విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండాలి

Students should be well behaved– యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
– బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌
నవతెలంగాణ-తాండూర్‌
విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సత్ప్రవర్తనతో మెలగాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ తెలిపారు. బుధవారం తెలంగాణ యాంటీ నార్కోటిక్‌ బ్యూరో డైరెక్టర్‌ ఉత్తర్వుల మేరకు తాండూర్‌ విద్యా భారతి హైస్కూల్‌లో యాంటీ నార్కోటిక్‌ అవేర్నెస్‌ డే నిర్వహించారు. విద్యార్థులకు గంజాయి, మాదక ద్రవ్యాల వాడకంతో కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎసీపీ మాట్లాడారు. గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సిగరెట్‌, గుట్కా, ఆల్కహాల్‌ వంటి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండాలని చెప్పారు. విద్యార్థి దశ నుంచే మంచి నడవడికతో సంఘంలో మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు. కన్న తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. శ్రద్ధగా చదువుకొని మంచి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడాలని తెలిపారు. గ్రామంలో ఎవరైన గంజాయి అమ్మినా, పీల్చిన తమ దృష్టికి తేవాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. గంజాయి మహమ్మారి నిర్మూలనలో ప్రతి ఒక్కరు భాగస్వామి కావాలన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని మార్చేందుకు ప్రతి ఒక్కరు తమ వంతుగా కృషి చేయాలని కోరారు. సిఐ కుమారస్వామి మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండి విద్యార్థిని విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో కమిటీలు వేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు ఏసీపీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రహ్లాద్‌, ఎస్సై కిరణ్‌కుమార్‌ విద్యా భారతి కరస్పాండెంట్‌ సురభి శరత్‌ కుమార్‌, ఉపాధ్యాయులు గంప శ్రీనివాస్‌, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.