ఊటీ వెళ్ళినప్పుడు అక్కడ రామానాయుడు సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అందులో చిరంజీవి హీరో. ఆ షూటింగ్‌ జరుగుతున్న సమయంలో తమ్ముడు ఫ్లాష్‌ కెమెరాతో ఒక ఫొటో తీశాడు. ఫ్లాష్‌ పడటం వల్ల ఆ షూట్‌ పనికిరాదని చెప్పి, మళ్ళీ రీ షూట్‌ చేయవలసి వచ్చింది. ఆ సమయంలో నేను మా తమ్ముడిని చాలా కోప్పడ్డాను. ‘ఫొటో కావాలంటే వాళ్ళు షూటింగ్‌లో లేనప్పుడు తీసుకోవాలి అంతే కానీ ఇలా చేసి వారిని ఇబ్బంది పెట్ట కూడదు’ అన్నాను. ఊటీలో ఉన్నన్ని రోజులు బాగా తిరిగాము. అక్కడ గ్రౌండ్లో గోల్ఫ్‌ ఆడే వాళ్లం. ఇలాంటి జ్ఞాపకాలు తమ్ముడితో ఎన్నో ఉన్నాయి.
మా తమ్ముడు వంట చాలా బాగా చేస్తాడు. అమ్మ ఎప్పుడూ ‘వాడు చేసినట్టు వంటలు మీరు ఎవ్వరూ చేయలేరు’ అంటుంటుంది. ముఖ్యంగా నాన్‌ వెజ్‌ చాలా బాగా చేస్తాడు. ఎప్పుడు మా ఇంటికి వచ్చినా ఒట్టి చేతులతో రాడు. ఏదో ఒకటి వండి తీసుకొస్తాడు. మా ఇంటికి ఓ పది నిమిషాల దూరంలోనే తను ఉంటాడు. నాకు దగ్గరలో ఉండాలని ఇల్లు కట్టుకున్నాడు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వచ్చి చూసి వెళ్తుంటాడు. అంత అభిమానం నేనంటే. మా పిల్లలు వచ్చినప్పుడు వాళ్లకి ఇష్టమైనవన్నీ కొని పెట్టడం, వండి పెట్టడం చేస్తుంటాడు. వాళ్ళ కోసం తిను బండారాలు తీసుకొచ్చి ఫ్రిజ్‌ నిండా నింపేస్తూ ఉంటాడు. నాకూ, తమ్ముడికి ప్రకృతి అంటే చాలా ఇష్టం. అందుకని మేము ఇంట్లో వాళ్లకు తెలియకుండా అప్పుడప్పుడు లాంగ్‌ డ్రైవ్‌కి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం. వెళ్లి వచ్చిన తర్వాత చెప్పేవాళ్ళం. తమ్ముడు కొన్ని రోజులు వైజాగ్‌లో జాబ్‌ చేశాడు. ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఉన్న అడవుల్లోకి వెళ్లేవాళ్లం. అక్కడ నాలుగు రాళ్లు పెట్టుకొని వంట చేసుకుని తినటం, అడవిలోకి వెళ్లి తిరిగి రావడం చేసేవాళ్ళం. అమ్మకు తెలిసి బాగా కోప్పడే వారు. ‘వాడిది అసలే రాష్‌ డ్రైవింగ్‌, ఎందుకు వెళ్లావు’ అంటూ ఉండేవారు. ఇలా తమ్ముడితో ఎన్నో ఎన్నో మధుర జ్ఞాపకాలు తనతో. ఇప్పుడు ఇద్దరం పెద్ద వాళ్ళం అయిపోయాము. అయినా మా మధ్య ప్రేమా, అప్యాయత ఏ మాత్రం తగ్గలేదు. ప్రతి ఏడాది కచ్చితంగా రాఖీ కడతాను. అన్ని విషయాల్లో తమ్ముడు నాకు అండగా నిలడతాడు. ఇలాంటి తమ్ముడు దొరకడం నిజంగా నా అదృష్టం. మా అనుబంధం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ…