ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధన– మంచిర్యాల కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌
నవతెలంగాణ-జైపూర్‌
ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్యాబోధన అందించడం జరుగుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. కోటపల్లి మండలం సర్వాయిపేట్‌ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలను బుధవారం ఆకస్మికంగా ఆయన సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సకల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పటిష్ట మైన చర్యలు చేపట్టిందని తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులు, మధ్యాహ్న భోజనం పంపిణీ, విద్యార్థుల విద్యా ప్రమాణాల సామర్థ్యం విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. కాగా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన కొనసాగాలని ఉపాధ్యాయులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి ప్రభుత్వ పాఠశాలల పట్ల ప్రజలకు సద్భావన కలిగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ తీరును పరిశీలించారు. అనంతరం యేసన్వాయి, ఎడగట్ట గ్రామాలను సందర్శించి పారిశుధ్య పనుల నిర్వహణను పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, మురుగనిరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, గ్రామపంచాయతీలలో చెత్త చెదారం నిలువ కాకుండా ఎప్పటికప్పుడు డంప్‌యార్డులకు తరలించాలని ఆదేశించారు. సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పట్ల గ్రామీణులను అప్రమత్తం చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.