– ముందే నోటీసులిస్తున్నాం
– చెరువుల్లో కట్టిన నిర్మాణాలే ఫస్ట్ టార్గెట్
– హైడ్రాను ప్రజలు స్వాగతిస్తున్నరు, వ్యతిరేకించి అభాసుసాలు కావొద్దు
– ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీ అన్న అంశమే లేదు
– పదేండ్లలో చెరువుల ఆక్రమణలపై రిమోట్ సెన్సార్ ఫొటోలు ఇస్తాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
చట్టానికి లోబడి మాత్రమే చెరువులను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపడతున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క్ స్పష్టం చేశారు. ప్రజల ఆస్తులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. ఇందుకు సంబంధించి త్వరలోనే అన్నీ లెక్కలతో సహా ప్రజల ముందు పెడతామన్నారు. సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై శనివారం నాడిక్కడ ఆయన స్పందించారు. చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా ను ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హైడ్రా ఏర్పాటు నిర్ణయాన్ని ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారని చెప్పారు. అక్రమ కూల్చివేతలపై తమకు ముందుగా నోటీసులు ఇవ్వలేదని ఆక్రమణదారులు చెబుతున్న దాంట్లో వాస్తవం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూల్చబోయే ప్రతీ పనికి ముందుగానే నోటీసులు ఇస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ నగరం అంటేనే లేక్స్, రాక్స్ (సరస్సులు, రాళ్లు) అని చెప్పారు. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. బఫర్ జోన్‌లో కాకుండా, నేరుగా చెరువులోనే కట్టిన నిర్మాణాలను ఫస్ట్ టార్గెట్‌గా కూల్చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
ఈ చర్యలకు ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తన దగ్గర ఉన్న ప్లానింగ్ శాఖలో శాటిలైట్ ద్వారా రిమోట్ సెన్సింగ్ ఫొటోలు తీసే టెక్నాలజీ ఉందన్నారు. దీని సహకారంతో రాష్ట్ర విభజనకు ముందు, గత పదేండ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. ఈ చెరువుల్లో ఎన్ని పెద్ద పెద్ద సంస్థలు, వ్యవస్థలు టవర్స్, బిల్డింగ్స్ కట్టాయో రిమోట్ సెన్సింగ్ సాటిలైట్ ఫొటోలను తీసి ప్రజల ముందు పెడతామన్నారు. కూల్చివేతల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే అంశం ఉండదన్నారు. ప్రజలకు సంబంధించిన నగరాన్ని, చెరువులను కాపాడటమే తన ప్రధాన బాధ్యత అన్నారు.