నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అదానీతో ఢిల్లీలో కుస్తీ, తెలంగాణలో దోస్తీ అన్నట్టు కాంగ్రెస్ తీరు ఉందనీ, ఆ పార్టీ వైఖరిని చూస్తే ద్వంద్వ నీతి కూడా ఆత్మహత్య చేసుకుంటుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. గురువారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అదానీకి వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి బృందం నిరసన తెలపటం అతిపెద్ద జోక్ అని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అదానీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు అదే అదానీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం విడ్డూరంగా ఉందని తెలిపారు. అదానీకి సంస్థలకు ప్రోత్సహాకాలు ఇచ్చి ఇప్పుడు అదే అదానీ మోసగాడని ఆరోపిస్తున్నారంటే కాంగ్రెస్‌ను ఏమనాలని ప్రశ్నించారు.