దక్షిణాసియాలో నిశ్శబ్ద ప్రజాస్వామిక ప్రతిఘటన

Silent Democratic Resistance in South Asiaఇటీవలి బంగ్లాదేశ్‌ పరిణా మాలు, అంతకుముందు శ్రీలంక, పాకిస్థాన్‌లో జరిగిన సంఘటనలతో పాటుగా తాజాగా భారతదేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు, దక్షిణాసియాలో నిశ్శబ్ద ప్రజాస్వామిక ప్రతిఘటనను స్పష్టంగా తెలియ జేస్తున్నాయి. వలసపాలన అనంతర ప్రజాస్వామ్య దేశాలలో భిన్నమైన చారిత్రక ప్రక్షేపమార్గాలు ఉంటుండగా,భారతదేశ ప్రస్తుత పరిస్థితిని పాకిస్థాన్‌తో పోల్చడం ద్వారా ఈ ప్రతిఘటనను మనం అర్థం చేసుకుంటాం.
రెండు దేశాలు ఒకే విధమైన వలస వారసత్వాన్ని కలిగి ఉన్నప్పటికీ పాకిస్థాన్‌, హద్దులు దాటి నిరంకుశత్వం వైపు పయ నించగా భారతదేశంలో సుదీర్ఘ కాలంపాటు ప్రజాస్వామ్యం ఎందుకు కొనసాగిందనే కారణాలపై వలసపాలన అనంతర కాలాల్లోని భారతదేశం, పాకిస్థాన్‌లోని రాజకీయ వ్యవస్థల మధ్య పోలికలు ప్రధానంగా కేంద్రీకరించాయి. అనేకమంది మేధావులు, పాకిస్థాన్‌తో పోల్చితే భారతదేశంలో ప్రజాస్వామ్యానికి దోహదం చేసిన కారణాలను వివరించారు. ఈ కారణాలు భారతదేశంలో ప్రజాపునాది గల రాజకీయ పార్టీ వ్యవస్థకు ఎదురుగా సంస్థాగతంగా బలహీనంగా ఉన్న ముస్లింలీగ్‌ల ఉనికి దగ్గర్నుండి కాంగ్రెస్‌ను స్థాపించిన నిర్దిష్టమైన (మధ్య తరగతి) సామాజిక వర్గాలు, ముస్లింలీగ్‌ల ఆధిపత్యం వరకూ ఉన్నాయి.
అలాంటి వివరణల విలువ స్పష్టంగా ఉంది. అది భారతదేశం, పాకిస్థాన్‌ల రాజకీయ ప్రక్షేపమార్గల గురించి మన అవగాహనను పెంచుతుండగా, సాంప్రదాయమైన పోలిక అదే రీతిలో పాకిస్థాన్‌లోని ప్రజాస్వామిక స్థలాన్ని అవగాహన చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలను బలహీనపరిచింది. ఇది, ప్రజాస్వామిక ఆధారాలు ఉన్నప్పటికీ భారతదేశ రాజకీయ వ్యవస్థలోని నిరంకుశ ధోరణి విశ్లేషణను మసక బరిచింది. ఈ నిర్దిష్టమైన తర్కం ద్వారా మనం అవగాహన చేసుకొని, సూచించిన వాటిని వివరించి, సామా జిక శక్తులు ప్రజాస్వామిక స్థలాన్ని తిరిగి పొందడానికి ప్రయత్నించే భారతదేశం, పాకిస్థాన్‌లు నిశ్శబ్ద ప్రజాస్వామిక ప్రతిఘటనల మధ్య ఉన్నాయని వాదిస్తాము.
క్రియాత్మక ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికల చరిత్ర, అధికారాల విభజన అంగీకార యోగ్యమైన ఆలోచనతో భారతదేశం అసాధారణవాదానికి ప్రతీకగా నిలిచింది. 1975లో విధించబడిన (నియమాల్ని ఉల్లంఘించే) ఎమర్జెన్సీని నిరోధించి, భారతదేశం ఒక బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్య దేశంగా మిగిలిపోయింది. సైనిక పాలనపై పౌర పాలన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు రాజ్యాంగపరమైన దష్టి, వలసవాద వారసత్వ వ్యతిరేకత భారతదేశం విషయంలో బాగా పని చేసింది. జవహర్‌ లాల్‌ నెహ్రూ మంత్రివర్గంలో (1957-62) రక్షణ మంత్రిగా పనిచేసిన కష్ణ మీనన్‌ సాయుధ బలగాలను బలహీనపర్చడంలో చాలా కీలకమైన పాత్రను పోషించాడు. ఈ విషయాన్ని ఇటీవలి కాలంలో జైరామ్‌ రమేష్‌, కష్ణ మీనన్‌ జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. భారత దేశం ఏనాడూ ఇంతవరకు సైనిక నియంతత్వ ముప్పును ఎదుర్కోలేదు.
అయితే 2014లో మొదలైన నరేంద్రమోడీ పాలన అన్నిటినీ మార్చేయడం జరిగింది. అవసరానికి మించి నిరంకుశ పాలనా నమూనా దిశలో వేగంగా వెళ్లడంలో భారత దేశం కూడా పోటీపడుతుంది. భారతీయ ప్రజాస్వామిక కసరత్తు అధ్యక్ష తరహా రూపాన్ని తీసుకోవడమే కాకుండా ప్రతిపక్షం లేని ప్రజాస్వామ్యం కోసం కూడా ప్రచారం చేయడం బహుశా ఇది మొదటిసారి. భారతీయ జనతా పార్టీ ‘కాంగ్రెస్‌ ముక్త భారత్‌’ అనే ప్రచారాన్ని చేపట్టింది. ప్రస్తుత పాలక ప్రభుత్వం భద్రత, సాయుధ బలగాలకు సంబంధించిన సమస్యల్ని రాజకీయం చేస్తోంది. విద్యార్ధులు, యువకులు చేపట్టే ప్రజాస్వామిక నిరసన రాజకీయాలను ఎదుర్కొనేందుకు భారత దేశంలోని యూనివర్సిటీలను మతపరమైన శరణాలయాలుగా, సాయుధ బలగాలకు ప్రతీకలుగా మార్చాలని కోరుతున్నారు.
పాకిస్థాన్‌లో
మరోవైపు పాకిస్థాన్‌, బ్యూరోక్రసీ (ఉద్యోగస్వామ్యం), మిలిటరీతో రాజకీయ ప్రక్రియను నాశనం చేసి, నిరంకుశత్వం వైపు నడిపించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఉన్నత వర్గం స్థానంలో నిరంకుశత్వం బాగా లోతుగా పాతుకుపోయినప్పటికీ 1958 నుండి అన్ని మిలిటరీ నియంతత్వాలు, మిలిటరీ పాలన పట్ల ప్రజలు పెద్ద ఎత్తున చేసిన నిరసనల ద్వారా వారి మరణాన్ని చూశాయి. ఒక సందర్భంలో ప్రజల నిరసనలతోనే పాకిస్థాన్‌ మొదటి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్‌ తూర్పు భాగంలో మిలిటరీ అణిచివేత, 1971లో ఆ రాజ్య విచ్ఛిన్నం, అంటే మిలిటరీ అనుకున్న దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. జనరల్‌ ముషారఫ్‌ పాలన ప్రజల్ని, రాజకీయ ఉన్నత వర్గాల వారిని ఒకే విధంగా దూరంలో ఉంచడం వల్ల రాజకీయ వ్యవస్థను అదుపు చేసి, ఆధిపత్యం చెలాయించే ఉద్దేశ్యం మళ్లీ ఒక న్యాయవాదుల ఉద్యమంతో, చట్టబద్ధత కోల్పోయి కుప్పకూలిపోయింది. 2008 నుండి పాకిస్థాన్‌లో నాలుగుసార్వత్రిక ఎన్నికలు జరిగాయి, సాపేక్షంగా చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన జరిగింది. అయితే ఈ పరివర్తనకు వ్యతిరేకంగా మిలిటరీ తీవ్ర ప్రతిఘటనను తెలిపింది. ఈ కాలంలోనే పాకిస్థాన్‌ రాజకీయాలకు ప్రజాస్వామిక మార్గాన్ని కొనసాగించాలని రాజకీయ ఉన్నత వర్గాలకు చెందిన వారి ఏకాభిప్రాయం కూడా తెలుసు. కానీ గడిచిన రెండు ఎన్నికలు (2018, 2024), రాజకీయ ప్రత్యర్ధులను ఎంతకైనా కొనడమేకాక మరీ ముఖ్యంగా వారిని అంతమొందించి, తుడిచిపెట్టడానికి మిలిటరీతో ఏకాభిప్రాయాన్ని కోరుకునే రాజకీయ ఉన్నత వర్గాలకు చెందిన వారి ఆందోళనకర వైఖరిని సూచిస్తున్నాయి.
అయితే రాజకీయ ఉనికికోసం మిలిటరీతో ఎత్తుగడల పొత్తుల్ని చేపట్టిన రాజకీయ ఉన్నత వర్గీయులకు, మిలిటరీకి కూడా ఫలితం చాలా ప్రతికూలంగా వచ్చింది. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా పౌరుల లోతైన, విస్తతమైన వాదనలను, అదే విధంగా ఎవరికి పాలించే హక్కు ఉంది అనే దానిపై రోజురోజుకూ రాజకీయ వర్గాలకు, మిలిటరీకి మధ్య పెరుగుతున్న వైరుధ్యాలను 2008 నుండి పాకిస్థాన్‌ చూస్తూనే ఉంది. పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఈ-ఇన్సాఫ్‌ (పీటీఐ) ప్రభుత్వం మరియు మిలిటరీ కేవలం పాకిస్థాన్‌ ముస్లింలీగ్‌ (ఎన్‌) ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రదర్శనలు చేపట్టడాన్ని చూసేందుకు ‘ఒక పేజీ’ మంత్రాన్ని ప్రారంభించాయి. మరీ ముఖ్యంగా మిలిటరీ మాత్రం తన రాజకీయ ప్రయోజనాల కోసమే ఆ పని చేసింది.
తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన తర్వాత ప్రభుత్వ తొలగింపు కోసం పీటీఐ మిలిటరీని లక్ష్యంగా పెట్టుకోవడం ద్వారా పీఎంఎల్‌ (ఎన్‌) చెయ్యాల్సిన పనిని నెత్తికెత్తుకుంది. ఫలితమేమంటే, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం దానికి విరుద్ధంగా పని చేసినప్పటికీ పీటీఐ భారీగా ఓట్లు సంపాదించి, పార్లమెంట్‌లో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ఎవరైనా తెలుసుకోవాల్సిన విషయమేమంటే, మిలిటరీతో పొత్తు, రాజకీయ ఉన్నత వర్గాలకు అధికారానికి స్వల్పకాలిక మార్గాన్ని ఏర్పరు స్తుంది కానీ రాజకీయ, సామాజిక అవగాహన కలిగిన పౌరులు ఈ కూటమిని, మిలిటరీ రాజకీయ ప్రయోజనాలను ప్రశ్నిస్తారు.
భారతదేశంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు, బీజేపీ నిరంకుశ రాజకీయాలకు వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామిక ప్రతిఘటనను చూశాయి. పాకిస్థాన్‌లో మిలిటరీ-పార్టీ బంధాన్ని ప్రజలు నిరసించి, ఎన్నికల చట్టబద్ధతను ప్రశ్నించారు. భారతదేశంలో 1975లో ఎమర్జెన్సీ లాంటి కొన్ని చారిత్రక సంఘటనలు జరిగిన సమయంలో మధ్యతరగతి వర్గాలు నియంతత్వం కోసం పరితపించారు. భారతదేశంలోని వైవిధ్యం, దానితోపాటు వచ్చే సామాజిక గందరగోళాన్ని నిర్వహించడానికి నియంతత్వం చాలా సమర్ధవంతంగా పని చేస్తుందని వారు భావించారు. పాకిస్థాన్‌లో మధ్య తరగతి వర్గం కూడా గజిబిజిగా ఉన్న ప్రజాస్వామ్య రాజకీయాలకు వ్యతిరేకంగా మిలిటరీ పాలనకు అనుకూలంగా సాంప్రదాయ రాజకీయ వైఖరిని ప్రదర్శించింది. కానీ రాజకీయాల్లోకి మిలిటరీ ప్రవేశించడాన్ని అక్కడి యువతరం చాలా తీవ్రంగానే విమర్శిస్తుంది.
దష్టి కోణంలో
ప్రజాస్వామ్యాలు తిరోగమనాన్ని ఎదుర్కొంటున్నందు వల్ల ప్రజాస్వామిక ప్రతిఘటనను ప్రదర్శించడానికి డిజిటలైజ్డ్‌ స్థలాల్ని ఉపయోగించడంతోపాటు పౌరులు కొత్త విధానాల్ని కనుగొంటున్నారు. వారు భారతదేశంలో స్థిరమైన రాజకీయ మార్పుకు దారితీసే విధంగా ఎన్నికల ఫలితాల ద్వారా తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. పాకిస్థాన్‌లో ఇది ఎలాంటి రూపం తీసుకుంటుందో చూడాలి.
(”ద హిందూ” సౌజన్యంతో)
(ఫర్హాన్‌ హనీఫ్‌ సిద్ధిఖీ, ఇస్లామాబాద్‌ (పాకిస్థాన్‌)లోని ఖాయిద్‌ ఈ ఆజమ్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌)
(అజరు గుడవర్తి జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451
ఫర్హాన్‌ హనీఫ్‌ సిద్ధిఖీ
అజరు గుడవర్తి