పసలేని ప్రసంగం

Speechlessస్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన పదకొండవ ప్రసంగం ఇప్పటి వరకూ ఆయన చేసిన వాటిలో అతి సుదీర్ఘమైంది. ఆయన కొలబద్దలతో చూసినా అత్యంత నిరుత్సా హకరమైంది. ఆ ప్రసంగంలో ప్రధాన భాగం తన సర్కారు విజయాల జాబితాను వల్లించడానికే సరిపోయింది. స్వచ్ఛ భారత్‌ నుంచి జల్‌ జీవన్‌ మిషన్‌ నుంచి పునరుత్పాదక ఇంధనం వరకూ, బ్యాంకింగు రంగాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించిన వాటితో సహా సంస్కరణల వరకూ అందులో ఏకరువు పెట్టారు. వీటన్నిటిని కూడా వికసిత్‌ భారత్‌ 2047 గురించిన అస్పష్ట భాషణలో పొందుపర్చారు. సాధించిన విజయాలుగా చెప్పు కున్న కొన్నిటికి వాస్తవ పునాది లేనే లేదు. ఉదాహ రణకు పునరుత్పాదక ఇంధనం విషయానికి వస్తే జి20 దేశాలన్నీ కలసి సాధించిన దానికంటే ఇండియా ఒక్కటే ఎక్కువ సాధించిందని ఆయన చెప్పుకున్నారు. ఈ గొప్పలకు ప్రాతిపదిక ఏమిటో తెలియదు.
ఉపాధి సమస్య, ఉత్పత్తి గొప్పలు
మూడోసారి అధికారంలోకి వచ్చాక చేసిన తొలి స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం గనక తన ప్రభుత్వం అమలు చేసే నూతన వైఖరులు, విధానాలు ఏమిటో మోడీ చెబుతారని ఎవరైనా ఆశిస్తారు. కాని అలాంటివాటి ఊసే లేదు. మనం స్వర్ణయుగ భారత్‌లోకి ప్రవేశించబోతున్నామన్న హామీ ఒక్కటే ఆయన ఇచ్చిన హామీ. లోక్‌సభ ఎన్నికలలో ప్రధానంగా ముందుకొచ్చింది ఉద్యోగ కల్పన సమస్య కాగా యువతకు ఇంటి ముంగిట్లో అసంఖ్యాకమైన ఉద్యోగావకాశాలు వచ్చేశాయని మోడీ ప్రకటించారు. కానీ ఈ అవకాశాలేమిటో మాత్రం నిర్దిష్టంగా చెప్పింది లేదు. ఆయన ప్రభుత్వం చేసిందల్లా ఒకటే. కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగాలతో ముడిపడిన కొన్ని ప్రోత్సాహకాలను ప్రకటిం చడమే. ఈ పథకాలు 500 అగ్రశ్రేణి కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌ చేయడా నికి అవకాశం కల్పిస్తాయి. ఇందులోనూ వేతనాల మొత్తంలో కొంతభాగాన్ని ప్రభుత్వం సబ్సిడీగా తన ఖజానా నుంచి సమకూరుస్తుంది. ఏమైనా ఈ నియామకం కూడా ఏడాది పాటు మాత్రమే వుంటుంది. అంటే నిర్ణీత కాలానికి మాత్రమే వారిని తీసుకుంటారన్న మాట. శిక్షణ పొందిన వారిని ఏడాది తర్వాత క్రమబద్దీకరించ కుండా మళ్లీ కొత్తవారిని నియమిం చుతారు. యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగ సమస్యకు ఇది ఏ విధంగానూ పరిష్కారం చూపబోదు. అయితే ఉద్యోగాల గురించి వున్నది ఈ ఒక్క ప్రస్తావన మాత్రమే. నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఉత్పత్తి రంగం కీలకమని మోడీ అంటా రు. భారతదేశం ఉత్పత్తి హబ్‌గా మారే రోజు ఎంతో దూరంలో లేదనీ చెబుతారు. అయితే ఉత్పత్తి రంగంలో, పారిశ్రామికా భివృద్ధిలో మన పరిస్థితి మాత్రం ఇందుకు సంబంధించి పెద్ద విశ్వాసం కలిగించదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జీడీపీలో ఉత్పత్తి రంగం వాటా 2014లో 15 శాతం వుంటే 2024 ఆర్థిక సంవత్సరం నాటికి 13 శాతానికి పడిపో యింది. గత పదేళ్లలోనూ దాదాపు యాభై వేల చిన్న మధ్య తరహా పరిశ్రమల మూతల్లో 3,17,641 ఉద్యోగాలు లేకుండా పోయాయని సంబంధిత మంత్రి 2024 జులై 25న లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కనుక ఇండియా అంతర్జాతీయ పారిశ్రామిక హబ్‌గా రూపొందు తుందని మోడీ గొప్పలు చెప్పుకోవడం బూటకమని అర్థమవుతుంది.
అవినీతిపై యుద్ధమంటే..?
అవినీతిపై యుద్ధం గురించి మాట్లాడే సందర్భంలో మోడీ ఒక విచిత్రమైన ప్రస్తావన చేశారు. అవినీతిపై పోరాటం కోసం ఒక మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్నారు. తన ప్రతిష్టనే ఫణంగా పెట్టినట్టు చెప్పారు. ఇక అవినీతికి వ్యతిరేకంగా తన పోరాటం పూర్తి నిజాయితీతో వేగంగా కొనసాగుతుందన్నారు. ఈ మొత్తం ప్రసంగంలో మరీ కపట పూరితంగా వున్న భాగం ఇదే. గౌతమ్‌ అదానీ గ్రూపు కంపెనీలు కార్పొరేట్‌ అవినీతికి, చట్టాల ఉల్లంఘనకు పాల్పడితే ఆ తీవ్రారోపణల నుంచి కాపాడటానికి మోడీ ఎంతగా బరితెగించిందీ గత ఏడాది చూశాం. ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వం అదానీ గ్రూపుపై దర్యాప్తుల విషయంలో లాలూచీ పడిన సెబీ అధ్యక్షురాలిని కాపాడేందుకు ఆయన ప్రభుత్వం ఎంతకైనా సిద్ధపడుతున్నదీ చూస్తున్నాం. మోడీకి సంబంధించినంత వరకూ అవినీతిపై పోరాటం అంటే ఈడిని, సిబిఐని ప్రతిపక్ష నాయకులపై ప్రయోగించడం, వారిపై తప్పుడు కేసులు బనాయించడం మాత్రమే.
మహిళలు, ముస్లింలపై దాడికే కోడ్‌?
మోడీ ప్రధాని పదవి చేపట్టినప్పటికీ తన పార్టీ మాత్రం లోక్‌సభలో మెజార్టీ కోల్పోయింది. ఆరెస్సెస్‌-బీజేపీ ప్రధాన ఎజెండానే అనుసరిస్తా మనే సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు. బీజేపీ మూల ఎజెండాలో నిర్దేశించుకున్న మూడు ముఖ్యాంశాలు-370 ఆర్టికల్‌ రద్దు, అయోధ్యలో రామమందిరం, ఏకరూప పౌరస్మృతి. మొదటి రెండూ అమలయ్యాయి గనక మోడీ ఇక ఏకరూప పౌరస్మృతి చేపడతామని ప్రకటించారు. గత 75 ఏళ్ల నుంచి అమలవు తున్న మతతత్వ పౌరస్మృతికి విరుద్ధంగా అది లౌకిక పౌరస్మృ తిగా వుంటుం దని ఆయన అంటున్నారు. బీజేపీ, ఆరెస్సెస్‌ లకు సంబంధిం చినంత వరకూ ఏకరూప పౌరస్మృతి విభిన్న మతాలలో స్త్రీపురుష సమానత్వం తీసుకు రావడం కోసం కాదు. అది వారి లక్ష్యమైతే ఆయా మతాల వ్యక్తిగత చట్టాలలో సంస్కరణలు తేవడం మొదటి అడుగవుతుంది. అందుకు భిన్నంగా ఈ ఏకరూప పౌరస్మృతి ముస్లిం మతాన్ని లక్ష్యంగా చేసుకుం టుంది. గిరిజనుల వ్యక్తిగత చట్టాలు ఈ సమీక్ష పరిధిలోకి రాబోవని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఉత్తరాఖండ్‌ పౌరస్మృతినే తీసుకున్నట్ట యితే అది నేరుగా లైంగిక విషయాల్లో యుక్త వయస్కులైన మహిళల స్వయం నిర్ణయాధి కారాన్ని సూటిగా దెబ్బతీసేదిగా వుంది. వారిపైన నైతిక కాపలాకు నిఘాకు చట్టబద్దమైన లైసెన్సునిస్తున్నది. అలాంటి తిరోగామి పౌరస్మృతిని బలవంతంగా రుద్దేందుకు జరిగే ఏ ప్రయత్నాన్నయినా లౌకిక ప్రజాస్వామిక శక్తులు అత్యంత తీవ్రంగా ప్రతిఘటి స్తాయి. లోక్‌సభ ఎన్నికల తీర్పు గుణపాఠా లను మోడీ, బీజేపీ జీర్ణం చేసుకున్నట్టు కనిపించదు. బీజేపీకే గనక 400కు పైన సీట్లు వస్తే రాజ్యాంగాన్ని, దాని మౌలిక లక్షణాలనూ సమూలంగా మార్చేస్తుం దనే భయం ఓటర్లలో వున్న కారణంగానే ఆ పార్టీ స్థానాలు కోల్పోయింది. మోడీ ఎంతో మోజు పడే ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అనే తన నినాదాన్ని ఈ ప్రసంగంలో నొక్కిచెప్పడం అందుకే ఆశ్చర్యకరమ నిపిస్తుంది. ఆ పథకాన్ని అమలు చేయాలన్నట్టయితే రాజ్యాంగానికి దాని వెలుపల చట్టాలకూ సవరణల పరంపర అవసరమవుతుంది. ప్రస్తుతం బీజేపీ పార్లమెంటు ఉభయసభల్లో ఆ విధమైన సవరణలు ఆమోదించు కోగలిగిన స్థితిలో లేదు. ఎందుకంటే తన మిత్రపక్షాలతో కలిసినా దానికి మూడింట రెండు వంతుల మెజార్టీ లేదు. అయినా మోడీ మాత్రం ‘స్వర్ణ భారతం’ అనే తన కలనే పట్టుకు వేలాడు తున్నారు. దాని అర్థం హిందూత్వ నియంతృత్వ రాజ్యం తప్ప మరోటి కాబోదు.
(ఆగస్టు 21 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)