మన దేశ స్వాతంత్య్రానికి డెబ్బయి ఏడేండ్లు నిండాయి. అసమానతలు లేని భారత్ కోసం కలలుగన్న అంబేద్కర్ ఆశయాన్ని అవగతం చేసుకోవాల్సిన తరుణమిది. అయితే మనకు స్వాతంత్య్రం సిద్ధించినప్పటినుంచి నేటివరకు దేశాన్ని ఏలుతున్న రెండు పార్టీలు ఏమీ సాధించాయి? ఎవరి తరుపున నిలబడ్డాయి? అవి అనుసరించిన విధానాలు పేదల బతుకులు మార్చాయా? నేడు అమలు చేస్తు న్న విధానాలు ఎవరి ప్రయోజనాల కోసం? ఈ అంశాలన్ని కూడా ప్రతి ఒక్క భారతీయుడు ఆలోచించాల్సిన సమయమిది.
బీజేపీ మూడో దఫా అధికారంలోకి వచ్చింది. ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. తొంభై ఎనిమిది నిమిషాల పాటు మురిపించే మాటలతో ప్రజల్ని మైమరిపించారు.ఆయన ప్రసంగంలోని సారమంతా కూడా మతపరమైన ఎజెండా చుట్టూనే తిరిగింది. ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలు లాంటి వివాదాస్పద అంశాలను లేవనెత్తారు. దేశం అభివృద్ధిపథంలో పయనిస్తోందని, త్వరలో ప్రపంచ మూడో పెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదుగుతుందని చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఉపన్యాసంలో చెప్పిన విషయాలు దేశ వాస్తవిక పరిస్థితుల్ని ప్రతిబించించలేదు. ఇంకా బంగ్లాదేశ్ సంక్షోభంలో మైనార్టీల అభద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. అయితే స్వదేశంలో ఆరెస్సెస్-సంఫ్‌ు పరివార్ ముస్లింలపై చేస్తున్న దాడుల్ని మాత్రం పట్టించుకోలేదు. దేశం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఆకలి, పేదరికం, దారిద్య్రం, నిరక్షరాస్యత, నిరుద్యోగ్యాన్ని పక్కదారి పట్టించారు. అందరికీ విద్యా, వైద్యం, ఉపాధి ఊసే ఎత్తలేదు. నూట నలభై కోట్ల అశేష జనాభా కలిగిన దేశాన్ని నడిపించే నాయకుడు ఎంతో దార్శనికతతో వ్యవహరించాలి. రాజ్యాంగబద్ధంగా పాలన సాగించాలి. కానీ మోడీ గత పదేండ్లుగా చేస్తున్నదేమిటి? చేయాలనుకున్నదేమిటో కూడా దేశ ప్రజలు తెలుసుకుంటున్న సందర్భమిది.
కుల, మత, భాషా, ప్రాంత లింగ భేదం లేకుండా, మనుషులంతా సమానమేనని చాటిచెప్పిన గొప్ప రాజ్యాంగం మనది. భారత ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛ, సమాన హోదా, సమాన అవకాశాలు కల్పించే సౌలభ్యాన్ని ప్రకటించింది. రాజ్యాంగం పౌరులందరికి సమాన హక్కులు కల్పించింది. చట్టం ముందు అందరూ సమానులేనని పేర్కొంది. ఇది అమల్లోకి వచ్చి డెబ్బయి నాలుగేండ్లవుతోంది. అలాంటి రాజ్యాంగం ఇప్పుడు మోడీ పాలనకు అడ్డుగా ఉంది. ఈ రాజ్యాం గాన్ని ఇప్పుడు ఉంచాలా? తుంచెయ్యాలా? అని మనువాద బీజేపీ ఆలోచిస్తున్నది. ఆలోచనే కాదు, ఒక అడుగు ముందుకేసి ‘అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం పనికిరాదు. ప్రాచీన భారత రాజ్యాంగం మనుస్మతి’ అని ప్రకటించింది. ఇప్పుడు మనుస్మతిని దేశ పవిత్ర రాజ్యాంగంగా మార్చాలనే కుటిలయత్నాల్లో తలమున కలై ఉన్నది. ఇది దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాల్.
రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు!
భారత రాజ్యాంగ పీఠిక ఐదు మౌలిక పునాది అంశాలతో కూడి ఉన్నది.సర్వసత్తాక, సామ్యవాద లౌకిక, ప్రజాస్వామ్యం గణతంత్ర దేశంగా విరాజిల్లాలని ఆకాంక్షించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానులేనని ప్రకటించింది. ఆర్టికల్ 15 కుల, మత, లింగ, భాష, జాతి, జన్మస్థలం ప్రాతిపాదికన ఏ వ్యక్తి పట్ల వివక్ష పాటించకూడదని పేర్కొన్నది. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన ఉద్యోగ అవకాశాలు ఉండాలని పేర్కొన్నది. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిం చింది.ఆర్టికల్ 19 భావ ప్రకటన స్వేచ్ఛను కలిగి ఉండాలని పేర్కొన్నది. ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలు జరుపు కునే స్వేచ్ఛ, యూనియన్లు, ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, భారతదేశమంతటా స్వేచ్ఛగా సంచరించే హక్కు, భారత భూభాగంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించే హక్కు, ఏ విధమైన వత్తి వ్యాపారాలను చేసుకునే హక్కును ఆర్టికల్19 కల్పించింది. కానీ భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా హరించి వేసింది మోడీ ప్రభుత్వం. ప్రశ్నించే స్వభావాన్ని రాజ్యాంగ స్ఫూర్తి ఆహ్వానిస్తుంటే, బీజేపీ పాలనలో ప్రశ్నించడం నేరం, దేశ ద్రోహమైంది. ‘ఉపా’ చట్టానికి సవరణలు చేసి సామాజిక హక్కుల కార్యకర్తల్ని నిర్భందించింది. రాజ్యం నిరంకుశధోరణి కారణంగా సంపూర్ణ వికలాంగుడైన ప్రొఫెసర్ సాయిబాబా పదేండ్లు అకారణంగా జైలు జీవితం గడపాల్సి వచ్చింది. గిరిజన హక్కుల నేత స్టన్‌స్వామి జైల్లోనే మరణించాల్సిన దుస్థితి కల్పించింది.
లౌకికస్ఫూర్తిని దెబ్బతీస్తున్న పాలన!
ఆర్టికల్ 25-28 మత స్వేచ్ఛ సంబంధ విషయాలు తెలియజేస్తుంది.ఆర్టికల్ 25 మతం వ్యక్తిగత విశ్వాసంగా కలిగి ఉండే హక్కును కల్పిస్తుంది. ఆర్టికల్ 26 మత సంస్థల విషయంలో స్వేచ్ఛ ఉండాలని, ఆర్టికల్ 27 మతవ్యాప్తికై పన్ను విధించరాదని, ఆర్టికల్ 28 విద్యాలయాల్లో మత బోధన పనికిరాదని పేర్కొంటున్నది. కానీ మోడీ పాలన ఈ ఆర్టికల్స్ అన్నింటికి భిన్నంగా పని చేస్తోంది. మత విభజనను యథేచ్ఛగా ప్రోత్సహిస్తోంది. లౌకికతత్వం అంటే మతానికి, రాజ్యానికి సంబంధం ఉండకూడదు. మతం వ్యక్తిగతమే కానీ రాజకీయం, పరిపాలనలోకి రాకూడదని రాజ్యాంగం చెబుతోంది. కానీ దేశ లౌకికస్ఫూర్తిని దెబ్బ తీసేవిధంగా బీజేపీ వ్యవహరిస్తోంది. మతసామరస్యానికి నిల యంగా, మతాలకతీతంగా ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి బ్రిటిష్ పాలకులను తరిమికొట్టారు. కానీ నేడు ముస్లింలు పాకిస్థాన్ వెళ్లిపోవాలి లేదా దేశంలో రెండవ శ్రేణి పౌరులుగా ఉండాలంటూ భయబ్రాంతులు సష్టిస్తున్నారు. ఇది రాజ్యాంగ లక్ష్యాలకు విరుద్ధం. చరిత్ర వక్రీకరణ, మూఢత్వ ఛాందస భావాలను పెంచడానికి కుట్రలు చేస్తోంది. విద్యార్థుల పాఠ్యపుస్తకాలను కాషాయికరిస్తోంది. అంబేద్కర్, భగత్‌సింగ్ వంటి మహనీయుల సిలబస్‌ను తొలగించింది. మైనార్టీలు తినే ఆహారంపై కన్నేసింది. గోరక్షక దళాల పేరుతో హత్యలకు పాల్పడుతోంది.ఇదేనా మోడీ చెప్పే ‘వికసిత భారత్’. ఇదేనా దేశం వెలుగుతున్న తీరు.
ఎవరి ప్రయోజనాల కోసం?
ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఎన్నుకున్నదే ప్రజాస్వామ్యం. కానీ ప్రజల కోసం కాకుండా కార్పొరేట్లకు కాపలాగా మారిన మోడీ సర్కార్ ఏకంగా ఓటును ఒక సరుకుగా మార్చింది. మత విద్వేషాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య చిచ్చు పెట్టి, తద్వారా ఓట్లు దండుకోవాలనేది నేడు బీజేపీ విధానంగా మారింది. కోట్లు పెట్టి ఓట్లు కొంటున్న పరిస్థితి ఈ పదేండ్లలో విపరీతమైంది. దేశంలో 169 శత కోటీశ్వర్ల చేతుల్లో దేశ సంపద 40శాతం పోగుపడింది. ప్రపంచ ఆకలి సూచికలో మన దేశం 2022లో 107 స్థానంలో ఉండగా 2023లో 111వ స్థానానికి చేరింది. మరోవైపు ఆదానీ ప్రపంచంలో అతిపెద్ద రెండవ కుబేరుడయ్యాడు. మరో వైపు 42కోట్ల మంది ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే ఆర్థిక అంతరాల్ని తగ్గించడంలో పాలకులు పూర్తిగా విఫలమయ్యారు. శాస్త్ర, సాంకేతిక రంగం ‘ఆకాశమంత’ ఎత్తుకు ఎదిగినా క్షేత్రస్థాయిలో నేటికీ కులవివక్ష, అంటరానితనం నిరాం టంకంగా కొనసాగుతూనేవుంది. సామాజిక న్యాయం సమాధి చేయబడుతోంది. నవరత్నల్లాంటి కీలక ప్రభుత్వ సంస్థలను కార్పోరేట్ శక్తులకి కారుచౌకగా కట్టబెడుతున్నది. దీనివల్ల నూటికి 80 శాతం ప్రభుత్వ రంగం ప్రయివేటుపరం అయింది.ఈ రంగంలో రిజర్వేషన్లు లేకపోవడం వల్ల సామాజికంగా వెనుకబడిన అట్టడుగు వర్గాలు అభివద్ధికి నోచుకోని పరిస్థితి నెలకొంది.
దౌర్జన్యాలు, హత్యలు, లైంగికదాడులు!
బీజేపీ ఈ పదేండ్ల పాలనలో దళితులపై 300 రేట్లు దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, లైంగికదాడులు పెరిగాయి. ప్రత్యేకించి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై హింస పెట్రేగిపోతోంది. నేషనల్ క్రైం రిపోర్ట్ ప్రకారం హత్యల్లో, 15898 కిడ్నాప్ కేసుల్లో ఉత్తరప్రదేశ్‌లోని యోగి ప్రభుత్వం ముందువరుసలో ఉంది. దళితులపై దాడుల్లో మొత్తం 40801 జరిగితే అందులో ఒక్క యూపీలోనే10426 జరిగాయి.రేప్ కేసుల్లో మధ్యప్రదేశ్ ప్రధాన స్థానంలో నిలిచింది. వీటిని పరిశీలిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, మహిళలు, మైనార్టీలు అభద్రతలో ఉన్నారు. సామాజిక న్యాయమంటే కొంతమందికి మంత్రి పదవులివ్వడం, ఆదివాసి మహిళను రాష్ట్రపతిని చేశామని చెప్పుకోవడం కాదు! సామాజిక వర్గాలు స్వతంత్రంగా జీవించేలా హక్కుల్ని కాపాడటం, వారిని అభివృద్ధిలోకి తీసుకురావడం, కొనుగోలు శక్తి పెంచే చర్యలకు ఉపక్రమించడం. పోరాడి సాధించుకున్న ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని అటకెక్కించారు. దళిత జనాభా ఇరవై శాతం ఉంటే యూనియన్ బడ్జెట్‌లో పదకొండు శాతం కేటాయించి కాగితాలకే పరిమితం చేశారు. గతపదేండ్లలో ఇందులో కేవలం 3.2 శాతం మాత్రమే ఖర్చు చేశారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ లేనేలేదు. దళితులకు విద్య అందని ద్రాక్షగానే మిగిలింది. నూతన విద్యావిధానం ముసుగులో ఉన్నత చదువుల్లో రిజర్వేషన్ల రద్దుకు కుట్ర జరుగుతున్నది. ప్రకతి వనరుల్లో, బడ్జెట్‌లో, దేశ సంపదలో జనాభా ప్రాతిపాదికన సమాన అవకాశాలు దక్కాలి. అదే సామాజిక న్యాయం. అది మన దరి చేరాలంటే మనువాద బీజేపీని అధికారానికి దూరం చేయాలి. దానికిముందు రాజ్యాంగ రక్షణకు కంకణబద్ధులవ్వాలి.
టి. స్కైలాబ్ బాబు
9177549646