– ఆసియాలోనే మొదటిది
బ్యాంకాక్ : ఆసియాలోనే మొట్టమొదటగా మంకీపాక్స్ కేసు ఇక్కడ నమోదైనట్టు థాయిలాండ్ ధృవీకరించింది. ఆఫ్రికా నుంచి ఇక్కడకు వచ్చిన రోగిలో ఈ వైరస్ బయటపడింది. ఈ నెల 14న బ్యాంకాక్‌లో ఆ రోగి దిగాడని, వెంటనే మంకీపాక్స్ లక్షణాలు వుండడంతో ఆస్పత్రికి పంపామని సంబంధిత వర్గాలు తెలిపాయి. 66ఏండ్ల ఆ యురోపియన్‌పై నిర్వహించిన పరీక్షల్లో ఎంపాక్స్ క్లేడ్ 1బి సోకినట్టు నిర్ధారించబడిందని వ్యాధి నియంత్రణా విభాగం అధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు కూడా ఈ విషయాన్ని తెలియచేసినట్టు చెప్పారు. ఆ రోగికి దగ్గరగా ఉన్న మరో 43మందిని కూడా పర్యవేక్షణలో పెట్టామని, ఇప్పటివరకు వారికెలాంటి లక్షణాలు లేవని చెప్పారు. అయినా 21 రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచనున్నట్టు తెలిపారు. 42 ముప్పు దేశాల నుంచి థాయిలాండ్‌కు వచ్చినవారెవరైనా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరారు. ఆఫ్రికాలో ముఖ్యంగా కాంగో, బురుండి, కెన్యా, ర్వాండా, ఉగాండాల్లో మంకీపాక్స్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యుహెచ్‌ఓ దీన్ని అత్యవసర ఆరోగ్య పరిస్థితిగా ప్రకటించింది.