– ద్రావిడ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
– సియేట్ క్రికెట్ అవార్డుల ప్రదానోత్సవం
ముంబయి: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, మహ్మద్ షమీలకు అవార్డులు వరించాయి. 26వ సియేట్ క్రికెట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ముంబయిలో బుధవారం అట్టహాసంగా జరిగింది. 2023 ఏడాదికి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించగా.. కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్’ అవార్డు, విరాట్ కోహ్లికి ఉత్తమ వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్, పేసర్ మహ్మద్ షమీకి 2023 ఏడాదికి ఉత్తమ వన్డే బౌలర్‌గా అవార్డులు దక్కాయి. 2023లో రోహిత్ శర్మ 1,800 అంతర్జాతీయ పరుగులు కొట్టాడు. అందులో వన్డేల్లో 52.59 సగటుతో 1,255పరుగులు చేయగా.. ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో 597 పరుగులు కొట్టిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రోహిత్ శర్మ మాట్లాడుతూ.. భారతజట్టు టి20 ప్రపంచకప్ గెలుచుకోవడంలో ఆ ముగ్గురి పాత్ర కీలకమని పేర్కొన్నాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్, సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్‌తోపాటు బోర్డు కార్యదర్శి జై షా ముగ్గురు మూడు పిల్లర్ల వల్లే సాధ్యమైందని పేర్కొన్నాడు. ఈ ముగ్గురి వల్లనే ఐసిసి ట్రోఫీ కల సాకారమైందన్నాడు. టోర్నమెంట్ మొత్తం ఫలితాల గురించి పెద్దగా ఆలోచించలేదని, ఎవరి పాత్ర వారు సమర్ధవంతంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించుకున్నామన్నారు. ఇందుకు జై షా, ద్రవిడ్, అగార్కర్ నుంచి తనకు పూర్తి సహకారం లభించిందన్నాడు. దీనికి తోడు ప్లేయర్లందరూ సమిష్టిగా రాణించడం కలిసివచ్చింది. దీంతో దశాబ్ద కాలంగా అందని ద్రాక్షలా ఉన్న ఐసిసి ట్రోఫీని చేజిక్కించుకోవడం జరిగిందని గుర్తుచేసుకున్నాడు. అలాగే ప్రపంచకప్ గెలిచిన తర్వాత ప్రతీ సందర్భాన్ని ఆస్వాదించాలనుకున్నాం. అందుకు తగ్గట్లు దేశం మొత్తం సంబరాల్లో భాగం కావడం జీవితంలో మరిచిపోలేనిది. అది మాటల్లో వర్ణించలేమన్నాడు. రానున్న రోజుల్లో కీలకమైన సిరీస్‌ల్లో ఆడాల్సి ఉంది’ అని అన్నాడు.
వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్‌గా విరాట్..
‘వన్డే బ్యాటర్ ఆఫ్ ది ఇయర్’ టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లికి లభించింది. 2023లో విరాట్ కోహ్లి అద్భుత ఫామ్‌తో బ్యాట్‌నుంచి పరుగుల వరద పారింది. ఈ క్రమంలో ఆ ఏడాది ఆరు సెంచరీలతో సహా 1,377పరుగులు చేసాడు. 2023 ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ఈ టోర్నమెంట్‌లో భాగంగా 11 మ్యాచుల్లో 95.62సగటుతో 765పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు కొట్టిన సచిన్ టెండూల్కర్(6సెంచరీ) రికార్డును సమం చేశాడు.
ద్రావిడ్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు..
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు ప్రతిష్టాత్మక లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించారు. అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్‌లో భారతజట్టు ట్రోఫీని కైవసం చేసుకోవడంలో ద్రావిడ్ కీలకపాత్ర పోషించాడు. కోచ్‌గా భారత క్రికెట్‌జట్టుకు గణనీయమైన సేవలు చేసినందుకు ద్రావిడ్‌కు ప్రశంసలు దక్కాయి.
ఉత్తమ బౌలర్‌గా షమీ…
టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి 2023 ఏడాదికి అత్యుత్తమ వన్డే బౌలర్‌గా అవార్డు అందుకున్నాడు. 2023 ఐసిసి వన్డే ప్రపంచకప్‌లో మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరడంలో షమీ కీలకపాత్ర పోషించాడు. కేవలం 7మ్యాచుల్లో 24వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు.
అవార్డులు దక్కించుకున్న ఇతర క్రికెటర్లు..
టెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ : యశస్వి జైస్వాల్
టెస్ట్ బౌలర్ ఆఫ్ ది ఇయర్ : రవిచంద్రన్ అశ్విన్
టి20 బ్యాటర్ ఆఫ్ ది ఇయర్ : ఫిల్ సాల్ట్
స్టార్ స్పోర్ట్స్ టి20 లీడర్ షిప్ : శ్రేయస్ అయ్యర్(కోల్‌కతా నైట్‌రైడర్స్)
స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెన్స్ : జై షా
అత్యధిక టి20లకు మహిళా కెప్టెన్ : హర్మన్ ప్రీత్ కౌర్
భారత ఉత్తమ మహిళా బౌలర్ ఆఫ్ ది ఇయర్ : దీప్తి శర్మ
వేగంగా డబుల్ సెంచరీ కొట్టిన మహిళా క్రికెటర్ : షెఫాలీ వర్మ