ఆస్కార్‌ చరిత్రలో పది నామినేషన్లు పొందిన మొదటి చిత్రం

First film in Oscar history to receive ten nominations”నువ్వు ఖడ్గం చేతబూని దేశ సేవ చేస్తే నేను కలం పట్టుకుని నా దేశభక్తిని చాటుకుంటున్నాను” అంటాడు ఎమిలి జోలా ఈ సినిమాలో తన నిజాయితీని ప్రశ్నించినవారితో. ఒక రచయిత బాధ్యతను ఇంతకన్నా గొప్పగా చెప్పిన వాక్యం మరొకటి ఉండదేమో. ఎమిలి జోలా ఫ్రాన్స్‌కు చెందిన రచయిత, పాత్రికేయుడు. మొదటి, రెండవ నోబుల్‌ బహుమతికి నామినేట్‌ అయిన ప్రఖ్యాత రచయిత జోలా. తన జీవితంలో విస్తతంగా సాహిత్యాన్ని సజించిన జోలాని ఆ దేశప్రజలు డ్రైఫస్‌ అనే ఓ మిలిటరీ అధికారి కోసం ఆయన జరిపిన పోరాటం గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఒక రచయిత చూపవలసిన సామాజిక బాధ్యతను, నిబద్దతను ఉదహరించేటప్పుడు ముందుగా ప్రపంచంలో చరిత్ర తెలిసినవారికి గుర్తుకు వచ్చేది ఎమిలి జోలా పేరే.
అటువంటి గొప్ప మానవతావాది జీవితంలోని ముఖ్య సంఘటనలను వివరించే సినిమా ‘ది లైఫ్‌ ఆప్‌ ఎమిలి జోలా’. జోలా సాహిత్య ప్రపంచంలో ‘నాచురలిజం’ అనే వాదానికి ఆద్యుడు. రచనలలో రొమాంటిజాన్ని వ్యతిరేకిస్తూ వాస్తవికతకు ప్రాధ్యాన్యం ఇచ్చిన రచయిత ఎమిలి జోలా. నాచురలిజంలో రచయిత ధోరణి తన కథనం విషయంలో నిర్లిప్తతను కలిగి ఉంటుంది. పాత్రల పట్ల ప్రత్యేక ఆసక్తి కనపరచకుండా, అవి పరిస్థితులను బట్టి ఎలాంటి స్థితిగతులను ఎదుర్కోవాలో అచ్చు అదే విధంగా కథనం సాగేలా చూస్తాడు రచయిత. మానవ జీవితం పట్ల ఉదాసీనంగా ఉండే ప్రపంచం జోలా రచనలలో కనిపిస్తుంది. ఈ శైలిని ఆ తరువాత నాటకరంగంలో కూడా ఆపాదించడం జరిగింది. అలా సాహిత్యరంగాన్ని, నాటకరంగాన్ని కూడా ప్రభావితం చేసిన రచయిత ఎమిలి జోలా.
జోలా ఓ జీర్ణావస్తలో ఉన్న అతి చిన్న ఇంట్లో స్నేహితుడు పాల్‌ సెజేన్‌తో కలిసి ఉండగా సినిమా ప్రారంభం అవుతుంది. అది 1862వ సంవత్సరం. అప్పట్లో అడపా దడపా రాస్తూ ఉన్నా అతని రచనలు ఇంకా ప్రజలలోకి చేరలేదు. స్నేహితుడు పాల్‌ సెజెన్‌ కూడా గొప్ప చిత్రకారుడు. అతనికీ అదే పరిస్థితి. కడు పేదరికంలో ఇద్దరు మిత్రులు తమ కళను తమ తమ మాధ్యమాల ద్వారా లోకానికి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. జోలా ప్రేమించిన యువతి పేరు అలెక్జాండ్రిన్‌. ఆమె జోలాకు ఓ చోట క్లర్క్‌గా ఉద్యోగం ఇప్పిస్తుంది. ఉద్యోగం దొరికిన తరువాత ఇద్దరూ వివాహం చేసుకుంటారు. కాని జోలా ముక్కు సూటీ రచనలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అతని పద్ధతి మార్చుకొమ్మని లేదంటే శిక్ష తప్పదని అతనిపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తుంది. ఆ సందర్భంలో జోలా ఆ క్లర్క్‌ ఉద్యోగాన్నీ పోగొట్టుకుటాడు. అయినా జోలా తన పంథా మార్చుకోడు. అప్పటి ఫ్రెంచ్‌ దేశంలో పేదలపై జరుగుతున్న అరాచకాలు, దోపిడి అతన్ని కలవరపెడతాయి. అవే అతని కథావస్తువులు అవుతాయి. ఒకసారి జోలా హోటల్‌లో ఉండగా పోలీసుల నుండి తప్పించుకున్న ఓ వేశ్య ఆ హోటల్‌కు వస్తుంది. ఆమెను జోలా, పాల్‌ రక్షిస్తారు. ఆమెతో మాట్లాడుతూ జోలా ఆమె గతం తెలుసుకుంటాడు. దాన్ని కథావస్తువుగా తీసుకుని ‘నానా’ అనే నవల రాస్తాడు జోలా. ఇది వందలాది కాపీలు అమ్ముడుపోయి జోలా ఆర్ధిక స్థితిని మార్చివేస్తుంది.
ప్రష్యాతో జరిపిన యుద్ధంలో ఫ్రాన్స్‌ అవలంభించిన వైఖరిని నిరశిస్తూ జరిగిన లోపాలను బాహాటంగా చర్చిస్తూ జోలా రాసిన మరో నవల ‘ది డౌన్ఫాల్‌’ తరువాత అతను ఎంతో పేరు సంపాదించుకుంటాడు. అతని ముక్కుసూటి తనం దేశ నేతలను ఇబ్బంది పెట్టినా ప్రజలు అతనికి బ్రహ్మరథం పడతారు. ఇక ఆ తరువాత ఎన్నో నవలలు రాసి గొప్ప ధనవంతులలో ఒకడిగా ఫ్రాన్స్‌లో స్థిరపడతాడు జోలా. జీవితంలో నేను చాలానే యుద్ధాలు చేశాను, ఇక ప్రశాంతంగా జీవిస్తాను అన్న నిశ్చయానికి జోలా వచ్చిన తరువాత అత్యంత వైభవంగా కట్టించుకున్న తన ఇంట్లో అన్ని భోగాల మధ్య విలాసంగా జీవించడానికి అలవాటు పడతాడు. ఈ సందర్భంలో అతని స్నేహితుడు పాల్‌ సెజాన్‌ అతన్ని కలిసి జోలా తన ఆదర్శాలకు దూరం అవుతున్నాడని, డబ్బుకి విలాసాలకు అలవాటు పడి, అతనిలోని ఆత్మను చంపుకుని జీవిస్తున్నాడని, అలాంటి వ్యక్తితో తాను స్నేహాన్ని కొనసాగించలేనని చెపుతూ అతని జీవితంలో నుండి నిష్క్రమిస్తాడు. జోలా స్నేహితుడిని ఇలా పోగొట్టుకున్నందుకు బాధ పడతాడు కాని అన్నేళ్ళు ఆదర్శాల బాటలో నడిచిన తరువాత ఇప్పుడు కాస్త సుఖపడాలనుకుంటే తప్పేంటని వాదిస్తాడు.
ఫ్రెంచ్‌ మిలిటరీలో ఓ దేశ ద్రోహి ఉన్నట్లు కనుగొంటారు అధికారులు. జర్మనీకి దేశ రహస్యాలు అందిస్తున్న ఆ ద్రోహి ఎవరని కనుక్కునే ప్రయత్నంలో ఓ అనుమానితుల జాబితాను తయారు చేస్తారు. అందులో కెప్టెన్‌ ఆల్ఫ్రెడ్‌ డ్రేపస్‌ను ద్రోహిగా గుర్తిస్తారు. కారణం అతను ఒక యూదుడు. పైగా జర్మనీకి తరుచూ వెళ్లివస్తూ ఉంటాడు. కాని ఇతను ఫ్రాన్స్‌ సైన్యంలో ఇరవై సంవత్సరాలు నిజాయితీగా పి చేసాడన్న విషయాన్ని మర్చిపోతారు. తన ఇంట్లో సెలవులో ఉన్న డ్రేపస్‌ని హుటాహుటీగా కార్యాలయానికి పిలిపించి అక్కడ అతన్ని అరెస్టు చేస్తారు. పైగా మిలిటరీ విచారణ తప్పించుకోవాలంటే ఆత్మహత్య చేసుకునే అవకాశాన్నీ కల్పిస్తారు. డ్రేపస్‌ తాను నిర్దోషినని, ఏ నేరం చేయలేనని, ఎన్ని కష్టాలు ఎదురయినా తన దేశభక్తిని చాటుకుంటానని చెప్పడంతో అతన్ని అరెస్టు చేస్తారు అధికారులు. కోర్ట్‌ మార్షల్‌ అయితే అతన్ని దోషిగా నిర్ణయించి మిలటరీ నుంచి బహిష్కరిస్తూ, బహిరంగంగా అవమానించి డెవిల్స్‌ ఐలాండ్‌ అనే ద్వీపానికి శిక్ష నిమిత్తం తరలిస్తారు.
ఆ తరువాత కొత్త ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా వచ్చిన పికార్ట్‌ అనే అధికారి నేరస్తుడు డ్రేపస్‌ కాదని, ఎస్తర్హాజీ అనే మరో అధికారి ఆ పని చేశాడని సాక్షాలతో సహా కనుక్కుంటాడు. కాని ఈ నిజం బైటకు వస్తే తమ సైన్యంలోని అధికారం పట్ల ప్రజలలో నమ్మకం పోతుందని అతన్ని ఈ నిజాలు బైటికి తేవద్దని పై అధికారులు ఆదేశిస్తారు. అతనెక్కడ నోరు విప్పుతాడో అని ఓ మారుమూల చోటికి ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు అధికారులు.
డ్రేపస్‌ నాలుగేళ్ళుగా అజ్ఞాతవాసంలో శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. అతని భార్య లూసి భర్త నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఆమెకు పికార్డ్‌ సంపాదించిన సాక్షాలు లభిస్తాయి. అవి తీసుకుని ఆమె రచయిత ఎమిలి జోలా ఇంటికి వస్తుంది. జోలా అప్పటికి తన సుఖవంతమైన జీవితానికి అలవాటుపడతాడు. ఎటువంటి ఇబ్బందులలోకి అతను వెళ్లకుండా జీవితాన్ని గడిపేద్దామనే నిశ్చయంలో ఉంటాడు. అతనికి లూసి తాను సంపాదించిన సాక్షాధారాలు చూపిస్తుంది. అప్పటికి ఓ పెద్ద ప్రభుత్వ అవార్డుకి జోలా పేరు సూచించబడించన్న విషయం అతనికి తెలుస్తుంది. ఆ అవార్డుతో అతనింకా దేశంలో ఉన్నతమైన స్థితికి చేరే అవకాశం ఉంది. ఆ సమయంలో లూసి తన ఇంటికి వచ్చి న్యాయం చేయమని కోరడం అతనికి నచ్చదు. పైగా తానో రచయిత మాత్రమే. ఇంత పెద్ద ప్రభుత్వ విషయంలో దేశద్రోహిగా ముద్ర పడిన సైనికాధికారి విషయంలో తానేమీ చేయలేనని చెప్తాడు జోలా. కాని లూసి అతని బల్ల పై వదిలి వెళ్లిన కాగితాలు అతన్ని ఆకర్షిస్తాయి. అవి చదివిన తరువాత అతనిలోని మనిషి మేల్కొంటాడు. ఆ అన్యాయాన్ని ఎదిరించడం, ఆ నిర్దోషికి న్యాయం చేయడం తన కర్తవ్యం అనిపిస్తుంది జోలా కి. వెంటనే ఓ నిశ్చయానికి వస్తాడు. ‘ఐ అక్యూస్‌’ (నేను నిందిస్తున్నాను) అంటూ ప్రభుత్వానికి ఓ బహిరంగ లేఖ రాస్తాడు జోలా. అందులో తనకు లభించిన సాక్షాలన్నిటిని ప్రస్తావిస్తూ, డ్రేపస్‌ ఇంటిని సోదా చెసినప్పుడూ అధికారులకు అతని దేశ ద్రోహానికి సంభంధించి ఏ సాక్షాలు లభించలేదని, కేవలం బంధువులను కలవడానికి, తన బాధ్యతలను నిర్వర్తించడానికి కొన్ని సార్లు జర్మనీ వెళ్ళాడన్న నెపంతో డ్రేపస్‌ని దేశద్రోహిగా అనుమానించడం ఎంత వరకు న్యాయం అన్న ఈ లేఖ ప్రభంజనం సష్టిస్తుంది. మిలిటరీ ప్రేరేపించిన జనం అతన్ని రోడ్డుపై గాయపర్చడానికి వెంబడిస్తే, తప్పించుకుని జోలా అక్కడి నుండి పారిపోవలసి వస్తుంది. ఒక్కరోజుతో అతని జీవితం మారిపోతుంది. అప్పటి దాకా అతన్ని గౌరవించిన ప్రభుత్వం అతన్ని ద్రోహిగా పరిగణించి కేసు పెడుతుంది.
జోలా లాయర్‌ నిజాన్ని బైటపెట్టడానికి ఎంతో ప్రయత్నిస్తారు. కాని మిలటరీ న్యాయాధికారులు ఒక్కటయి లాయర్‌కు సరైన ప్రశ్నలు వేసే అవకాశం ఇవ్వరు. దీనితో జోలా కేసు ఓడిపోతాడు. పికార్ట్‌ ఒక్కడే అతనికి అండగా నిలుస్తాడు కాని తప్పులు కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో ఉన్న ప్రభుత్వం అతని సాక్షానికి విలువ ఇవ్వదు. దీనితో జోలాకు సంవత్సరం పాటు జైలు శిక్ష పడుతుంది. కాని జోలా ప్రభుత్వానికి తలవంచాలనుకోడు. అతనిలోని ఆ పాత కోపం, న్యాయం కోసం తపన తిరిగి విజంభిస్తాయి. లాయర్‌ సలహాతో లండన్‌ పారిపోతాడు జోలా. అక్కడి నుండి తన రచనల ద్వారా డ్రేపస్‌కు న్యాయం జరపాలని పోరాటం మొదలెడతాడు. ఫ్రెంచ్‌ అధికారులకు చుక్కలు చూపిస్తాడు. అంతర్జాతీయంగా ఈ కేసు ప్రాచుర్యం పొంది న్యాయం జరగాలని ప్రపంచ దేశాలు, ప్రజలు ఫ్రెంచ్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతారు. చివరకు ఫ్రెంచ్‌ ప్రభుత్వం దిగి వచ్చి డ్రేపస్‌ నిర్దోషి అని ప్రకటిస్తుంది. అతన్ని జైలుకి పంపడంలో కుట్ర చేసిన అధికారులు సస్పెండ్‌ అవతారు. ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకుంటారు. అసలు దేశద్రోహి ఫ్రాన్స్‌ వదిలి పారిపోతాడు. జోలా విజయం సాధిస్తాడు. డ్రేపస్‌ విడుదలవుతాడు. అతనికి గౌరవంగా మిలట్రీ మళ్ళీ తమలో కలుపుకుంటుంది.
డ్రేపస్‌ కేసు అనుభవాలను ఆధారం చేసుకుని జోలా జస్టిస్‌ అనే మరో పుస్తకం రాసే ప్రయత్నంలో ఉంటాడు. కాని సన్మానం జరగబోయే ముందు రోజు రాత్రి అతని గదిలో చిమ్నీ పాడయి కార్బన్‌ మోనాక్సాయిడ్‌ లీక్‌ అవడంతో ఆ విషవాయువుల కారణంగా జోలా మరణిస్తాడు. అతన్ని ఓ గొప్ప రచయితగా, దేశభక్తుడిగా మానవతావాదిగా గుర్తించిన ఫ్రెంచ్‌ ప్రజల నడుమ ఓ గొప్ప నాయకుడి హోదాలో అంతక్రియలు జరుగుతాయి. పారిస్‌లోని పాన్థియన్‌లో ప్రఖ్యాత రచయితలు అలెగ్జాండర్‌ డ్యూమస్‌, విక్టర్‌ హ్యూగో సమాధుల వద్ద అతని అవశేషాలను ఉంచి సమాధి నిర్మించారు ఫ్రెంచ్‌ దేశస్తులు.
సినిమాలో ఎమిలి జోలా పూర్తి జీవితాన్ని కాకుండా డ్రేపస్‌ కేస్‌ కు ఎక్కువ ప్రాధ్యాన్యం ఇవ్వడం కనిపిస్తుంది. అలాగే యూదుల పట్ల, జర్మనీ అరాచకాలు, రెండవ ప్రపంచ యుద్ధ పరిస్థితులను దర్శకులు సందర్భం వచ్చినా ప్రస్తావించకుండా పక్కకు నెట్టేయడం కొందరిని బాధించింది. ఎమిలి జోలా పాత్రలో పాల్‌ ముని నటించింది కేవలం 22 సినిమాలే కాని అయిదు సార్లు ఉత్తమ నటుడి నామినేషన్‌ పొందారు. అందులో ఈ చిత్రం కూడా ఒకటి. థియేటర్‌ను ఇష్టపడే వీరికి అమెరికా నాటకరంగంలో గొప్ప పేరు ఉంది. ఈ పాత్రకు పూర్తి న్యాయం చేశారాయన. మొత్తం పది అకాడమీ నామినేషన్లు పొందిన ఈ చిత్రం ఆ రోజుల్లో ఘనవిజయం సాధించింది. కాని ఫ్రాన్స్‌ దీన్ని అప్పట్లో బహిష్కరించింది. తమ మిలట్రీ ప్రతిష్టను ఇది దెబ్బతీస్తుందని ఆ దేశం భావించడం దానికి కారణం. ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ గెలుచుకున్న ఈ సినిమాలో సంభాషణలు, కోర్టు సీన్‌లో జోలా పలికే మాటలు, స్వేచ్ఛ, స్వాతంత్య్రం గురించి జరిగిన చర్చలు అత్యంత గొప్ప మానవతా దక్పథంతో చిత్రీకరించబడ్డాయి. జోలా వ్యక్తిత్వం ఆకర్షిస్తుంది. కత్తి కన్నా కలం గొప్పదనే నానుడిని నిజం చేసిన జోలా జీవితం ఎందరికో ప్రేరణ. విలియం డైటెరిల్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఆస్కార్‌ ఉత్తమ చిత్రాల నడుమ గర్వంగా నిలిచి ఉన్న ఓ ఆణిముత్యం.

– పి.జ్యోతి, 98853 84740