నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను పునరుద్ధరించాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో వచ్చేనెల ఒకటిన పెన్షన్ విద్రోహ దినం జరగనుందని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం పర్వత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జి సదానందంగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలుంటాయని పేర్కొన్నారు. 2004 సెప్టెంబర్ ఒకటి నుంచి అమలవుతున్న సీపీఎస్ విధానం వల్ల లక్షలాది మంది ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. దేశంలో నాలుగు రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని పునరు ద్ధరిస్తామంటూ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.