రాష్ట్రంలో రుణమాఫీ రాజకీయం నడుస్తున్నది. అధికార, ప్రతిపక్షాలు పరస్పర విమర్శలకు దిగి బెట్టుకు పోతున్నాయి. రుణమాఫీతో ప్రజల ఆధరాభిమానాలను చూరగొనాలని అధికార కాంగ్రెస్ భావిస్తుండగా, అందులోని లోటుపాట్లను ఎత్తిచూపే పేర బీఆర్‌ఎస్ నానాయాగి చేస్తుండటం గమనార్హం. రైతులను పంట రుణాల నుంచి విముక్తులను చేయడమే తమ లక్ష్యమని రేవంత్ సర్కారు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమేరకు రైతుల సంక్షేమం కోసం రుణమాఫీ చేయడానికి సర్కారు ఓ మంచి ప్రయత్నమే చేసింది. దాదాపు 22 లక్షల మందికి రైతులకు రూ. 17,933 కోట్ల సొమ్ము వారి ఖాతాల్లో పడింది. వ్యవస్థలో లోపాల మూలంగా కొంతమంది రైతులకు రుణమాఫీ సొమ్ము చేరలేదు. కాగా రాష్ట్ర క్యాబినెట్ రూ.31 వేల కోట్లమేర రుణమాఫీ చేయడానికి గ్రీన్‌సిగల్ ఇచ్చింది. ప్రభుత్వం చెప్పిన దానికి చేస్తున్న దానికి పొంతన కుదరడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
సీఎం ఒకలా, మంత్రులు మరోలా మాట్లాడటంతో గందరగోళానికి అవకాశం కలిగింది.గత బీఆర్‌ఎస్ సర్కారు సైతం రుణమాఫీని అమలుచేసింది. అప్పుడు కూడా సాంకేతిక లోపాలతో కొంతమందికి ఖాతాల్లో సొమ్ము పడలేదు. అవే ఇప్పటికీ కొనసాగడం ఆశ్చర్యం, విడ్డూరం. బ్యాంకులు ఆన్‌లైన్ ద్వారా రైతుల ఖాతాల్లో నేరుగా మాఫీ మొత్తాలను జమచేస్తాయి. సొమ్ముపడటం లేదని కొందరు రోడ్డెక్కడాన్ని సర్కారు తీవ్రంగానే పరిగణించాలి. పరిష్కారాలను కనుగొనాలి. రుణమాఫీని సజావుగా పూర్తిచేయాలి. ఇందులో రాజకీయకోణాన్ని సర్కారు పట్టించు కోవాల్సిన అవసరం లేదు. ఎస్‌ఎల్‌బీసీ ప్రకారం 47 లక్షల మందికి రూ.49 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా, 22 లక్షల మందికే పరిమితం చేయడం న్యాయం అనిపించు కోదు. రుణమాఫీ అమలుకు వ్యవసాయ శాఖ గుర్తించిన 31 సాంకేతిక సమస్యలు ఆటంకమవుతున్నాయి. వాటిని వేగంగా పరిష్కరిస్తే విమర్శల నుంచి సర్కారు బయట పడేందుకు మార్గముంది. పథకం అమలు గురించి సలహాలు, సూచనలు చేయడం, స్వీకరించడం తప్పుకాదు. అలాగే పరస్ఫర భౌతికదాడులకు దిగడం మాత్రం సమర్థనీయం కాదు.
సిద్దిపేటలో చోటుచేసుకున్న రాజకీయ విన్యాసాలు శాంతిభద్రతలకు చేటుచేసేవే. తప్పుడు సంకేతాలు పంపేవే. సర్కారు చిత్తశుద్దిని శంకించాల్సిన పని లేదుకానీ, అదే సందర్భంలో ఆచరణే ప్రామాణికంగా గుర్తిం చాలి. ఇదిలావుండగా రూ.2 లక్షలకు పైబడిన అదనపు మొత్తాలను చెల్లిస్తేనే కొత్త పంట రుణాలిస్తామని బ్యాంకర్లు కొర్రీలు పెట్టడాన్ని చూస్తూ సర్కారు ఊరుకో కూడదు. దీనిపై ఎస్‌ఎల్‌బీసీపై ఒత్తిడి తేవాలి. అదనపు సొమ్ముతోపాటు ఎనిమిది నెలల వడ్డీని సైతం బ్యాంకులు ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నమాట అక్షరసత్యం. బీఆర్‌ఎస్ పాలనలో చేసిన మాఫీ కాస్త వడ్డీలకే పోయిందని అప్పట్లోనే విమర్శలు వచ్చిన సంగతి మనం గుర్తుంచుకోవాలి.
2014-15లో 35 లక్షల మందికి రూ.16,140 కోట్లు మాఫీ చేస్తే అందులో రూ.9800 కోట్లు కేవలం వడ్డీ కిందే పోయాయి. 2018-23 వరకు రూ. 19 వేల కోట్లకుగాను రూ.12 వేల కోట్లు వడ్డీకే చెల్లింది. రెండు సందర్భాల్లో రైతులకు ఆశించిన ప్రయోజనం నెరవేరకపోగా, సర్కారిచ్చిన మొత్తంలో రూ.20 వేల కోట్లు వడ్డీ కిందకే బ్యాంకులు జమేసుకున్నాయి. మరో ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఎస్‌ఎల్‌బీసీ ప్రకారం 72 లక్షల మంది రైతు లుంటే 42 లక్షల మందికే రుణాలిస్తున్నారు. 30లక్షల మందిని అసలు పట్టించు కోవడమేలేదు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. అందరికీ రుణాలు అందేలా గట్టి చర్యలు చేపట్టాలి. బ్యాంకర్లు ప్రభుత్వానికి సరిగ్గా జాబి తాలు పంపకపోవడం, అవకత వకలు, అవినీతి, నిబంధనల మేర రైతన్నలను ముప్పుతిప్పలు పెట్టే పరిస్థితిని క్షేత్ర స్థాయిలో సర్కారు సరిచేయాలి.
పంటల రుణమాఫీ ప్రక్రియ పూర్తికాకముందే ప్రతిపక్షం తొందరపడుతున్నాదని కాంగ్రెస్, శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తుండం గమనార్హం. బ్యాంకు ఖాతాలు సరిగ్గా లేనివి, కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు, ఆధార్ నెంబర్లల్లో తప్పులున్నవి, పాసుబుక్కు నంబర్లు లేనివి, బ్యాంకు ఖాతా, ఆధార్ పేరుతో సరిపోలనవి పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు అంటున్నారు. ఈ లోపాలను వ్యవసాయ శాఖ వేగంగా పరిష్కార కేంద్రాల ద్వారా సరిచేస్తేనే రుణమాఫీకి సార్థకత. పరస్పర విమర్శలతో సమస్యను పక్కదారి పట్టిస్తే క్షమార్హం కాదు. మాఫీ చేయడంతో పాటు కొత్త రుణాలను రైతులకు త్వరగా ఇప్పించాల్సిన బాధ్యతా పాలకులదే.