ఇద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ..

– రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవు..
– నవతెలంగాణ కథనానికి స్పందన..
– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్ : రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్  పవార్ హెచ్చరించారు.సూర్యాపేట జిల్లాలోని రైతులను  ఇబ్బందులకు గురిచెస్తున్న ఇద్దరు తహసీల్దార్  కార్యాలయ ఉద్యోగులను సస్పెన్షన్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.  కోదాడ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ సాయిరాం,  రెవెన్యూ ఇన్స్పెక్టర్ పి. సుజిత్ పై రైతుల నుండి పలు ఆరోపణలు రావడంతో స్పందించిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోదాడ ఆర్దివో ను విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవాలు నిజమేనని తేలడంతో కోదాడ తహశీల్దార్ సాయిరాం ను బదిలీ చేశారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుజిత్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.అదే విదంగా పైసలిస్తేనే ఫైల్ కదిలేది. తవ్వినకొద్దీ బయటపడుతున్న అక్రమాలు అని ఈనెల 15 ,17 తేదీలలో నవతెలంగాణ దినపత్ర క లో కథనాలు రావడంతో కలెక్టరేట్ కార్యాలయంలో పరిపాలన విభాగంలో డిప్యుటేషన్ పై పని చేస్తున్న నాగారం తహశీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ షఫీ ఉద్యోగుల నుండి పలు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ విచారణలో వాస్తవాలు రుజువు కావడంతో సదురు ఉద్యోగిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.