మన దేశంలో శారీరక ఆరోగ్యంపై చూపించేంత శ్రద్ధ మానసిక ఆరోగ్యంపై చూపించరు. సాధారణంగా మానసిక సమస్యల్ని తేలిగ్గా తీసుకుంటాం. కానీ.. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు సూచిస్తున్నారు.
బలాలను గుర్తించండి: మానసికంగా బలంగా ఉండేందుకు మీ బలాలను గుర్తించండి. మీరు సాధించాల్సిన గొప్ప విషయాల్ని తలచుకోండి. నిరాశ చెందొద్దు. ప్రపంచంలో గొప్ప విజయాలన్నీ ఒక్కసారే రాలేదనీ, కొన్ని ప్రయత్నాల తర్వాతే వచ్చాయనే విషయాన్ని గుర్తించండి.
విజయాలను రాసుకోండి: డైరీ రాసే అలవాటు ఉంటే మంచిదే. మీరు సాధించే విజయాలను అందులో రాయవచ్చు. మీ పట్ల పాజిటివ్‌గా జరిగే అంశాలనూ రాసుకోవచ్చు. అలాగే మంచి సందర్భాలను ఫొటోలు తీసుకొని.. వాటిని తరచూ చూడటం ద్వారా మానసిక ఆరోగ్యం పెరుగుతుంది.
అంతా మంచికే: ఇది ఇలాగే జరగాలి అనుకుంటే అన్నిసార్లూ జరగకపోవచ్చు. నెక్ట్స్ ఏం జరుగుతుందో మన చేతుల్లో ఉండదు. కాబట్టి.. జరిగేది జరగనివ్వాలి. దాన్ని మీరు ఆమోదించడం అలవాటు చేసుకోవాలి. మీ ప్రయత్నాలను సాగిస్తూనే రాజీ పడేందుకు కూడా సిద్ధపడితే నిరాశ అనేదే ఉండదని నిపుణులు చెబుతున్నారు.
టూర్లకు వెళ్లండి : ఎప్పుడూ అదే పని, రొటీన్ లైఫ్‌స్టైల్ ఉంటే జీవితం బోర్ కొట్టేస్తుంది. కాబట్టి, అప్పుడప్పుడూ పర్యాటక ప్రదేశాలకూ, ఇష్టమైన కొత్త ప్రదేశాలకూ వెళ్లాలి. తద్వారా మీలో కొత్త ఉత్సాహం వస్తుంది.