– సతీష్ మాదిగ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ క్రిమిలేయర్ను అడ్డం పెట్టుకుని రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సతీష్మాదిగ ఆరోపించారు. మాల, మాదిగల మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. శనివారం హైదరాబాద్లోని గాంధీభవన్లో పార్టీ నేత గజ్జల కాంతంతో కలిసి ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లలో మోడీ క్రిమిలేయర్ విధానాన్ని తెచ్చే కుట్రను ఆయన ఖండించారు. క్రిమిలేయర్ విధానంతో తాత్కాలిక ప్రయో జనమే తప్పా, దీర్ఘకాలిక ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. అంట రానితనం ఉందనే రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ సీనియర్ నేతలు ఎక్కడా స్వాగతించలేదని తెలిపారు. మందకృష్ణ మాదిగ కాంగ్రెస్కు వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని తెలిపారు. మల్లికార్జున ఖర్గేను తిట్టడమంటే కాంగ్రెస్ను తిట్టినట్టేనన్నారు. కాంగ్రెస్లో ఉన్న మాల, మాదిగ ప్రజా ప్రతినిధులివ్వరూ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదనీ, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.