కేరళలో బీజేపీకి షాక్‌

పార్టీని వీడిన చిత్ర దర్శకుడు అలీ అక్బర్‌
– ఇప్పటికే కాషాయపార్టీకి రాజీనామా చేసిన సినిమా డైరెక్టర్‌ రాజసేనన్‌

తిరువనంతపురం:సినీ గ్లామర్‌ను ఉపయో గించుకొని కేరళ రాజకీయాల్లో లబ్ది పొందాలని భావిస్తున్న బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతు న్నాయి. చిత్ర దర్శకుడు అలీ అక్బర్‌ అలియాస్‌ రామసింహన్‌ అబూబక్కర్‌(60) బీజేపీకి రాజీనామా చేశారు. గత పది రోజుల్లో కేరళలోని బీజేపీతో విభేదించటం, పార్టీని వీడటం చేసిన సినీ వ్యక్తులలో అలీ అక్బర్‌ మూడోవారు కావటం గమనార్హం. గతేడాదే ఇస్లాంను వీడి హిందూ మతంలోకి మారిన అలీ అక్బర్‌.. తన పేరును రామసింహన్‌ అబూబ క్కర్‌గా పేరు మార్చుకున్నాడు.
ఆయన తన నిర్ణయాన్ని ఫేస్‌బుక్‌ పోస్టులో ప్రకటించారు. అలాగే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె సురేంద్రన్‌కు తెలుపుతూ ఏక వాక్య రాజీనామా పత్రాన్ని సైతం ఆయన పోస్టు చేశారు. ” నేను ఎలాంటి రాజకీయాలకూ బానిసను కాను. ఇప్పుడు నేను అన్నింటి నుంచి విముక్తుడన య్యాను. ధర్మం కోసమే నిలబడతాను” అని రామసింహన్‌ వివరించారు.
బీజేపీ పార్టీ తరఫున ఉన్న ముస్లిం వ్యక్తులలో అత్యంత ప్రముఖుడైన అక్బర్‌ 2021 అక్టోబరులో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా వైదొలిగారు. అప్పటి నుంచి ఆయన పార్టీలో ఒక సాధారణ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
ఉత్తర కేరళలోని ముస్లింలలో ఆరెస్సెస్‌ గురించి ప్రచారం కలిపించేందుకు బీజేపీ అక్బర్‌ను వాడుకోవాలనుకున్నది. అయితే ఆయన పార్టీని వీడటంతో బీజేపీకి గట్టి దెబ్బ తగిలినట్టయిం దని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా కొనసాగిన ప్రముఖ మళయాల చిత్ర దర్శకులు రాజసేనన్‌.. గతవారమే ఆ పార్టీని వీడారు. అలాగే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన నటుడు భీమన్‌ రఘు.. తాను కూడా బీజేపీని వీడనున్నట్టు సంకేతాలు పంపారు. తాను సీఎం పినరయి విజయన్‌కు గొప్ప అభిమానిననీ, ఆయనతో సమావేశం తర్వాత తన తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తానని రఘు గతవారమే వెల్లడించాడు.