రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ బీజేపీతో కుమ్మక్కయ్యారా?

– కవిత బెయిల్‌పై అసత్యప్రచారం తగదు : కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలకు కూడా బెయిల్‌ వచ్చిందనీ, వారు కూడా బీజేపీతో కుమ్మక్కు అయ్యారా? అని కాంగ్రెస్‌ నేతలను బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే.తారకరామారావు ప్రశ్నించారు. బుధవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కవితకు బెయిల్‌ వచ్చిన విషయంపై కాంగ్రెస్‌ నేతలు చేస్తున్న అసత్యప్రచారాన్ని ఖండించారు. ఇండియా కూటమిలో భాగమైన ఆప్‌ నేత మనీష్‌ సిసోడియాకు కూడా వారంక్రితమే బెయిల్‌ వచ్చిన విషయాన్ని కేటీఆర్‌ ప్రస్తావించారు. ఓటుకు నోటు కుంభకోణంలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి 2015 నుంచి బెయిల్‌పై ఉన్నారన్న సంగతి కాంగ్రెస్‌ నేతలు గుర్తు పెట్టాలకోవాలని సూచించారు. ఆ బెయిల్స్‌ అన్నీ ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వచ్చాయనీ, వారు ఎన్డీయే భాగస్వామ్యులని అనుకోవాలా? అని ప్రశ్నించారు.
హైకోర్ట్‌లో జీవో నెంబర్‌ 46 బాధితులకు కేటీఆర్‌ మనోధైర్యం
హైకోర్టులో జీవో నెంబర్‌ 46పై వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో బాధితులకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు మనోధైర్యం కల్పించారు. కన్నీటిపర్యంతమైన బాధితులను ఓదార్చారు. బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అధైర్య పడకండి, మీకు అండగా మేము అండగా బీఆర్‌ఎస్‌ ఉంటుంది. జీవో నెంబర్‌ 46పై సుప్రీం కోర్టుకెళ్దాం. మంచి లాయర్లతో కేసుపై కొట్లాడుదాం’ అని భాదితులకు భరోసా కల్పించారు. పార్ట్‌ టైం ఉద్యోగాలు చేసి పైసాపైసా పోగు చేసి, కోచింగ్‌ సెంటర్లలో పుస్తకాలతో కుస్తీ పట్టి, కోటి ఆశలతో కనిపెంచిన తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలనీ, ఆత్మగౌరవంతో బతకాలని ఆశపడ్డ నిరుద్యోగుల కలలపై ఆ జీవో గుదిబండగా మారిందని బీఆర్‌ఎస్‌ నేత రాకేశ్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం సరిదిద్దే లోపే ఎన్నికల నోటిఫికేషన్‌ రావడం అడ్డంకిగా మారిందని తెలిపారు. ఆ తర్వాత జీవో 46 బాధితులను ప్రచార సామగ్రిగా వాడుకున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒడ్డెక్కినాక బోడి మల్లన్న అన్నట్టు వాడుకొని వదిలేసిందని విమర్శించారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తామనీ, న్యాయపోరాటం మాత్రం ఆగదని పేర్కొన్నారు. న్యాయం కోసం సుప్రీం కోర్టుకెళ్తామని తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో, న్యాయ పరంగా అన్ని రకాలుగా కొట్లాడుతూనే ఉంటామని పేర్కొన్నారు.