ఆళ్ళపల్లిని కన్నీటితో వీడ్కోలు పలికిన మదర్ థెరిస్సా (సమ్మక్క)

– మూడు సార్లు ఉత్తమ స్టాఫ్ నర్స్ గా అవార్డు గ్రహీత 
– మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ఆళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాయం సమ్మక్క ఏప్రిల్ 12, 2012 సంవత్సరంలో జాయిన్ అయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరం విధుల్లో కొనసాగుతున్న నేపథ్యంలో తాను హెడ్ క్వార్టర్స్ లో ఉండి విధులు నిర్వహించారు. ఆళ్ళపల్లిలో ప్రజలకు వైద్య సేవలు అందించడం తన అదృష్టంగా భావించేవారు. ఆళ్ళపల్లిలో ప్రేమ అభిమానాలు తనకు దొరికాయని భావించే వారు. ఆళ్ళపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 13 సంవత్సరాల సర్వీస్ లో మొత్తం 1235 డెలివరీలు కాగా.. అందులో సమ్మక్క ఒక్కరే 600 డెలివరీలు చేశారు. కానీ, ఒక్క డెలివరీ కేస్ కి కూడా ఎలాంటి సమస్యా రాలేదంటే ఎంత శ్రద్ధగా విధులు నిర్వహించారో ఇట్టే అర్థమవుతుంది. ఆసుపత్రికి వచ్చిన తల్లి, బిడ్డ క్షేమంగా ఇంటికి వెళ్ళేవారు.
స్టాఫ్ నర్స్ గా ఒక్కరే ఉండి సింగిల్ అటెండర్ లేకుండా 4 ట్విన్స్ డెలివరీ చేసిన ఘనత ఆమె సొంతం. తనకు మండలంలోని ప్రతి ఊరిలో అందరు సుపరిచితులు. ముఖ్యంగా బాసోల్ల గుంపుల్లో ప్రజల ఆదరాభిమానాలు, ప్రేమ ఎక్కడా దొరకవని పలుమార్లు గుర్తు చేశారు. గుత్తికోయ ప్రజలకు బట్టలు ఇవ్వడం, చార్జీలకు డబ్బులు ఇవ్వడంతో, ఆమెలోని మానవత్వాన్ని సైతం చాటుతుంది. ఆసుపత్రికి వచ్చిన సమయాల్లో పలు సందర్భాల్లో వాళ్లకి వంట సైతం చేసి పెట్టారు. అందర్నీ తన వాళ్ళని భావించి వైద్య సేవలు అందించారు. ఎవరినీ కూడా పరాయి వాళ్ళలా చూడలేదు స్టాఫ్ నర్స్ సమ్మక్క. ఆళ్ళపల్లి మండలంలో విధి నిర్వహణలో భాగంగా అనేక మంది డాక్టర్లతో పాటు హెల్త్ క్యాంప్ లకు మారుమూల ప్రాంతాలకు వెళ్లి మరీ వైద్య సేవలు అందించారు. అలా మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలు అందించి అమిత ఆనందాన్ని పొందేవారు. 2013, 2014, 2017 సంవత్సరాల్లో బెస్ట్ స్టాఫ్ నర్స్ గా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు ఆమె అందుకున్నారు. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు అందరూ మర్యాద ఇచ్చి మాట్లాడడం చాలా సంతోషంగా ఉండేదన్నారు. బదిలీపై వెళ్లిన నేపథ్యంలో తాను ఆళ్ళపల్లి మండలంలో అందరి ప్రేమని దూరం చేసుకున్నా అనే బాధ ఉందన్నారు. గత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ నాలుగు పర్యాయాలు ఆళ్ళపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించగా ఏ రోజూ ఆళ్ళపల్లి పి.హెచ్.సి కి మాట రానివ్వలేదని చెప్పుకొచ్చారు. ఎవరు వచ్చినా ఎలాంటి రీమార్క్స్ లేకుండా చేశారు స్టాఫ్ నర్స్ పాయం సమ్మక్క. ప్రజలు మరువలేని వైద్య సేవలు అందించిన స్టాఫ్ నర్స్ సమ్మక్కను ఆళ్ళపల్లి మథర్ థెరిస్సా అనడంలో అతిశయోక్తి కాదేమో!