మహిళా కమిషన్‌ సభ్యులకు నోటీసులు

– కార్యదర్శిని ఆదేశించిన చైర్మెన్‌ నేరెళ్ల శారద
– ఆఫీసులో మాజీమంత్రి కేటీఆర్‌కు రాఖీ కట్టిన ఫలితం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆరుగురు మహిళా కమిషన్‌ సభ్యులకు నోటీసులు జారీ చేయాలని ఆ కమిషన్‌ చైర్మెన్‌ నేరెళ్ల శారద కార్యదర్శిని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా, కమిషన్‌ నిష్పాక్షికత, విశ్వసనీయతకు భంగం కలిగించేలా ప్రవర్తించినందుకు వారికి నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న మహిళల్ని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు (కేటీఆర్‌) వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మహిళా కాంగ్రెస్‌ నేతలు మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. కమిషన్‌ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇచ్చేందుకు శనివారంనాడాయన బుద్ధభవన్‌లోని ూకమిషన్‌ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కమిషన్‌ సభ్యులు కేటీఆర్‌కు రాఖీ కట్టారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కమిషన్‌ సభ్యులు అందుకు భిన్నంగా వ్యవహరించడం పట్ల చైర్మెన్‌ నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషన్‌ కార్యాలయంలోకి ొబైల్‌ ఫోన్లను అనుమతి లేదు. కానీ అక్రమంగా ఫోన్లను కార్యాలయంలోకి తెచ్చి, రాఖీలు కడుతున్న దృశ్యాలను సభ్యులు చిత్రీకరించారు. దీన్ని కూడా నిబంధనల ఉల్లంఘనగా చైర్మెన్‌ పేర్కొన్నారు. తక్షణం ఆరుగురు కమిషన్‌ సభ్యుల నుంచి వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని కార్యదర్శిని ఆదేశించారు. దీనిపై న్యాయనిపుణులతోనూ చర్చించి, చర్యలు తీసుకుంటానని చైర్మెన్‌ చెప్పారు.