యుద్ధాలతో ప్రాణాంతక రోగాల విజృంభణ

Outbreak of deadly diseases with warsయుద్ధాల వల్ల, ఒకవైపు ఆయుధ పరిశ్రమలు బాగుపడుతున్నాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో రాజ్యం పట్టు పెంచుకుంటోంది. మరోవైపున పౌర జనాభాకు..యుద్ధ ప్రాంతంలో ఉండేవారికే కాకుండా, బయటఉండే వారికి కూడా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. యుద్ధాల వల్ల అంటువ్యాధులు, మహమ్మారులు ప్రబలుతాయి. ఆరోగ్య సంక్షోభాలు వస్తాయి. ఏ యుద్ధ చరిత్ర చూసినా ఇదే కనిపిస్తుంది.గాజాలో ఇజ్రాయిల్‌ చేస్తున్న యుద్ధం, ఊచకోత, పోలియో ప్రబలడానికి కారణమవుతున్నది.టీకాల కార్యక్రమం ఆగిపోవడం వల్ల, మురుగు నీటి వ్యవస్థ విచ్ఛినం కావడం వల్లా యుద్ధానికి ముందు నియంతరణలో ఉన్న పోలియో, మళ్లీ విజృంభిస్తున్నదని డబ్ల్యు.హెచ్‌.ఓ చెబుతు న్నది. కిక్కిరిసిపోయిన శరణార్థుల గుడారాల శిబిరాల్లో ఇది మరింత ఎక్కువ.
ఇజ్రాయిల్‌ విచక్షణారహితంగా చేస్తున్న బాంబుల దాడి వల్ల, వ్యాక్సిన్లతో సహా ఇతర అత్యవసర వైద్య సరఫరాలు ఆగిపోయాయి. తొమ్మిది నెలలుగా వ్యాక్సిన్లు లేకపోవడంతో వారికి-పోలియో పెరిగే ప్రమాదం తీవ్రమౌతోంది. వ్యాక్సిన్‌ సక్రమంగా ఇవ్వకపోతే వచ్చే ‘వ్యాక్సిన్‌ పోలియో’ కూడా కనిపిస్తోంది. తక్షణం ఈ సంక్షోభంలో జోక్యం చేసుకోవడం అంతర్జాతీయ సమాజం బాధ్యత. సురక్షిత నీరు, శానిటేషన్‌ లేకపోవడం వల్ల ఇతర అంటువ్యాధులూ పెరుగుతున్నాయి. హెపటై టిస్‌-ఎ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ విషయం ఐక్యరాజ్యసమితే చెప్పింది. అక్టోబర్‌ నుండి 4వేల కేసులు రిపోర్టు అయ్యాయి.
ఈ పరిస్థితులలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పది లక్షల పోలియో వ్యాక్సిన్లను గాజాకు పంపుతున్నట్లు తెలిపింది. పసిపిల్లలను రక్షించి జబ్బు వ్యాప్తిని నిరోధించటానికి ఉద్దేశించినది ఇది. యుద్ధం, అస్థిరతలు ఉన్న పరిస్థితుల్లో ఇదంతా సాధ్యమవు తుందా అనే సందేహం ఉండనే ఉంది. వ్యాక్సిన్లను ఇజ్రాయిల్‌ సైన్యం వరకు ఇస్తే చాలానే సంకుచిత అభిప్రాయంతో ఇజ్రాయిల్‌ ఆరోగ్య అధికారులు ఉన్నారు. కానీ వైరస్‌లు మనుషులు పెట్టుకొన్న సరిహద్దులను లెక్కచేయవు. అవి అన్ని వైపులా వ్యాపిస్తాయి. వెంటనే తగిన చర్యలు తీసుకొని వైద్య సేవలు పునరుద్ధరించక పోయినట్లయితే, గాజాకే కాదు..పాలస్తీనా పౌరులకే కాదు.. ఆ ప్రాంతమంతటా.. ఒక ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది. గాజాలో ఉన్న బాధిత ప్రజల ఆరోగ్యానికి, భద్రతకూ, మానవీయ సహాయానికి అంతర్జాతీయ సమాజం ప్రాధాన్యతనివ్వాలి. ఇప్పటి వరకు, ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై మొదలెట్టిన ఈ యుద్ధం, ఊచకోతలో, 18 లక్షల అంటువ్యాధుల కేసులు రిపోర్ట్‌ అయ్యాయి.
యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌-సూపర్‌ బగ్‌లు
యాంటీబయాటిక్స్‌ను సక్రమంగా వాడకపోతే, యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ వస్తుంది. అంటే సూక్ష్మజీవులు యాంటీబయాటిక్స్‌ వల్ల నశించ కుండా, వాటికి అలవాటు పడి, తట్టుకొని మరింత శక్తివంతంగా తయారవుతాయి. ఇటువంటి బ్యాక్టీరి యాలనే సూపర్‌ బగ్స్‌ అంటారు. యుద్ధాలు ఇటువంటి సూపర్‌బగ్స్‌ తీవ్రతను, వ్యాప్తిని పెంచు తాయి. 2003లో అమెరికా ఇరాక్‌ను ఆక్రమించిన యుద్ధం తరువాత, సైనికుల్లో ఇవి కనిపించాయి. పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు ఇవి విజృంభి స్తాయి. ఉక్రెయిన్‌, గాజా ప్రాంతాలలో, దెబ్బతిన్న ఆసుపత్రులలో ఇవి సులభంగా సైనికుల నుంచి పౌరులకు ప్రబలుతాయి. మందుపాతరల శకలాలు, మిస్సైల్‌ శకలాలలో, భార లోహ శకలాలలో కూడా ఈ బ్యాక్టీరియా ఉండి, పరిస్థితిని దిగజారుస్తాయి.
అమెరికా, నాటో వత్తాసుతో జరుగుతున్న ఈ యుద్ధాలు.. ప్రజారోగ్య సంక్షోభాలకు యాంటీ బయాటిక్‌ రెసిస్టెంట్‌ బ్యాక్టీరియాల ఆవిర్భావానికి కారణమవుతున్నాయి. యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ తగ్గించాలని ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ ప్రచారం జరుగుతోంది. కానీ రెండు దశాబ్దాలుగా, యుద్ధాల వల్ల, ఇటువంటి రెసిస్టెన్స్‌ పరిస్థితి ఏర్పడితే దాన్ని, పట్టించుకోవడం లేదు. వాతావరణ మార్పు లాగా ఇది కూడా ఎప్పుడో, నిదానంగా వచ్చే సమస్యగా భావిస్తున్నారు. రాజకీయ నిర్లక్ష్యం, ఆర్థిక వనరుల కేటాయింపులలో నిర్లక్ష్యం కనిపిస్తోంది.ఈ పరిస్థితుల్లో కొత్త యాంటిబయాటిక్స్‌ను కనుగొనా లన్నా, ప్రత్యామ్నాయ వైద్యాలు ఆవిష్కరిం చాలన్నా, అంతర్జాతీయ సహకారం అవసరమని గ్రహించాలి. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ లాంటి చోట్ల సూపర్‌ బగ్స్‌ను ఎదుర్కొనే పరిశోధనలు చేస్తున్నారు. ‘జోసురాబాల్‌ పిన్‌’ అనే మందుపై మొదటి దశ ప్రయోగాలు జరుగుతున్నాయి. కానీ ఇది ఒక మానవీయ సమస్య అనీ, రాజకీయ సమస్య అనీ గుర్తించాలి. దీనికి దీర్ఘకాలిక, రాజకీయ పరిష్కారాలు ఉంటాయి కానీ, శాస్త్ర సాంకేతిక పరిష్కారాలు ఒకటే చాలవు.
చరిత్రలో యుద్ధాలు, వ్యాధులు
యుద్ధాలు మనుషుల్ని నిలువ నీడ లేకుండా చేసి తరిమివేస్తాయి. ఆరోగ్య వ్యవస్థలను దెబ్బతీస్తాయి. అయితే మహ మ్మారులు యుద్ధాలను కూడా తీవ్రతరం చేస్తాయి. అవి జాతీయ వాదాన్ని, జాత్యహంకారాన్ని రంగంలోకి తీసుకొ స్తాయి. ఉదాహరణకు, కోవిడ్‌-19 యూరప్‌లో ‘నగార్నో-కారబాఖ్‌’ సంఘ ర్షణలను ీవ్రతరం చేసింది. అక్కడ 30 ఏండ్లలో ఏనాడూ జరగనంత మరణహౌమం చోటుచేసుకుంది.
రెండో ప్రపంచ యుద్ధంలో సైన్యం తరలిం పులు, మిలిటరీ క్యాంపులు అంటువ్యాధుల వ్యాప్తికి కావాల్సిన పరిస్థితులు సృష్టించాయి. ఆనాడు, తట్టు (మీజిల్స్‌), క్షయ (టి.బి) లాంటివి సైనికుల్లో మామూలైపోయాయి. విజృంభిస్తున్న జబ్బుల్ని నియంత్రించడం వీలు కాలేదు. యుద్ధం వల్ల ఆరోగ్య వ్యవస్థలు దెబ్బతినడం ఇందుకు కారణం. వియత్నాం యుద్ధంలో (1955-75) కూడా ఇదే జరిగింది. మలేరియా, ఇతర ఉష్ణ మండల జబ్బులు చెలరేగాయి. సైన్యం తరలింపులు, జనాభా స్థానభ్రంశాలు ఇందుకు కారణం.
మొదటి ప్రపంచ యుద్ధం (1918-19)లో ఇన్‌ఫ్లుయంజా పాండమిక్‌ వచ్చింది. యుద్ధాలలో మహమ్మారులు ప్రబలుతాయనటానికి ఇదో ఉదాహరణ. మొదట అమెరికన్‌ మిలిటరీ క్యాంపులలో ఇది కనిపించింది. కిక్కిరిసిన ప్రయాణాలతో వైరస్‌ వ్యాప్తి చెందింది. ఆనాడు అక్కడ ఉన్న దుర్భర పరిస్థితులు, పౌష్టికాహార లోపం, అపరిశుభ్రత ఇన్‌ఫ్లుయంజా వ్యాప్తిని ఎగదోశాయి. రోగనిరోధక శక్తి తగ్గి సెకండరీ ఇన్ఫెక్షన్లూ తయారయ్యాయి. ఈ యుద్ధంలో మొత్తం మీద ఐదు కోట్ల మంది ప్రపంచ వ్యాప్తంగా చనిపోయి ఉంటారని ఒక అంచనా. చరిత్రలో సైనిక దళాలు ఎక్కడ ఉంటే, వాటి వెంటే జబ్బులు వచ్చాయి. యుద్ధాలలో చనిపోయే వారి కంటే జబ్బులతో చనిపోయే వారే ఎక్కువ. ఇది రుజువైన విషయం. మరో ఉదాహరణ ఏమంటే, అమెరికన్‌ సివిల్‌ వార్‌ (1861-1865)లో మీజిల్స్‌, డీసెంట్రీ, స్మాల్‌పాక్స్‌ వల్ల యుద్ధాలలో కంటే ఎక్కువ మంది చనిపోయారు. కారణం దుర్భరమైన పారిశుధ్య పరిస్థితులే. క్రిమియన్‌ యుద్ధం (1853-1856)లో, యుద్ధ గాయాల కంటే ఎక్కువగా కలరా, టైఫస్‌ల వల్ల చనిపోయారు. నిజానికి ఈ అంటువ్యాధులను నిరోధించవచ్చు. కానీ యుద్ధాల వల్ల దెబ్బతినే పారిశుద్ధ్య పరిస్థితులు దానికి అడ్డం కిగా ఉంటాయి.క్రిమియన్‌ యుద్ధం తర్వాత ఫ్లోరన్స్‌ నైటింగేల్‌ గణాంకాలతో ఇటువంటి మరణాలను నిర్ధారించడం, చాలామందిని ఆలోచిం చేలా చేసింది. ఆమె రూపొందించిన ‘యుద్ధ పరిస్థితుల సవివరణాత్మక కథనాల’ పద్ధతి ఆ తరువాత ప్రజారోగ్య అడ్వొకసీలో ఒక భాగంగా మారింది.
అయితే యుద్ధానికి శాంతియుత పరిష్కారాల చర్చల్లో ప్రజారోగ్య వ్యవస్థల పునరుద్ధరణ కూడా ఒక భాగం కావాలి. ్రపంచంలో ఆరోగ్య పరిస్థితులు మెరుగు పడాలన్నా, ఒక సామాజిక సమన్యాయం సాధిం చాలన్నా, యుద్ధాలకు మహమ్మారులకూ రెండింటికి పరిష్కారం సాధించాలి. వ్యాక్సినేషన్లు కూడా శాంతి సాధన ప్రయత్నాలలో భాగమవుతాయి. యుద్ధాల వల్ల మానవ ఆరోగ్యం చిన్నాభిన్న మవుతుందనేది స్పష్టం. యుద్ధ ప్రాంతాలలో బాధితులకు భద్రతను, ఆరోగ్యాన్ని మానవ సహాయాన్ని అందించే బాధ్యత అంతర్జాతీయ సమాజానికి ఉంటుంది.
-ఎస్‌.కృష్ణస్వామి