అమెరికా జోక్యం-ప్రపంచ ప్రజాస్వామ్య విధ్వంసం

American intervention-destruction of global democracyప్రజాస్వామ్య ప్రోత్సాహం సాకుతో అమెరికా ప్రజాస్వామ్య జాతీయ ధర్మసంస్థ (నేషనల్‌హొఎండొమెంట్‌ ఫర్‌ డెమోక్రసీ-ఎన్‌ఈడీ) జోక్యం, విధ్వంసక ప్రయత్నాల నుండి అంతర్జాతీయ సమాజం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే ప్రజాస్వామ్యం, అభివృద్ధి, శాంతి, అంతర్జాతీయ న్యాయం సాధ్యమవుతాయి. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, మానవ హక్కుల ముసుగులో విదేశాల అంతర్గత అంశాల్లో చొరబాటు, విధ్వంస ప్రయోజనాలకు అమెరికా ఎన్‌ఈడీని వాడుకుంటోంది. ఇది ఆ దేశాల సార్వభౌమాధికారం, అభివృద్ధి, ప్రయోజనాల, అంతర్జాతీయ చట్టం, అంతర్జాతీయ భద్రత సంబంధాల ప్రాథమిక నిబంధనల తీవ్ర ఉల్లంఘన. ప్రపంచ శాంతి, స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
అమెరికా ప్రభుత్వం నుండి నిధులు పొందుతున్న ఎన్‌ఈడీ అమెరికా కేంద్ర నిఘా సంస్థ (సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ-సీఐఎ) రహస్య కార్యకలాపాలను అమలుచేస్తోంది. సీఐఎ, అమెరికా సమాఖ్య ప్రభుత్వ పౌర విదేశీ నిఘా సేవా సంస్థ. ప్రపంచం పదిదిక్కుల నుండి అన్ని దేశాల జాతీయ భద్రత సమాచార సేకరణ, వ్యవహార ఆచరణ కార్యక్రమాల పద్దతీకరణ, విశ్లేషణ దీని విధులు. అమెరికా ఎన్‌ఈడీని తెల్ల చేతితొడుగులా పరిగణిస్తోంది. వైద్యశాలల, పరిశ్రమల, హోటళ్ళ, వితరణ సంస్థల శుభ్రతకు తెల్ల చేతితొడుగులు సంకేతం. ఇతర దేశాల్లో రాజ్యాధికార అణచివేత, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం, విభజన, ఘర్షణల ప్రేరేపణ, కార్పొరేట్ల ఆయుధాల అమ్మకానికి, విదేశాల ప్రకృతి, మానవ వనరుల దోపిడీకి యుద్ధాలు చేయించడం, ప్రజల అభిప్రాయాన్ని తప్పుదారి పట్టించడం, సైద్ధాంతిక, సాంకేతిక చొరబాట్ల నిర్వహణ వంటివి చాలాకాలంగా అమెరికా కొనసాగిస్తున్న అతిక్రమణ చర్యలు. ”దశాబ్దాలుగా సీఐఏ రహస్యంగా చేస్తున్న పనులను ఎన్‌ఈడీ బహిరంగంగా చేస్తుంది. దాంతో సీఐఎ రహస్య చర్యల నిర్వహణల కళంకాన్ని తొలగిస్తుంది” అని అమెరికా పండితుడు, రచయిత, పాత్రికేయుడు, అమెరికా విదేశాంగ విధాన విమర్శకుడు 85 ఏళ్ల వయసులో 2018 డిసెంబర్‌ 9 న మరణించిన విలియం బ్లమ్‌ పేర్కొన్నారు.
అంతర్జాతీయ శాంతి కార్నెగీ ధర్మసంస్థ (కార్నెగీ ఎండోమెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌) నివేదిక ప్రకారం, అన్ని ఎన్‌ఈడీ నిధులు అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) నుండి వచ్చాయి. అంతర్జాతీయ శాంతి కార్నెగీ ధర్మసంస్థ ఐరోపా, దక్షిణ, తూర్పు ఆసియా, మధ్య ప్రాచ్యం, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అంతర్జాతీయ వ్యవహారాల నిష్పక్షపాత తాత్విక సంస్థ. ఎన్‌ఈడీ దీర్ఘకాలిక లక్ష్యం అమెరికా శత్రువుల ప్రత్యర్థులను అంటే అమెరికా మిత్రులను శక్తివంతం చేయడం, విదేశీ ప్రభుత్వాలను మార్చగల వారి సామర్థ్యాన్ని పెంచడం అని ఎన్‌ఈడీ నిర్దేశకుల బోర్డ్‌
అధ్యక్షుడు కెన్నెత్‌ వోలాక్‌ ఒకసారి అమెరికా కాంగ్రెస్‌కు చెప్పారు. ఇరాన్‌ ప్రభుత్వ కూల్చివేతకు, ఇరాన్‌లో శాంతిభద్రతల భంగానికి, అశాంతి ప్రేరేపణకు మానవ హక్కుల ఉద్యమం ద్వారా ఎన్‌ఈడీ చేసిన ప్రయత్నాలను ఇరాన్‌ మీడియా, బీఎన్‌ఈడీ, ట్రోజన్‌ హార్స్‌గా పేర్కొంది. గ్రీకు పురాణగాథల్లో ప్రఖ్యాతి గాంచిన యుద్ధం ట్రోజన్‌లో దాడులకు గురైన కంచుయుగపు నగరం ట్రారులో ప్రవేశించడానికి గ్రీకులు దాచిపెట్టుకున్న బోలు కొయ్య గుర్రాన్ని గ్రీకు పురాణాల్లో ట్రోజహార్స్‌ అంటారు. ఎన్‌ఈడీ అమెరికా అనుకూల మీడియా సంస్థలకు మద్దతిచ్చింది. అరబ్‌ దేశాల్లో ప్రజాస్వామ్య కార్యకర్తల ముసుగులో అరబ్‌దేశాల వ్యతిరేక శక్తులను ప్రోత్సహించింది. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛల కోసం పనిచేస్తున్నట్టు నటిస్తున్న రాజకీయ సమూహాలకు ఆర్థిక సహాయం చేసింది. ఎన్‌ఈడీ చాలా కాలంగా యూరప్‌లో చొరబడింది. యూరోపియన్‌ యూనియన్‌ అధికారులకు సహకరిస్తూ, యూరోప్‌ స్వతంత్ర మీడియా సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తూ, ప్రజల అభిప్రాయాన్ని అమెరికాకు అనుకూలంగా మలుచుకుంటున్నది.
ఎన్‌ఈడీ చైనా అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుంటోంది. తైవాన్‌ వేర్పాటువాద శక్తులకు మద్దతిస్తోంది. చైనా ప్రత్యేక పాలనా ప్రదేశం హాంకాంగ్‌లో చైనా వ్యతిరేక శక్తులతో కుమ్మక్కైంది. చైనా వ్యతిరేక సంస్థ ‘వరల్డ్‌ ఉయ్ఘర్‌ కాంగ్రెస్‌’ కు మద్దతిచ్చింది. చైనా స్వయంప్రతిపత్తి ప్రాంతం జిన్జియాంగ్‌ లోపల, వెలుపల ఉయ్ఘర్‌ ప్రజల సమిష్టి ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నానని చెప్పుకునే బహిష్కృత ఉయ్ఘర్‌ సమూహాల అంతర్జాతీయ సంస్థ వరల్డ్‌ ఉయ్ఘర్‌ కాంగ్రెస్‌. ఇతర దేశాలను అస్థిరపర్చడానికి ఎన్‌ఈడీ విభజన ఘర్షణలను ప్రేరేపించింది. టిబెట్‌ చైనాతో 23 మే 1951న 17 అంశాల ఒప్పందం కుదుర్చుకుంది. 24 అక్టోబర్‌ 1951న 14వ దలైలామా ఈ ఒప్పందాన్ని ఆమోదించారు. అయితే ఒత్తిడి వల్ల ఆమోదించానని తర్వాత అన్నారు. టిబెట్‌ చైనా స్వయంప్రతిపత్తి ప్రాంతంగా, నైరుతి చైనా భాగంగా అంతర్జాతీయంగా గుర్తించబడింది. ఎన్‌ఈడీ అక్కడ ‘టిబెట్‌ స్వాతంత్య్రం’ కార్యకలాపాలకు మద్దతునిస్తోంది. ఎన్‌ఈడీ వ్యూహాలను మారుస్తూనే ఉంది. శాంతి, అభివృద్ధి, ఉభయ విజయ సహకార చారిత్రక పోకడలకు వ్యతిరేకంగా మరింత ముందుకు సాగింది. దాని నిజ స్వభావం, అసంఖ్యాక దుశ్చర్యలను అమెరికా ప్రజలతో సహా ప్రపంచ సమాజం తీవ్రంగా ఖండించింది.
అమెరికా అనుకూల విదేశీ రాజకీయ నాయకులు, పార్టీలకు మద్దతు ఇవ్వడానికి అమెరికా పన్ను చెల్లింపుదారుల డబ్బును చాలా వృధాచేసిందని, విదేశీ ఎన్నికల కార్యకలాపాలకు దొంగచాటుగా నిధులు సమకూర్చిందని, ఇటువంటి ఎన్నికల అవకతవకలను ప్రజాస్వామ్య ప్రోత్సాహంగా చిత్రీకరించిందని అమెరికా కాంగ్రెస్‌ పూర్వసభ్యుడు రాన్‌ పాల్‌ అన్నారు. రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ 2015 లో ఎన్‌ఈడీని అవాంఛనీయ సంస్థల జాబితాలో చేర్చింది. రష్యాలో దాని కార్యకలాపాలను నిషేధించింది. ప్రతి దేశానికి తన జాతీయ వాస్తవాలకు, ప్రజల అవసరాలకు సరిపోయే అభివృద్ధి మార్గాన్ని అనుసరించే హక్కు ఉంది. అమెరికా ఎన్‌ఈడీని విదేశీ జోక్య సాధనంగా ఉపయోగించే జుగుప్సాకర చర్యలను ప్రపంచ ప్రజలు నిరసిస్తున్నారు.” అని సామాజిక శాస్త్రాల చైనా విద్యాసంస్థలో అమెరికా అధ్యయనాల సంస్థ సహచర పరిశోధకుడు వాంగ్‌ కాంగ్యూ అన్నారు.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545