
నవతెలంగాణ – గంగాధర
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తూ ప్రతి రైతు కుటుంబానికి, రైతులకు త్వరలో అన్ని రకాల సేవలు అందించడానికి చర్యలు చేపడుతున్నామని కేడీసీసీ బ్యాంకు చైర్మన్ కొండూరు రవీందర్ రావు వెల్లడించారు. గంగాధర మండల కేంద్రంలో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనాన్ని కొండూరి రవీందర్ రావుతో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు మాట్లాడుతూ రైతులకు రుణాలతోపాటు అన్ని రకాల సేవలను అందించడానికే ప్రభుత్వం సింగిల్ విండోల ఏర్పాటు చేసిందని, ఆ పేరును సార్థకత చేసేలా త్వరలోనే అన్ని రకాల సేవలను రైతులకు అందించేలా కృషి జరుగుతుందని అన్నారు. బ్యాంకులతో పోటీపడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు తక్కువ వడ్డీతో ఎక్కువ రుణాలు రైతులకు అందిస్తూ బ్యాంకులకు దీటుగా పని చేస్తున్నాయని అన్నారు. నాలుగేళ్ల కాలంలో 500 కోట్ల రూపాయలతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నూతన భవనాలు నిర్మించడం జరిగిందని, ఇందులో కరీంనగర్ జిల్లాలోనే 75 కోట్ల రూపాయలతో భవనాలు నిర్మించడం జరిగిందన్నారు. కేడీసీస్ బ్యాంకు పరిధిలో 135 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయని, రుణాలు కాకుండా ప్రతి సింగిల్విండో కార్యాలయాల్లో కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన పహాణీలు, పలు రకాల ధ్రువీకరణ పత్రాలను అందించడం జరుగుతుందని అన్నారు.
సింగిల్ విండో విధానాన్ని త్వరలోనే అమలు చేస్తూ అనారోగ్యం బారిన పడిన రైతులకు సహకార సంఘాల ద్వారా జనరిక్ మందులను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతుందన్నారు. స్వచ్ఛ్ సేవా కార్యక్రమంలో భాగంగా రైతులకు సహకార సంఘాల ద్వారా వైద్యుల అపాయింట్మెంట్ తో పాటు వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. సహకార సంఘాల పక్షాన రైస్ మిల్లులు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర చెల్లించేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. గంగాధర వ్యవసాయ సహకార సంఘం పక్షాన ఏర్పాటు చేసే రైస్ మిల్లుకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. సింగిల్విండో విధానం అమలు చేస్తూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడమే కాకుండా రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తుందన్నారు. గంగాధర సహకార సంఘం పక్షాన రైస్ మిల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన భూమిని కేటాయించేలా జిల్లా కలెక్టర్ తో మాట్లాడి భూమి కేటాయించేలా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సింగిల్విండో చైర్మన్ దూలం బాలగౌడ్, సింగిల్ విండో ఉపాధ్యక్షుడు వేముల భాస్కర్, ఏఎంసీ ఉపాధ్యక్షుడు తోట కరుణాకర్, తహసిల్దార్ అనుపమరావు, ఎంపీడీవో జనార్దన్ రెడ్డి, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు, మాజీ మాజీ జెడ్పిటిసి సత్తు కనకయ్య, నాయకులు రాజ నర్సింగారావు, పుల్కం నరసయ్య, యాదగిరి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఏఎంసీ డైరెక్టర్లు, సింగిల్ డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.