తొలి జాబితాతోనే బీజేపీలో చిచ్చు

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ సోమవారం తన తొలి జాబితాను విడుదల చేసింది. ఈ తొలిజాబితాతోనే బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు, లుకలుకలు బయటపడ్డాయి. సోమవారం ఉదయం ముందుగా 44 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితాను విడుదల చేసింది. అయితే ఈ అభ్యర్థులపై కొంత మంది కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేయడంతో తరువాత ఈ సంఖ్యను 16కు బీజేపీ తగ్గించింది. ఈ 16 మందిలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మహిళా అభ్యర్థి ఉన్నారు. పాంపోర్‌, షోపియాన్‌, అనంత్‌నాగ్‌ వెస్ట్‌, అనంత్‌నాగ్‌ వంటి స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక్కడ మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా సెప్టెంబరు 18న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి.