ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో హైటెక్‌ కాపీయింగ్‌

మ్యాథ్స్‌ 1బీ ప్రశ్నాపత్రంపై
జవాబులు రాసి విద్యార్థికి ఇచ్చిన డీఓ
విచారణను పక్కదారి పట్టిస్తున్న డీఐఈఓ వడ్డెన్న
నవతెలంగాణ-సిటీ బ్యూరో
హైదరాబాద్‌ ఎస్‌ఆర్‌నగర్‌ అమోఘ జూనియర్‌ కాలేజీలో (సీనెం. 60334)లో హైటెక్‌ కాపీయింగ్‌ ఆలస్యంగా వెలుగు చూసింది. గురువారం ఉదయం 9 గంటలకు ఇంటర్‌ అడ్వాన్సుడ్‌ సప్లిమెంటరీ పరీక్ష గణిత శాస్త్రం 1బీ జరిగింది. అక్కడ డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌గా (జీజేసీ మారేడ్‌పల్లిలో ఎకనామిక్స్‌ అధ్యాపకుడు) ఉన్న ఆంజనేయులు రహస్యంగా మ్యాథ్స్‌ ప్రశ్నపత్రాన్ని తీసుకొచ్చి కళాశాల గణిత అధ్యాపకుని చేత సమాధానాలు రాయించాడు. అనంతరం దాన్ని ఓ విద్యార్థికి ఇచ్చాడు. అది గమనించిన మిగతా విద్యార్థులు ప్రశ్నించారు. పరీక్ష పూర్తయిన తర్వాత విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, పేరెంట్స్‌ అసోసియేషన్‌కు, విద్యార్థి సంఘాలకు సమాచారం ఇచ్చారు. పరీక్షా కేంద్రంలో జరుగుతున్న హైటెక్‌ కాపీయింగ్‌పై హైదరాబాద్‌ డీఐఈఓ వడ్డెన్నను ఫోన్‌లో సంప్రదించగా.. విషయాన్ని దాటవేస్తూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్‌ ఆంజనేయులు విద్యార్థి తల్లిదండ్రుల వద్ద భారీస్థాయిలో డబ్బులు తీసుకొని కాపీయింగ్‌కు సహకరించారని తెలిసింది. ఈ విషయం అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్‌ అయినప్పటికీ విచారణకు వచ్చిన డీఐఈఓ అసలు దోషిని వదిలేసి విషయంలో సంబంధం లేని చీఫ్‌ సూపరింటెండెంట్‌ (జీజేసీ ఉసేయినీ ఆలం ఒకేషనల్‌ అధ్యాపకుడు) శ్రీనివాస్‌రెడ్డికి మెమో ఇచ్చి చేతులు దులుపుకున్నట్టు తెలుస్తోంది. ప్రశ్నపత్రంపై సమాధానాలు రాసి ఇచ్చిన డీఓను వదిలిపెట్టి చీఫ్‌ సూపరింటెండెంట్‌పై తప్పుడు రిపోర్టు పంపినట్టు తెలుస్తుంది.
వివాదాలకు, అవినీతికి కేంద్ర బిందువుగా డీఐఈఓ
గతంలో నిజామాబాద్‌ జిల్లాకు డీఐఈఓగా ఉన్న సమయంలో వడ్డెన్నపై ఏసీబీ కేసు నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్‌ జిల్లాలో నిబంధన లకు విరుద్ధంగా నడుస్తున్న ప్రయివేటు, కార్పొరేట్‌ కళాశాలలు వేసవి సెలవుల్లో కూడా తరగతులు నిర్వహిస్తున్నా.. ఆయన పట్టించుకోకుండా పెద్దమొత్తంలో అవినీతికి పాల్పడుతున్నట్టు పలు విద్యార్థి సంఘాలు ఆరోపి స్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న కళాశాలలకు సహకరి స్తున్న హైదరాబాద్‌ డీఐఈఓ వడ్డెన్నపై ఇంటర్‌ బోర్డు సెక్రటరీ, అధికారులు తగిన విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలు, పేరెంట్స్‌ అసోసియేషన్‌లు డిమాండ్‌ చేస్తున్నాయి.