సాహిత్యంలో చైత‌న్యం

Consciousness in literatureస్త్రీ, పురుష భేదాలను ఆమె సహించరు. కులం, మతం, ప్రాంతీయ భేదాలను ఒప్పుకోరు. ధనిక, పేద తారతమ్యాలు అంతం కావాలంటారు. స్త్రీని వ్యాపార వస్తువుగా చూడటాన్ని ఆమె ఖండిస్తారు. వేధింపులను వ్యతిరేకిస్తారు. అమానవీయ ఘటనలపై తన రచనల ద్వారా దునుమాడుతారు. ప్రయివేటీకరణ దుష్పరిణా మాలను తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఓ పాత్రికేయురాలిగా, సినీ గేయ రచయితగా, సామాజిక కార్యకర్తగా సమసమాజం కోసం నిత్యం తపిస్తూనే ఉంటారు. ఆమే చైతన్య పింగళి. ఊహల్లోని కథలను అద్భుతంగా దృశ్యరూపకం చేసే సృజనాత్మకత ఆమె సొంతం. అన్యాయం అనుకుంటే ఎదురిస్తారు. అందుకే మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దురాగతాలపై త్వరలో ఓ పుస్తకాన్ని ముద్రించబోతున్న ఆమె పరిచయం నేటి మానవిలో…
భారత దేశ జాతీయ పతాక రూపశిల్పి స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్యకు చైతన్య పింగళి మునిమనుమరాలు. పింగళి హేరంబా, వెంకట చలపతిరావుల కొడుకు దశరథరామయ్య, సుశీల దంపతుల కుమార్తె ఈమె. చైతన్య పుట్టింది విజయవాడలో అయినా పెరిగింది మాత్రం నందిగామలో. బాల్యం నుంచే సాహిత్యం పట్ల ఆసక్తితో ఉండేవారు. శ్రీశ్రీ, చలం సాహిత్యాని బాగా చదివేవారు. వారి స్ఫూర్తితోనే రాయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమె సినిమా మాటలు, పాటల రచయితగా కొనసాగుతున్నారు. స్క్రీన్‌ప్లేలో సరికొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కొంతకాలం పాత్రికేయురాలిగా కూడా పనిచేశారు.
రచయితగా ప్రస్థానం…
చైతన్య గర్భవతిగా ఉన్నప్పుడు ‘చిట్ట్టగాంగ్‌ అప్రైసింగ్‌’ అనే పుస్తకం ద్వారా చిట్టగాంగ్‌ మహిళల గురించి తెలుసుకున్నారు. అదే సమయంలో ‘నిర్భయ’ ఘటన జరగడంతో చిట్టగాంగ్‌ మహిళల స్ఫూర్తిని ఈ తరానికి అందించాల్సిన అవసరం ఉందని గుర్తించి ఎలాగైనా పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నారు. పూర్తిస్థాయిలో సమాచారం దొరికిన పదిమంది గురించి రాశారు. పుస్తకం రాసేందుకు అవసరమైన సమాచారం కోసం ఆమె ఈశాన్య రాష్ట్రాలతోపాటుగా బంగ్లాదేశ్‌లో కూడా పర్యటించారు. అదే తరహాలో ప్రస్తుతం మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న దురాగతాలపై కొత్త పుస్తకాన్ని రాస్తున్నారు. దీనికోసం ఆమె ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కొన్ని రోజులపాటు ఉండి వచ్చి అక్కడి వాస్తవిక గాథలను తెలుసుకున్నారు.
యువ పురస్కారం
ఆమె రాసిన ‘చిట్టగాంగ్‌ విప్లవ వనితలు’ అనే కథల సంపుటి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అవార్డు-2016కు ఎంపికైంది. ఆమె ప్రయోగాత్మక కథా రచనలో విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్నారు. అప్పట్లో దేశవ్యాప్తంగా 24 భాషలకు సంబంధించి 24 మంది యువ రచయితలకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. వారిలో చైతన్య ఒకరు కావడం గర్వించదగ్గ విషయం. ‘మనసులో వెన్నెల’ పుస్తకాన్ని కూడా ఆమె రాశారు.
సినిమాల్లో అవకాశం
‘గోదావరి’ సినిమా ఆడిషన్స్‌ జరిగిన సమయంలో చైతన్య కూడా వెళ్లారు. ఆ క్రమంలో రచయితగా ఆమె శేఖర్‌కమ్ములను పరిచయం చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్‌ మొత్తం పరిశీలించి, సలహాలు ఇవ్వాలని శేఖర్‌ కమ్ముల ఆమెను కోరారు. తనవంతుగా కొన్ని సలహాలు, ఇతరత్రా సూచనలు సైతం చేశారు. ఆ సమయంలోనే చైతన్య రాసిన పుస్తకాలు, ఆర్టికల్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమెలోని టాలెంట్‌కు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. అలా గత పదమూడు ఏండ్లుగా ఆమె శేఖర్‌ కమ్ముల వద్ద పనిచేస్తున్నారు.
కో రైటర్‌గా…
వరుణ్‌తేజ్‌ నటించిన ‘ఫిదా’ సినిమాకు శేఖర్‌ కమ్ముల ఆమెకు కోరైటర్‌గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో ‘ఊసుపోదు ఊరుకోదు… ఉండనీదు వెళ్ళనీదు…’, ‘ఫిదా ఫిదా’, పాటలు ఆమె రచించారు. ఈ సాహిత్యం సరికొత్త పంథాలో…లోతైన జీవన చిత్రణకు రూపమిచ్చింది. నేల టిక్కెట్‌ సినిమాలో ‘బిజిలి’, ‘విన్నానులే’, ‘లవ్‌స్టోరీ (2020)’ సినిమాలో ‘ఏరు పిల్ల’, మసూద (2022)లో ‘దాచి దాచి’ వంటి పాటలు రాశారు. ప్రస్తుతం శేఖర్‌కమ్ముల చేసే సినిమాలకు ఆమె కోరైటర్‌గా పనిచేస్తున్నారు. కోలీవుడ్‌ హీరో ధనుష్‌ 51 సినిమాగా ‘డిఎన్‌ఎస్‌’ వర్కింగ్‌ టైటిల్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ఆమె అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. చాలా షార్ట్‌ఫిలిమ్స్‌కు మాటలు, పాటలు రాశారు. ప్రస్తుతం మరో రెండు సినిమాలకు పాటలు రాస్తున్నారు.
అన్యాయాన్ని ప్రశ్నిస్తూ…
ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించేందుకు సిద్ధంగా ఉండే చైతన్య ‘ఆంధ్రుల హక్కు…విశాఖ ఉక్కు’ పేరుతో విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమానికి మద్దతు పలికారు. ప్రజల పక్షాన నిలిచే ఇరోం షర్మిలా, సాయిబాబా వంటి హక్కుల కార్యకర్తలపై పెట్టిన దేశద్రోహ కేసులను ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలకు ఆమె సంఘీభావాన్ని ఎప్పుడూ తెలియజేస్తుంటారు. సోషల్‌మీడియా ద్వారా తన గొంతును నిర్భయంగా వినిపిస్తుంటారు.
– యడవల్లి శ్రీనివాసరావు