ఇక్కడ కావాలి ఓ హైడ్రా..!

A hydra is needed here..!– అనేక చోట్ల చెరువులు,కుంటలు అన్యాక్రాంతం
– ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లు అక్రమించి కట్టడాలు
– ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే అనేక ఫిర్యాదులు
– ఇక్కడా ఏర్పాటుచేయాలని జిల్లావాసుల డిమాండ్‌
అక్రమ కట్టడాల కూల్చివేతతో ప్రకంపనలు సృషిస్తున్న హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటక్షన్‌(హైడ్రా)పై అందరి దృష్టి కేంద్రీకృతమవుతోంది. రోజూ ఈ సంస్థ చేపడుతున్న చర్యలపై దృష్టిసారిస్తున్న జనం..ఇలాంటి సంస్థ మన జిల్లాలోనూ నెలకొల్పితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్థను ఏర్పాటుచేయాలని ఇప్పటికే కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు సీఎంకు విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. చెరువులు, కుంటలు కబ్జాకు గురికావడం ఒక్క హైదరాబాదుకు మాత్రమే పరిమితం కాలేదని..అలాంటి ఘటనలు జిల్లాల్లోనూ కొకొల్లలుగా ఉన్నాయని సామాన్య జనం సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయా జిల్లాల పేరుతో ఈ సంస్థలను ఏర్పాటుచేస్తే బాగుంటుందనే భావన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ సంస్థ హైదరాబాదులో చేపడుతున్న కార్యకలాపాలను ఆసక్తిగా తెలుసుకుంటున్న జనం ఇక్కడా ఓ హైడ్రా వంటి సంస్థ కావాలని కోరుతుండటం చర్చనీయాంశంగా మారింది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజలు, పశవులతో పాటు పంట పొలాలకు సాగునీరందించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వాలు నివాసాల మద్యలో చెరువులు, కుంటలను ఏర్పాటుచేసింది. మన రాష్ట్రంలో కాకతీయులు, నిజాం కాలంలో ఈ చెరువుల నిర్మాణం అధికంగా జరిగినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గతంలో ఊరికి కనీసం మూడు చెరువులు ఉండేవని..ఒకటి తాగునీటికి, రెండోది బట్టలు ఉతకడం..మూడోది పంటల కోసం నిర్మించారని చెబుతుంటారు. ఒకప్పుడు వర్షాకాలం రాగానే ఈ చెరువులు, కుంటలు నిండుకుండలా మారి ఎండకాలం చివరి వరకు ప్రజలకు ఉపయోగపడేవి. కానీ కాలానుగుణంగా వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో కబ్జాకు గురవుతూ వచ్చాయి. ముఖ్యంగా పట్టణాల్లో జన సాంద్రత పెరగడంతో ఇండ్లు, ఇతరాత్ర వాటిని చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. ఫుల్‌లెవల్‌ట్యాంక్‌(ఎఫ్‌టీఎల్‌) పరిధితో పాటు చెరువుకు ఆయకట్టుకు మద్యలో ఉండే బఫర్‌జోన్‌లను సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు ఆరోపణలున్నాయి. వీటిపై స్థానికుల నుంచి పలు ఫిర్యాదులు వచ్చినా అధికారులు, పాలకులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆదిలాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాలు, మండల కేంద్రాల్లో అనేక చెరువులు, కుంటలు ఆనవాళ్లు లేకుండా పోయినట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎఫ్‌టీఎల్‌తో పాటు బఫర్‌జోన్‌లలో నిర్మాణాలు చేయకూడదనే నిబంధనలు ఉన్నా కొందరు అధికారుల అండగా అక్రమార్కులు వాటిని కబ్జా చేసి ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వాటిలో ప్లాట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నట్లు తెలుస్తోంది. చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురవుతున్నా..ఇన్నాండ్లు అధికార యంత్రాంగం దృష్టిసారించిన దాఖలాలు లేకుండా పోయాయి. దీంతో ఆయా జిల్లా కేంద్రాల్లోని చెరువుల ఎఫ్‌టీఎల్‌తో పాటు బఫర్‌జోన్‌లోనూ అనేక నివాసాలు, ఫామ్‌హౌస్‌లు, ఆస్పత్రులు, వివిధ రకాల నిర్మాణాలు వెలిసినట్లు తెలుస్తోంది. చెరువులకు సంబంధించిన భూములను సైతం అధికారులతో లోపాయికారి ఒప్పందం మేరకు కొందరు అక్రమంగా పట్టాలు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ ఏర్పాటు చేయాలని డిమాండ్‌..!
ఉమ్మడి జిల్లాలోనూ అనేక చెరువులు, కుంటలతో పాటు విలువైన ప్రభుత్వ స్థలాలు సైతం అన్యాక్రాంతమవుతున్నాయి. అక్రమార్కుల చెరబట్టడంతో కబ్జాకు గురవుతున్నాయి. రియల్‌ఎస్టేట్‌ పెరిగిన తర్వాత ఈ సమస్య మరింత అధికంగా మారిందని జనం చెబుతున్నారు. ఒకప్పుడు విశాలంగా ఉన్న చెరువులన్ని కాలానుగుణంగా కబ్జాకు గురవుతుండటంతో ఏండ్ల నుంచి పట్టణాలు, మండల కేంద్రాల్లో నివాసముంటున్న జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో అధిక వర్షాలు కురిసిన సమయంలో ఇండ్లు నీటిలో మునిగిపోవడం వంటి విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం హైడ్రా పేరిట హైదరాబాదులో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతుండటంతో ఇలాంటి సంస్థను అన్ని జిల్లాల్లో ఏర్పాటుచేయాలని జనం డిమాండ్‌ చేస్తున్నారు. హైడ్రా వంటి సంస్థ జిల్లాల్లో ఉంటే కనీసం భవిష్యత్తులోనైనా చెరువులు, కుంటలు, ఇతర ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా ఉంటాయని జనం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఉమ్మడి జిల్లాలోని కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు సైతం ఈ సంస్థను ఏర్పాటుచేయాలని ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజల నుంచి సైతం ఈ డిమాండ్‌ తెరమీదకు రావడం ఆసక్తికరంగా మారింది.