న్యాయ వ్యవస్థపై నమ్మకముంది.. పోరాడతా : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
కక్షపూరితంగా తనపైనా, తన అనురాగ్‌ యూనివర్సిటీపైనా కేసులు నమోదు చేయటం ద్వారా ప్రభుత్వం రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తోందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకముందనీ, చట్ట ప్రకారం నడుచుకుంటూ పోరాడుతానని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు బనాయించినా, ఎన్ని ఒత్తిళ్లకు గురి చేసినా లొంగేది లేదని స్పష్టం చేశారు. అనురాగ్‌ వర్సిటీకి సంబంధించి చట్ట ప్రకారమే అన్ని అనుమతులు తీసుకున్నామని వివరించారు. 25 సంవత్సరాల తమ విద్యా సంస్థల ప్రస్థానంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విద్యాబోధన సాగించామని తెలిపారు.